Tuesday, February 11, 2014

కలం కదులుతూ



 







 


మౌనాక్షరాలు కొన్ని ఆమె కలం నుండి దొర్లి
తెల్లకాగితాన్ని పరామర్శిస్తున్నప్పుడు
స్వార్ధపరుడ్ని లా ....
నేను ఆమె తొలి పాటకుడ్ని కావాలనుకుంటుంటాను.
ఆ పదాలు భావనలపై
సర్వ హక్కులూ నావే అన్నట్లు
నా ప్రియ భావనలు, నా అంచనాలు
నా తీపి భ్రమలకు లొంగి .... ఆమె
నా గురించే రాసిన పోస్టింగ్ అనుకుంటాను.

ఆమె కలంలోంచి కాగితం పైకి ప్రవహించే సిరా
నా ఆత్మకు జీవితం లా, ఆ జీవితానికి శ్వాస లా
అనుకున్నట్లు,
ఎంతో సున్నితంగా పరిశీలిస్తుంటాను.
ప్రత్యక్షంగా కానీ పరొక్షంగా కానీ
నా ప్రస్తావన ఎక్కడైనా ఉండుండొచ్చెమో అని.
ఆ అక్షరాలు కదులుతున్నట్లు
కాగితం మించి లేచి
ఎగిరొచ్చి నన్ను పలుకరిస్తున్నట్లు 
ప్రతి పదాన్నీ ఎదలో పొదువుకుంటాను.

ఎప్పుడైనా అక్షరాలలో .... ఆమె,
కుశల పరామర్శలు చదువుతున్నప్పుడు 
ఆమె వ్యక్తిత్వానికీ, కళాతత్వానికీ ఎదురుపడే
ఆ గౌరవప్రద ప్రశంసలు ఒక చక్కని అనుభూతిని కలిగిస్తాయి..
అందుకే, ఆమె భావనలను అక్షీకరించే 
ఆ సిరా అంటే నాకు అంత ప్రేమ
నా ఆలోచనలపై ఆధిపత్యంతో పాటు
అంతర్గత సమాధిస్థితిని నాలో సృష్టించి
నన్ను నియంత్రణ చేసే ఆ స్థితి 
నాకు యిష్టం ....
ఎంతో ఉన్నతం, లోతైన ఆ ప్రశంసాత్మక ఆవేశం ఇష్టం.

నాకు తెలుసు. సులభంగా చెప్పగలను.
ఆమె చేతి ఆయుధం కలం అని.
ఆ కలం విసిరిన అక్షరాల కుట్రకు
నేను లొంగిపోయానని చెబితే అది దారుణమే అవుతుంది..
నిజం మాత్రం
ఆమె ఆలొచనలకు నేను ఆకర్షితుడ్నయ్యాను.
ఆమె ఆలోచనలు నా మది లో నిండిపోయి
మైలురాళ్ళు
పరిపూర్ణ చిత్రాలు గా మారి
దిసా నిర్దేశం చేస్తుంటాయి .... నాకు,
నా జీవన రహదారినిండా అమర్చబడి.



 










ఆమె, ఒక కథ లేక కవిత లేక నవల రాస్తున్నప్పుడు,
ఒక తియ్యని సంగీతం లా
నా తెలివి ని విజ్ఞతను ప్రశ్నిస్తున్నట్లు,
ఆ సీరా అభిజ్ఞాత్మకంగా కదిలినట్లు
రా, రమ్మంటూ ఆ పదాలు
ఎంతో మంచివి లా .... ప్రేమ గా బుజ్జగిస్తున్నట్లు,
నా ఎద లోకి దూరి
ఆ సిరా ఎండిపోయినప్పుడు మాత్రం
ఒక అందమైన కళ గా మారిపోతుంటాయి.
ఆమెకు నాకూ మాత్రమే అర్ధం తెలిసే రూపావిష్కరణలు గా మారి.

