Friday, January 31, 2014
Thursday, January 30, 2014
కనపడని కుతూహలం

కాసింత బిడియము
కాసింత పిరికితనము, అమాయకత్వం
నిరాడంబరత .... తప్పు కాదు.
ఔనా!?
.....................
హల్లో ఎవరక్కడ?
.......................
ఓ అమ్మాయి!
అవును.
నిన్నే .....
నేను రాస్తున్న ఈ మనోభావనల్ని చదువుతున్నావు గా!?
ధన్యవాదాలు!
ఉదారస్వభావురాలివి లా ఉన్నావు.
ఔనూ! నేను రాసింది నిజంగా అర్ధవంతంగా ఉందనుకుంటున్నావా?
మది పరితపన
బృందావనం,
నీ మనో ఉద్యానవనం .... ఎంతో దూరం లేదు.
రావాలనుంది. విహరించి పరవశించేందుకు,
నీ పక్కన, నీతో కలిసి
నీ చెయ్యందుకుని .... నడవాలని.
ఆ జ్ఞాపకం .... నాపరాయి మీద రాసుకుందామని,
నా మది పొరల్లో, దాచుకుందామని ....
నీ పేరును నా పేరుతో జత చేసి.
అది మది, ఎదల సంతులనమేమో మరి!
నీ ప్రపంచంలోకి రావాలనుంది. వస్తున్నా
తళతళమని మెరిసే నీటి బిందువులా ....
ఓ సౌందర్యమా! వస్తున్నా!
నిండుగా, అంతర్లీనంగా
ఆనందం తో ప్రకాశిస్తున్న ఆత్మ సౌందర్యమా!
ఈ చల్లగాలి నా చెవిలో గుసగుసలాడుతుంది.
ఏ ప్రమేయమూ లేకుండానే .... నాలో ఆహ్లాదం,
ఎంతో ఉల్లాసం కలుగుతుంది.
నీతో చెప్పాలని మనసు పరితపిస్తుంది
ఈ ఆనందానికి, ఉల్లాసానికి కారణం నీవని
మరి కాస్త దూరం .... నీతో ముందుకు నడిచి
ఎక్కడైనా, ఏ మధుర జ్ఞాపకాల పరిమళాలనైనా
గమనించగలమేమో అని ....
వీలైతే, ఆ పక్కనున్న నాపరాయి మీద
నా పేరును, ఆ మధుర స్మృతుల
సాక్షినని నేనే అని రాసుకుందామని
ఓ అద్భుత సౌందర్యమా!
తళతళమని మెరుస్తున్న వజ్రం లా
నీ ప్రపంచం లోకి రావాలనుంది.
రావాలనుంది .... ఆకు ఆకు మీద, పువ్వు పువ్వు మీద
తళతళమని మెరిసే మంచు నీటిబిందువునై
నీ జగతి లోకి .... వర్షపు చిరు చినుకునై
మనసున్న మనిషినై .... నీ జీవితం లోకి ఓ సౌందర్యమా!
Wednesday, January 29, 2014
అలక్ష్యం చేస్తూ ....

దూరంగా ఉండి నన్నే చూస్తున్నావు!
ఇక్కడ ఈ గదిలో, ఈ చీకటిలో
ఒంటరి మౌనాన్ని, నన్ను,
కిటికీలోంచి బయటికి శూన్యం లోకి చూస్తూ ఉన్న
బండబారి గమ్యం కోల్పొయిన గుండె ను,
దారం తెగి రాలి పడిపోతున్న గాలిపటాన్ని
నీడలా అలా నీవు
నన్ను ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది.
చేతులు చాచి రా, రమ్మంటున్నట్లు
నీ పిలుపును
నేను గమనిస్తున్నానో లేదో అన్న భావనతో
ఎవరూ ఇష్టపడని ఒంటరితనం
ఏడుపు .... తగదు అని చెబుతూ,
చేరదీసి, గుండెల్లో దాచుకునే ఔదార్యానివి లా ....
తీవ్రంగా గాయపడి ఉన్నానని,
అమూల్యమైన సమయం వృధా అయ్యిందని,
ఎవరికీ ఇష్టం లేని ఒంటరితనాన్ని .... తరిమికొట్టే
నన్నెందుకు ప్రేమించనియ్యవు అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది.
నీ గొంతు స్పష్టంగా
నీవు పాడుతున్న ఆ పాట ....
ఆ బుజ్జగింపు రాగం .... మనోజ్ఞంగా వినిపిస్తుంది.
