భయం నాలో, నీవు గమనిస్తావేమో అని,
నా .... బలహీనతల్ని, మొహమాటాల్ని, సాగదీతల్ని
దేన్నీ కడుపులో దాచుకోలేని నా మనోలక్షణాన్ని
కనపడకుండా దాచుకునున్న ఏదో నొప్పి
నీకు కనిపిస్తుందేమో అని,
నేను మాట్లాడితే వినాలనుంటుంది నీకని తెలుసు ....
కానీ, భయం
మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడటం ఆపనని
ఆశలను ఏకరువు పెడతానేమో
కోరికలను కక్కేస్తానేమో అని
ఆర్ధిక స్వాతంత్రం లేని ప్రేమ అపభ్రంశం పాలౌతుందనే
భయం ఉంది లోలోపల
నీవు నా జీవితం లో ఒక భాగానివైనట్లు
నీవు నన్ను చూస్తున్నప్పుడు నీ కళ్ళలో ఆ నమ్మకం
నాకెంతో ఇష్టం!
ఆక్షణాల్లోనే నీతో కలిసి ఎగిరిపోవాలనిపిస్తుంటుంది.
ఎగిరేందుకు ఊహల రెక్కలు .... తెచ్చుకోవాలనుంటుంది.
ఆఖరి క్షణం లోనైనా నిన్ను చేరగలనా అనిపిస్తూ
చేరేందుకు ప్రయత్నించాలని పట్టుదల .... కానీ
భయం నాలో .... నువ్వెక్కడ దూరమైపోతావో అని
నా రహశ్యాలు భయాలు నీముందు పరిస్తే ....
నా హృదయపు దడలో, నా ప్రతి శ్వాసలో
నా కలల్లో ఎప్పుడూ నీవేఉన్నావని ఎక్కడ తెలుస్తుందో అని,
మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడుతూనే ఉంటాను
నేను నిన్ను ప్రేమిస్తున్నాననే నిజం
నీముందు ఎంతకాలమో దాయలేను.
ఎన్నాళ్ళనుంచో నీవు నా కోసం ఎదురుచూస్తున్నావని తెలుసని
నీతోనే చెప్పేస్తానని భయం నాలో
ఇంకా స్థిరపడని నేను, న్యాయం చెయ్యగగలనో లేనో
అనే ఆలోచన, భయమే నాలో అంతటా .... కానీ,
నీవు నా జీవితం లో లేవు అనే ఆలోచనను మించిన భయమా ....?
ఆలోచిస్తుంటే భయమేస్తుంది మరింతగా .... నిజం
నిజంగానే వెళ్ళిపోవాలనుకున్నాను. వెళ్ళలేకే ఉండిపోయాను నీ కోసం
No comments:
Post a Comment