 


6 comments:

  1. అక్షరం,పదం,భావం....
    కలం,సిరా,తెల్లకాగితం.....
    ప్రత్యక్షంగా కానీ పరొక్షంగా కానీ
    నా ప్రస్తావన ఎక్కడైనా ఉండుండొచ్చెమో అని....
    ఎంత సున్నితంగా వివరించారు చంద్రగారు ,చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. "అక్షరం, పదం, భావం .... కలం,సిరా, తెల్లకాగితం .... ప్రత్యక్షంగా కానీ పరొక్షంగా కానీ, నా ప్రస్తావన ఎక్కడైనా ఉండుండొచ్చెమో అని ....
      ఎంత సున్నితంగా వివరించారు చంద్రగారు,
      చాలా బాగుంది."
      చాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete
  2. అక్షరానికీ, వ్యక్తిత్వానికీ ఉన్న సున్నిత వికాస కాంతి పుంజం ఆమె కలం నుండి మీ వరకూ ప్రసరించి ఉండవచ్చు.
    మీ గూర్చిన ప్రస్తావన ఉందేమో అనుకోవటములో.... ఆమె అక్షరాలపై మీకున్న హక్కును తెలియజేస్తుంది.
    మిమ్ము తన రాతలు నియత్రిస్తున్నాయి అనటములో మీ సున్నిత లొంగుబాటు కనిపిస్తుంది.
    మీ జీవన దారి నిండా పరచుకున్న్న ఆ రాతలు మిమ్ము కదిలించే శక్తి గల కెరటాలు.

    సర్, మీ కవితలో ఓ సాహిత్య సంద్రం పై మీరు విసిరిన విజ్ఞతా వల , ఒడసి పట్టుకున్న ముత్యపు బింధువులు కనిపించాయి,
    ఇది కవితే అయినా మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.(మిత్రులుగా, గురువుగా మీ పై నాకున్న గౌరవంతో ఇలా దైర్యంగా రాశాను.)

    ReplyDelete
    Replies
    1. "అక్షరానికీ, వ్యక్తిత్వానికీ ఉన్న సున్నిత వికాస కాంతి పుంజం ఆమె కలం నుండి మీ వరకూ ప్రసరించి ఉండవచ్చు. మీ గూర్చిన ప్రస్తావన ఉందేమో అనుకోవటములో .... ఆమె అక్షరాలపై మీకున్న హక్కును తెలియజేస్తుంది. మిమ్ము తన రాతలు నియత్రిస్తున్నాయి అనటములో మీ సున్నిత లొంగుబాటు కనిపిస్తుంది. మీ జీవన రహదారి నిండా పరచుకునున్న ఆ రాతలు మిమ్ము కదిలించే శక్తి గల కెరటాలు.

      సర్, మీ కవితలో ఓ సాహిత్య సంద్రం పై మీరు విసిరిన విజ్ఞతా వల, ఒడసి పట్టుకున్న ముత్యపు బింధువులు కనిపించాయి,
      ఇది కవితే అయినా మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. (మిత్రులుగా, గురువుగా మీ పై నాకున్న గౌరవంతో ఇలా దైర్యంగా రాశాను.)."
      చాలా చక్కని విశ్లేషణాత్మక స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! గొప్ప కాంప్లిమెంట్ అనుకుంటాను. శుభారుణోదయం!!

      Delete
  3. అన్నింటిలో అక్కడుందా ఇక్కడుందా అని మీరు వెతుకుతుంటే...తనేమో తనే మీరంటుంది :-)

    ReplyDelete
    Replies
    1. "అన్నింటిలో అక్కడుందా ఇక్కడుందా అని మీరు వెతుకుతుంటే .... తనేమో తనే మీరంటుంది :-)"
      శరీరం ఆత్మ మది ఎద వాక్యం పదం అక్షరం భావం అవినాభావసబంధాల సూక్ష్మ పరిశీలనే మనిషి పరితపన అనిపిస్తుందప్పుడప్పుడు.
      చక్కని స్పందన స్నేహ ప్రోత్సాహకాభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! సుప్రభాతం!!

      Delete