సుతిమెత్తటి అనునయం నన్ను లొంగదీసుకుంటుంది..
ఉన్నదాన్ని ఉన్నట్లుగా లేచి, పరుగు పరుగున వచ్చి ....
నిన్ను చేరి చుట్టెయ్యాలన్నంత బలంగా,
అసహనం, నిరాశక్తత ప్రబలక మునుపే
నీ వద్దకు చేరాలని
బిర బిరా పరుగులుతీస్తూ .... నీ కౌగిట్లోకి
ఈ శ్వాస ఆగక మునుపే
నా నిర్ణయం .... ఒక లక్ష్యసాదన గా మారాలనేంతగా,
నీవు నా అవసరం, శ్వాసవై
నీ జీవితం అవసరం నేనే అన్నట్లు నీవు నన్ను.
"దూరంగా వెళ్ళొద్దు,
నన్నొదిలి ,ఎటూ .... వెళ్ళొద్దు! దురంగా," అని
అనుకునే విధంగా, గొంతెత్తి పిలిచేలా
ఎవరికీ ఒంటరిగా ఉండాలని ఉండదు ....
అయినా .... నాకే ఎందుకో? ఎందుకు?
ఒంటరి ఆవేదనలో ఈ ఆనందం!
దురంగా నీడలా నీవు, చేతులు చూచి రారమ్మని పిలుస్తున్నా
నీ ప్రేమాహ్వానం పిలుపుల్ని అలక్ష్యం చేస్తూ,
Tuesday, January 28, 2014
పాట ఒకటి రాయాలని
కాలం ముఖద్వారం లో
నిలబడి ఎదురుచూస్తున్నా!
ఆ దుర్భేద్య ద్వారాలు తెరుచుకుంటూనే,
చదునైన
పాలరాళ్ళ నేల పై,
నా మనోభావనలను కావ్యం గా రాయాలని ....
యాంత్రికంగా కదులుతున్న కాల చక్రం ఇరుసు లో
నలిగి మారిపోయి
ఒకనాడు రక్తవర్ణ ప్రేతవస్త్రం కప్పబడాల్సిన
ఒక మబ్బునని,
రంగరంగ వైభవం గా,
కిరీటము రాజచిహ్నాలు ధరించి ....
తళుకు, మిణుకుల, క్షణీకజ్యోతినై,
నిద్దుర లో ఉలికిపాటు ....
కొత్త కలనై,
ఆరడుగుల లోతు విడిది మాత్రమే శాశ్వతమని
అర్ధం ద్వనించే
పదాలతో
పాట ఒకటి రాయాలని ....
Monday, January 27, 2014
Sunday, January 26, 2014
కవయిత్రిని కాను
నన్నందరూ కవయిత్రి అనే పిలుస్తారు.
నిజానికి
నేను కవయిత్రిని కాను. రాయలేను.
నీవు నా జీవితం లోకి ఎలా నడిచొచ్చావో
నా భుజాలమీద చెయ్యేసి,
నన్నెలా దగ్గరకు తీసుకున్నావో ....
అంతలోనే దూరమౌతూ .... వెళుతున్నానని,
సంకేతమైనా ఇవ్వకుండా ....
ఎలావెళ్ళిపోయావో అని.
నేను రాయలేను.
నీవు, నా హృదయాన్ని పగలగొట్టిన
ఆ రాత్రి గురించి,
ఆ రాత్రిని గురించి .... మాత్రమే కాదు.
నీవు, నీ దినకృత్యాల్లో భంగపడి,
అవమానపడిన ప్రతి రోజూ .... ఆ ప్రతిక్రియను
నా హృదయాన్ని బ్రద్దలు చేసి ఆనందించావని,
నిర్ద్వందంగా నేను రాయలేను.
ఒక మనిషి .... అంత దారుణంగా
అబద్దాలు ఆడతాడు అని కాని,
మరో మనిషిని మార్గమధ్యం లో
అంత నిర్దయగా అలా
అనాదగా ఒదిలెయ్యగలడు అని కానీ,
ఏడుపుకు కారణాలెన్నో నేను రాయలేను.
నా శక్తికి, ఊహకు అందని అనర్ధాలవి.
ఎందరో నన్ను అంటుంటారు రచయిత్రీ అని.
కానీ, నేను రచయిత్రిని కాను.
నాకు రాయడం రాదు.
నేను ఎంతవరకు రాయగలనని అనుకుంటానో
అంతకు మించి రాయలేను.
