Friday, February 15, 2013

తెలుసు నాకు


నా ప్రేయసి నాతో అంది
ఎదురుగా కూర్చుని .... నేను
ఆమె కళ్ళలోకి చూసినప్పుడు
"నీవు గొప్ప జ్ఞానిని
నీలో దివ్య తేజస్సుంది!" అని
ఆలోచిస్తే ....
ఎంతో బాధగా ఉంటుంది.
నేను జ్ఞానిని అని తెలుసుకోవడానికి
ఎంత పెద్ద మూల్యాన్ని
చెల్లించాల్సొచ్చిందో పరిగణలోకి తీసుకుంటే,
ఒక పది గ్రాముల
వివేకం, పరిజ్ఞానం కోసం పరితపన
ఎన్నెన్ని అనుభవరాహిత్య
పొరపాట్లకు కారణమో అని ఆలోచిస్తే
నాకు తెలుసు
తొలి అనుభవం .... ప్రేమ కోసం ,
నేను అక్కడా విఫలమయ్యాను
తొలిసారి తొలకరి భావనలు
ఆనందం, ఉల్లాసం, విడదీయలేని సంభావనలు
తెలుసుకునేసరికి ఆలశ్యం అయ్యింది.
వాస్తవిక సముద్రేక ప్రేమికుడ్నై
ప్రేమను బహుమానంగా పొందాను.
నాకు తెలుసు
మరణం ముగింపని
జీవితంపై దాని ప్రభావం
నా దృష్టిలో అది ఏమిటో
అది నా దాకా వస్తే ఏమౌతుందో అని
ప్రమాదాలకు దగ్గరగా మెదిలి తెలుసుకున్నాను.
గర్వం, అభిమానం, హోదా
జీవితంలో వాటి స్థానం,
ఆపేక్షలు ఆశయాలు ఆవేశాలు
సెగలు నానుంచి వెదజల్లుతూ ఉన్నా ....
సూచన లేని వినయంలా, 
ఒక రోజు పంచభూతాల్లో ఒకటైన భూమి ....
ఆరడుగుల స్థలంతో .... ఎదురుచూస్తుండటం నిజం! 

No comments:

Post a Comment