Sunday, February 16, 2014

మనసు విప్పి మాట్లాడుకుందాం!



 

















ఏ ప్రాంతం లో, ఏ సమాజంలో
ఏ కులం మతం లో అయినా ....
తిరిగిన ఏచోట చూసినా
తెలియని ప్రపంచానికీ ఉన్న ప్రపంచానికి
సరిహద్దు ....
ఒక చిరునవ్వు మాత్రమే!
ఎన్నో పేర్లు
ఎన్నో రకాల ముఖాలు
ఎన్నో రకాల హావభావాలు
ఎన్నో రకాల జీవన సరళులు
కానీ,
నిజమైన భావోద్వేగం మాత్రం
అందరిలోనూ ఒకేలా ఉండటం విచిత్రం
ఆ అద్భుతం .... ప్రేమ

ఒక పసి హృదయం నవ్వులో
ఒక ఎదిగిన మనిషి కన్నీళ్ళలో
చూసాను. చూస్తున్నాను.
కల్మషరహిత పరిమళం .... ప్రేమను
అప్పుడప్పుడూ అనిపిస్తుంది
నీలో, నాలో .... ప్రతి ప్రాణిలో
మననందరినీ ఏదో బంధం దారం పెనవేసుకునుందని
ఒకరినొకరం అర్ధం చేసుకునేందుకు
దోహదపడుతుందని
అది ఎంతో సుక్ష్మంగా
గుర్తించలేని చిరుగాలి లా
ఆ గాలికి రగులే చిరు వెచ్చదనం లా
దివ్యమైన ఒక అనుభూతి లా
మానవ జీవన కావ్యపు పల్లవి లా
తొలి రాగ బంధం శ్రావ్యతను వింటున్నట్లుంటుందని.

ప్రతి జీవితం లో ఒక శాసనం అయి
ప్రతి పురుషుడి హృదయం లో ఒక మహరాణి
ప్రతి స్త్రీ హృదయం లో మహరాజు .... అయిన
ఒక ప్రియ భావన ఏదో
మనసు తలుపును తట్టి ....
ఆ అస్తిత్వం
తనను తాను కోల్పోయి
లోతైన సముద్రంలో మునిగిపోవడంలో
భయంకరమైన సునామీ ....
తుఫాను బీభత్సానికి గురి కావడంలో
ఆనందాన్ని ఇష్టపడే
సున్నిత ఉద్వేగ భావనల
సమ్మేళన సమీకరణాల వైశిష్ట్యం .... గురించి
ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందామా!

మనకు ఎంతో అవసరమైన
ఆ విలక్షణ లక్షణం గురించి
జీవించేందుకు తప్పనిసరి
శ్వాస ను .... ప్రేమ ను గురించి
సాటి మనిషిని పరామర్శించాల్సిన
ఆవశ్యకత .... జీవన విధానం గురించి
ఒక ప్రాణి మరో ప్రాణి పట్ల ప్రదర్శించాల్సిన
నమ్మకం .... విశ్వాసం గురించి
రాగ విపంచి
హృదయ స్పందనలను గురించి
మనసు విప్పి
ఒక్కసారి, మరోసారి మాట్లాడుకుందామా!

2 comments:

  1. నిజమైన భావోద్వేగం మాత్రం
    అందరిలోనూ ఒకేలా ఉండటం విచిత్రం
    ఆ అద్భుతం .... ప్రేమ
    పుట్టిన ప్రతి ప్రాణిలోనూ ఒకే విధమైన స్పందన,
    మనసునిట్టే కరిగించే మధుర భావన ప్రేమే అనడంలో
    ఎంత మాత్రం సందేహం లేదు చంద్రగారు బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నిజమైన భావోద్వేగం మాత్రం అందరిలోనూ ఒకేలా ఉండటం విచిత్రం .... ఆ అద్భుతం .... ప్రేమ
      పుట్టిన ప్రతి ప్రాణిలోనూ ఒకే విధమైన స్పందన, మనసునిట్టే కరిగించే మధుర భావన ప్రేమే అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు
      చంద్రగారు బాగుంది.
      బాగుంది స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete