Sunday, February 24, 2013

యుగయుగాల ప్రణయం .... ఈ సంసారం



ఒంటరిని నేను అనుకోవడం
ఒక మింగుడుపడని భావన!
ఒంటరిగా ఉన్న ప్రతిసారీ
మది రోధిస్తూనే ఉంది.
ఒంటరితనానికి
ఓ భాష్యాన్నివ్వాలని
ఒక తోడు
ఒక ఏకాంతం కాని
అర్ధాన్ని వెదకాలని ....
మది పరితపిస్తూనే ఉంది
ఔనూ!
ఒంటరినేగా .... నేను
ఈ లోకంలోకి వచ్చినప్పుడు,
ఈ లోకము నుంచి నిష్క్రమించేప్పుడు,
మరి,
ఈ పరితపన ఎందుకు

నేను
నేడు రాయనుకునేది
రాయి కాదని .... తెలుసు
తెలుసు .... నిన్నటి నీరు, నిన్నటి ఇసుక .... సమ్మేళనం అని,
కొన్ని లక్షల సంవత్సరాల కలయికల ... పరిణామం అని,
నా తోడును ....
నిన్ను,
కటిక చీకటిలో అయినా .... గుర్తించగలను.
గుర్తించగలను. .... కదులుతున్న చైతన్యాన్ని
కుళాయిల్లోంచి ఉరికొచ్చే .... నీళ్ళ శబ్దం
నీ కాలి అందెల సవ్వడిని ....
నేనీ జగతిలో పడిన నాడే
నీవూ పుడతావని తెలుసు!
గతజన్మ సుకృతం .... కర్మల
సమాధి మీంచి
తలుపుల ద్వారా మొలకెత్తుతావు అని

ఒంటరిగానే నేను
గుండెను సమాధానపరుచుకుంటాను.
పసితనపు ఎదుగుదల ....
ఎముకలు, మాంసం .... గట్టిపడి,
రేపు వైపు పగిలిపోవడం
వయసు రావడం ....
రెక్కలు అమర్చుకుని .... ఊహలు ఎగరడం,
మందహాసాన్ని ధరించి
సొగసరివి నీవు ....
నా ప్రపంచంలోకి రావడం
కాలమహిమ అనుకోలేను.
ఒంటరిని నేనీ జగతిలో అని .... తెలుసు!
తెలుసు .... ఏదో ఒక రోజు చనిపోతానని,
జీవితం .... ఈ ఘనమైన శిల
ఇసుక నీరు కలిసిన
ఎన్నో జన్మల సాహచర్యం అని,
యుగయుగాల ప్రణయ రాగం .... బంధం అని,



No comments:

Post a Comment