బలవంతంగా ఎప్పుడైనా రాయాలని కూర్చుంటే,
ఆ పంక్తుల మధ్యకు,
ఆ అక్షరాల మధ్యకు,
ఆ ఖాళీ స్థలాల మధ్యకు నీవు వస్తే
చూడాలని ఉందని రాయాలని ఉంటుంది.
అది ఒక కల అని,
అది నీవు నా నుదుట ముద్దాడి,
నిద్రలేపుతున్న పీడకల అని .... రాయాలనుంటుంది.
కానీ, అది నిజం కాదు. ఎంత నేను రాసినా.
అన్ని రంగులను సరైన పాళ్ళలో కలిపినప్పుడే
స్వచ్చమైన మరోరంగు వచ్చేది.
నేను రాయలేను. నిజం!
పిసినారితనం కన్నా
ఎందుకు కోపం, బాధే నయం అని,
చిరాకూ, బుర్ర బ్రద్దలు కోవడం కన్నా
ఆలోచించకుండా ఉండటం .... ఎందుకు మేలో అని.
నాకు, నీగురించి మాత్రమే రాయాలని ఉంటుంది.
నీ గురించే .... ఒక్క నీగురించి మాత్రమే.
కానీ రాసిందే రాయడం నాకు చిరాకు.
ఎన్నోసార్లు రాసుకున్నాను కనుక.
నీ గురించి మరి రాయలేను.
చదివేందుకు నీవు లేవని .... నేను రాసేందుకు
కొత్తగా మన మధ్య ఏమీ లేదు కనుక రాయలేను.
జీవితం నన్ను బాధిస్తుంది.
భూమాత ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది.
ఎందరో పిల్లలు ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు.
ఈ నీరు,
ఈ గాలి,
ఈ అగ్ని,
ఆ ఆకాశం,
ఆ సూర్యుడు నిత్యం తల్లడిల్లుతూనే ఉన్నారు.
అమాయకపు బాల బాలికల హృదయ సంరక్షణ కోసం ....
కానీ,
మరి అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకుంటూ,
ఆ కాలపురుషుడు మాత్రం కదులుతూనే ఉన్నాడు.
Saturday, January 25, 2014
తేడా ఉంటుందనుకోకపోవడమే తేడా
ఆమె నన్ను నన్నుగా స్వీకరించినప్పుడు
ఒడిదుడుకుల సునామీ .... జీవితం తో
ఒంటరిగా పోరాటం సాగిస్తున్నప్పుడు,
అందమైన అడవిజింక తన జడ కొమ్ముల్తో
నా మొండి మది కణాలను పొడిచి
మచ్చిక చేసుకున్నట్లు
బలంగా ఆమె నన్ను తన గుండెల్లోకి లాక్కున్నప్పుడు.
అలసిన అవిశ్రాంత యోధుడికి
శారీరకంగా కాసింత విరామం దొరికినట్లయ్యింది.
అర్ధరాత్రి కలలో
యోగవిద్య తో గాలిలోకి లేచి సేదదీరుతున్న భావనలా,
చిత్రంగా అనిపించింది.
గాలి, అగ్ని, వెచ్చదనం, మంచుతనం లా,
అదృష్టం నన్ను నిమురుతూ ఉన్నట్లనిపించింది.
ఆమె నవ్వినా, నవ్వించినా
ముద్ద మందారమేదో
నా తోడుగా ఉందనే తియ్యని అనుభూతి
ఆమె గాయపడ్డప్పుడు .... చేదు విషం లా
బాధను రుచి చూస్తున్నట్లుండేది.
ఒక పరిపూర్ణ
ప్రేమ సాన్నిహిత్య ఆస్వాదనలా
అప్పుడప్పుడూ
ఆమె నన్ను ద్వేషిస్తుండేది ....
మొండోడివి, నీతి నిజాయితీ కూడుపెట్టవు అని,
నన్ను అవమానిస్తుండేది.
తను నన్ను కలిసుండలేదనుకోమంటూ ....
నేనేమిటో నాకు గుర్తు చేస్తుండేది.
నన్ను నేను కూడా ద్వేషించుకునేలా ....
అప్పుడు నేనొక పిచ్చివాడ్ని
ఒక వింతను.
చూసి విజ్ఞత పొందాల్సిన ఒక అనుభవాన్ని.
గమ్యం నిర్వచించబడని
తెలియని ఒంటరి బాటసారిని.
