Friday, March 13, 2015

వెలుగు నీడలే అవి


నీ నొప్పిని చూడగలుగుతున్నాను.
నీ కళ్ళలోకి చూస్తూ
నీవు అద్దుకున్న
ఆ చిరునవ్వు వెనుక గాయాల్ని చూడగలుగుతున్నాను.

ఈ రహదారులన్నీ తిరిగున్నాను.
అర్ధం చేసుకోగలను
శూన్య భావనల్లో
వాస్తవికతానుభూతిని వెదుక్కుంటున్నావని.

తుఫాను వాతావరణంలో
కన్నీళ్ళు దాచుకునే ప్రయత్నాన్నీ
జ్ఞాపకాల భయాల నీడలు
వెంటాడుతుండటాన్నీ చూస్తున్నాను.

నీ మార్గాన్నీ
జీవితాన్నీ సుగమం చేసుకోవచ్చు
మనస్పూర్తిగా నమ్ము
నన్ను, నా మాటల్ని .... జాగ్రత్తగా విను.


నీకు అవసరమైనప్పుడు నీ పక్కనే ఉంటాను
నీ హృదయం
సలుపుతున్నప్పుడు
నీ ఆత్మ అసంతులమైనప్పుడు నీ జతనై ఉంటాను 

నీకు తోడు కావాలనిపించినప్పుడు
నీ వద్దకు ఒస్తాను
నీడలా నడుస్తాను
నిన్ను నీవు దాచుకోవాల్సిన పని లేదు.

నీవు కొన్ని జ్ఞాపకాలను
దాచుకునే ప్రయత్నం చేస్తున్నావు
హృదయద్వారాలను
తెరిచేందుకు భయపడుతున్నావు, మూసి ఉంచకు.

గతాన్ని కాలానికి వొదిలెయ్యక తప్పదు ఎవరికీ
వొదిలెయ్యి
నా కళ్ళలోకి చూడు
అక్కడ నిర్మలత్వం నిజమైన ప్రేమ కనిపిస్తుంది చూడు.

నా చేతిలో చెయ్యి వెయ్యి
నీ ఎద తలుపులు తెరువు
హామీ ఇస్తున్నాను
సురక్షితం సుమా అని, ఒక నూతన ఆరంభానికి

ఇకపై నీవు దేనికీ భయపడనక్కర్లేదు
నీ సమీపం లోనే నేనుంటాను
పవిత్ర ప్రేమ ఎలా ఉంటుందో
జతగా అనుభూతి చెందుదాము.

పిల్లా! గతం లానే భవిష్యత్తుంటుందనుకోకు
నాకో అవకాశమివ్వు
జీవితం ఎంత అమూల్యమో
ఆ మాధుర్యం అర్ధం చేసుకుందువు గానీ

నిన్నటివరకూ నీవు భరించిన
వెతల చీకటి అనుభూతులు
మరిచిపోయేలా జీవన రహదారిని మార్చేందుకు
నాకొక అవకాశాన్నివ్వు

నేను నోతోనే ఉంటాను ....
నీకు అవసరమైనప్పుడు ....
నీవు కోరుకున్నప్పుడు, జతలా నీడలా
నీ అంతర్వాణినై, మనోధైర్యాన్నై

2 comments:

 1. నీవు అద్దుకున్న ఆ చిరునవ్వు వెనుక గాయాల్ని చూడగలుగుతున్నాను...super like

  ReplyDelete
  Replies
  1. నీవు అద్దుకున్న ఆ చిరునవ్వు వెనుక గాయాల్ని చూడగలుగుతున్నాను...సూపర్ లైక్
   బాగుంది అభినందన స్నేహ ప్రోత్సాహక స్పందన
   ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!

   Delete