Monday, March 2, 2015

శాపగ్రస్తురాలు



ఆమె తనను తాను తిట్టుకుంది.
అతను దూరమై మాయమయ్యాడని ....
అందుకు కారణం తనే అని.

అమాయకత్వం, ఉత్సుకత లక్షణాలనే చూసి విసిగిపోతాడనుకోలేదు.
ఆ రక్త నాళాల్లో తన రక్తమే ప్రవహిస్తుంది అని,
అతని గుండెలో తనది స్థిర వాసం అని ....
ఊహించుకుందే కాని.
నిష్కల్మషమూ, పరిపూర్ణమూ అని ఊహించుకున్న
తన ప్రేమ
ఒక అపరిపక్వ అమాయకత్వ దిశారహిత లక్షణం అవుతుందనుకోలేదు.

ఆలశ్యంగా అవగతం అయ్యింది.

అతనికి ఇతరుల భావనలతో
ఇతరుల జీవితాలతో ఆడుకోవడం ఇష్టం అని.

మార్చి మార్చి అవకాశమూ అదను కోసం
వేచి చూస్తున్న సమయం లో
తను ఎదురయ్యాను అని.
కోరికలు తీర్చుకునేందుకే మాయమాటలు
ఆ లౌక్యం ప్రయత్నాలు చేసాడు అని తెలిసి బాధపడింది.
ఎంత దుర్మార్గుడు వస్తువును లా చూస్తున్నాడు అని.

అయినా ప్రేమించింది.
నిజంగానూ, అమితంగానూ ....
అతనే తను లా.
తన అణువణువూ అతనే అన్నంత గాడంగా.
అతనిలో ఎన్ని లోపాలున్నా,
ఆ ఆలోచనలు అపరిపక్వమే అయినా ....
సరే అనుకుంది. 



అతను తనకు కావాలనుకుంది.
అతనెప్పుడూ తన సరసనే ఉంటూ
ఎంత పొందినా చాలదన్నంతగా
అతన్ని తన ఇష్టాలకు అణుగుణంగా మార్చుకోవాలి అని.
ఆశపడింది.

అతనో గాలి మనిషని.
గాలిని కట్టెయ్యడం అసాద్యం అని తెలిసి కూడా

నిజానికి అతనెప్పుడూ
తనను శాశ్వత జత అని అనుకోలేదు.
అలా నడుచుకోనూలేదు.

అందుకే,
ఎక్కడ ఉన్నాను అని తెలియని చోటుకు తీసుకువచ్చాడు.
ఒంటరిగా వొదిలి వెళ్ళిపోయాడు
అలాగైనా అర్ధం అవుతుందనుకున్నాడో ఏమో.
అతనితో కలిసి నడిచిన ప్రతి ప్రదేశమూ,
చూసిన ప్రతి దృశ్యమూ ....
అందంగా, ఆహ్లాదంగా ఉండదని తెలపాలనుకున్నాడో ఏమో .

ప్రేమించి. కావాలనుకున్న తోడు,
తోడుగా లేకపోతే ఏవీ అందంగా ఉండవు అని, తెలిసే.

మొదటిసారి అర్ధం అయ్యింది పూర్ణమ్మకు.
తుఫానులు సునామీలకు మనుషుల పేర్లే ఎందుకు పెడతారో అని.

ఆమె ఆలోచనల్లో ఇప్పుడు ....
అతను,
అతనొక తుఫాను
ఆమె జీవితం లో,
రక్తనాళాల్లో, కణాల్లో, మది పొరల్లో, అంతరాంతరాల్లో
లోలో ఎక్కడచూసినా
శరీరాన్నే కాదు
ఎదనూ ఆత్మనూ ఆవహించిన అపవిత్ర శాపం లా.

No comments:

Post a Comment