కాళ్ళీడ్చుకుంటూ
గుండీలు కూడా పెట్టుకోని వస్త్రధారణ తో ....
రాత్రిళ్ళు నేల ఒడిలో తలదాచుకుని సేదదీరుతూ,
నా చీకటి రాత్రులను
అందంగా, తళుకు బెళుకులు కాంతితో
వెలిగించిన ఆ లక్షణం, ఆమె నన్నిడిచి వెళ్ళిపోయింది.
ప్రేమ అడుగంటి పోయింది.
మరొక వ్యక్తి ప్రేమ కో, డబ్బుకో
సొంతం అయ్యింది.
అవి రెండూ సమతుల్యంగా లేని నాకు దూరం అయ్యి.
అది నా వద్ద లేదు.
రాదు. పొందలేను.
మా ప్రేమ కష్టాల్లో పడ్డ క్షణాల వరకూ
అదే ముఖ్యం అని నేను అనుకోలేదు.
ఆమె అనలేదు. ఆమె అబద్దం ఆడింది.
ఆ అబద్దాన్ని ద్వేషిస్తున్నాను.
ఆమెను లా .... ఆమెను ద్వేషిస్తూ,
ఇప్పుడు నన్ను నేను ద్వేషించుకుంటున్నాను.
ఎప్పుడూ అనుకోలేదు
నేను జీవితాన్ని ఇంతగా ద్వేషిస్తానని
యుద్దం లో అంగవైకల్యం పొందిన్నాడు కూడా
జీవితం తో పోరాడాను కాని వైరాగిని కాలేదు.
బహుశ ప్రేమ విషయం లోనే ....
నా అంచనా తప్పయ్యింది.
దేశాన్ని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం లో
అంతరం ఉండదనుకోవడం లోనే .... తేడా అంతా!
ఎప్పుడైనా

ఎప్పుడైనా ఎక్కడైనా ....
స్త్రీ కంట తడిపెడితే, విలవిలా ఏడిస్తే
ఆ ఇంటికి సుఖశాంతులు ఉండవు.
ఆ ఏడుపు తుఫానైతే, పరిసరాలు మసకేసి పోతే
ఎలా అనునయించాలో తెలియకపోతే
ఏమీ మాట్లాడకు.
ఆమె గుండె చల్లారేవరకూ రోదించనీ
ఏ నిజమూ, ఏ అబద్దమూ
ఆ క్షణం లో ఆమె బాధను తగ్గించలేవు.
అర్ధం చేసుకున్నవాడిలా ....
మౌనంగా ఆమెను దగ్గరకు తీసుకుని
ఒక నేస్తం లా ప్రేమగా
నీవున్నాననే నమ్మకం కలిగించగలవే కాని.
ఆ ప్రకృతే విలపిస్తే
వరదై, తుఫానై విషాదగీతం పాడితే,
ఎంతటివారికైనా తలొంచుకోక తప్పదు.
క్రమశిక్షణతో సంబాళించుకోక తప్పదు.
వాతావరణం కుదుటపడి
ఉదృతి చల్లారి ప్రశాంతతను చూడాలనుకుంటే
పరిస్థితులను ప్రేమగా స్వీకరించక తప్పదు.

ఎప్పుడైనా నీ భార్యా మణి కంట తడిపెడితే
కాలయాపన చెయ్యకు .... ఆలోచిస్తూ
ఏమి చెబితే బాగుంటుందని, ఎలా నమ్ముతుందని
ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి
కొంతైనా బాధ .... ఉపశమనం గా మారేవరకూ
నిండుమనసు తో దగ్గరకు తీసుకో .... చాలు.

ఎప్పుడైనా ముంగిటి లో స్త్రీ ఏడిస్తే, కంటతడిపెడితే
శుభసూచకం కాదు. కలలు కుప్ప కూలిపోతాయి.
కన్నీరు ఉప్పెనగా మారి ప్రశాంతత కోల్పోతావు.
నీ గుండె బ్రద్దలౌతుంది.
అప్పుడే, నీకు అర్ధం అవుతుంది.
ప్రేమగా పొదువుకుని, ఆమెకు నమ్మకం కలిగించాలని
తోడుగా నీవున్నావని .... నీవూ రోదిస్తున్నావని.
Friday, January 24, 2014
అస్పష్టంగా

నాకు నీవు గుర్తొస్తుంటావు.
నన్ను నేను మరిచిపోయిన ప్రతిసారీ ....
