Monday, February 18, 2013

నరకం సరిహద్దుల్లో ....


ఇక్కడ, అక్కడ
హృదయంలో, ఆత్మలో
ఆలోచనల్లో,
చర్మంలో, ఎముకల్లో ....
ఏదో జరుగుతుంది కానీ అర్ధం కావడం లేదు.

కుడివైపున, ఎడమవైపున ....
గుండె రక్తాన్ని స్రవించేవరకూ,
శరీరం ఎముకలు చిద్రం అయ్యేవరకూ,
బరించలేని బాధ కన్నీరై ఉబికొచ్చేంతవరకూ,
ఏదో జరుగుతుందని తెలుసు కానీ అర్ధం కావడం లేదు.

బడిలో, గుడిలో
బజార్లో, ఇంటిలో
తలలో, గుండెలో
ఆలోచనల్లో, ఆత్మలో
ఏదో జరుగుతూనే ఉంది అయినా అర్ధం కావడం లేదు.

కలల్లో, నిద్రలో
బాత్రూంలో, ఒంటరితనంలో
మంజీరా జలంలో, నా గదిలో
నా ఇంటిలో, నా మంచంపై, నా ఏకాంతంలో
నా ప్రతి గంట, ప్రతి క్షణమూ .... జీవితంలో
ఏదో జరుగుతుంది అది ఏమిటో తెలియటం లేదు.

కోపం తో, ద్వేషం తో
గాయం తో, అత్యాశ తో
బాధ తో, న్యూనతాభావం తో
దిగులు తో, అయోమయం తో
నాలో ఏదో కలవరం కానీ అది ఏమిటో తెలియటం లేదు.

సంసారమూ, స్నేహితులూ
ప్రపంచమూ ....
నేను ప్రేమించిన మనుషులూ
అంతా ఒక్కటయ్యారు
నా చుట్టూ చేరి నాపై కుట్ర పన్నుతున్నారు.
ఏదో జరుగుతుందని తెలుసు .... అది ఏమిటో తెలియటం లేదు.

నొప్పి, బాధ .... కణకణాన్నీ తడుముతున్నాయి.
నాలో స్థిరబుద్ధిలేకుండా చేస్తున్నాయి.
మాత్రలు వేసుకోకుండా ఉండలేకపోతున్నాను!
సిరలు దమనులు మత్తు మాదకద్రవ్యాలతో నింపుకోవాలి.
ఏదో జరుగుతూనే ఉంది అయినా అర్ధం కావడం లేదు.

నిద్రలో, మత్తులో, కాల్పనిక స్వర్గంలో ....
వెలుతురు తెలియని అయోమయంలోకి వెళ్ళిపోతున్నా!
అయినా నాకు తెలుసు.
నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని
ఎప్పటికీ తెలుసుకోలేనని .... భరించలేని నొప్పికి కారణాన్ని!
అందుకే,
ఏ వెలుగో నా నొప్పికి నాకు ముగింపు చెప్పే క్షణం కోసం .... ఎదురుచూస్తున్నా!

No comments:

Post a Comment