జ్ఞాపకాల పుటలపై,
..........
నిశ్శబ్దంగా .... పేరుకుపోయిన దుమ్ములా
పేజీలను పుస్తకంగా కలిపి కుట్టిన దారం
బంధం లా .....
ప్రతి వాక్యం లోనూ, ప్రతి భావన లోనూ
ఎంతో తెలివిగా నైపుణ్యంగా దాక్కుని
ఆదమరచిన నిద్రలో నవ్వు అనుభూతి వి లా
.......
ఎప్పుడైనా జ్ఞాపకాలపై దుమ్ము దులిపి
పుస్తకం మధ్యలో ఏ పేజీలోకైనా తొంగి చూస్తే,
అక్కడ నా హృదయం నాకు కనిపిస్తుంది.
నీ భావనల అక్షరాల్లో కూరుకు పోయి
.......
చాలా కాలం అయ్యింది .... నీవు
నన్నూ ఈ లోకాన్నీ వొదిలి వెళ్ళిపోయి
ఓ ప్రియా!
కోపగించుకోకేం?
మత్తులో మరికాస్త మునగి,
నన్ను నేను మరిచి నీ జ్ఞాపకాలను పలుకరిస్తున్నానని.
స్త్రీ హృదయం
ఈ వెదుకులాట ఎన్నాళ్ళుగానో అన్ని కోణాల్లోనూ
మది భూతద్దం తో .... చదవాలని చూస్తున్నాను.
ఒక స్త్రీ హృదయం అంతరంగాన్ని. ఆ అంతరంగం లో,
ప్రేమ ఖనిజాన్ని కనుగొని, పొందుదామని
ఆ స్త్రీ భావోద్వేగ ఆనందోల్లాసాల సంపదను
ఆకశ్మిక ప్రేమకు హక్కుదారుడ్ని అవుదామని
కానీ, ఎన్నో విధాలుగా పరిశ్రమించి శోధించాక
సమయమూ మూల్యమూ చెల్లించాక,
అందని ఆకాశం .... వైశాల్యం హృదయాన్ని
సముద్రమంత .... అనురాగం లోతుల్ని
పుట్ట తేనియను మించిన ఆ తియ్యదనాన్ని
అమ్మతనాన్ని చూసి ముగ్దుడ్ని భక్తుడ్నే అయ్యాను.
ఒక స్త్రీ హృదయం ఒక సరోవరం అయినట్లు
ఎక్కడో చిరు పాయలా, జల దారలా ఏ ఇంట్లోనో పుట్టి
ఇంకెక్కడో మెట్టినింట్లో నిశ్చల సరోవరం లా
ఆ ఇంటిచుట్టూ చెట్లూ పూల సొగసులు అద్ది,
బంధాలతో పెనవేసుకుపోయే నూతన లతా తత్వం ....
మమకారం, ఆత్మఆవిష్కరణ ను చూసాను.
స్త్రీ చూపుల్లో అద్భుత అయస్కాంతశక్తి ఉందని
పలుకులు హృదయాన్ని తడిమేంత మృదువుగా ఉంటాయని
నవ్వులు మెరుపుల వానై కురుస్తాయని తెలుసుకున్నా
లతలా కనిపించే ఆ బాహువుల్లో నిక్షిప్తమైన బలాన్ని
తూయలేని అమూల్యమైన ప్రేమను చూస్తూనే
ఒక అందమైన అనుభూతిని ఆ స్త్రీ సాన్నిధ్యం లో పొందాను.
ప్రతి స్త్రీ హృదయం లోనూ మండుతున్న ఆశల్ని
ఆశయాల అగ్నిగుండంలో దూకే సంసిద్దతను
ఆత్మసమర్పణ భావనను చూసాను.
స్వచ్చమైన స్నేహం కోసం
అచంచలమైన అనురాగం కోసం .... నిగ్రహాన్ని
ప్రాకృతికమైన జీవన సరళిని లక్ష్యంగా ....
Wednesday, January 22, 2014
పదాలతో ....
కలిసిన అక్షరాలు పదాలు కొన్ని
అర్ధవంతమై, ప్రాణం కలిగుండి
శ్వాసిస్తాయి.
స్పర్శిస్తాయి.
విపరీత భావనల పదాలు కొన్ని
గాయపర్చి నొప్పిస్తాయి.
ఆశ్చర్యకరంగా ఔషదాలై
ఉపశమనం కలిగిస్తాయి.
పదాలు ఆత్మలు కొన్ని
అప్పుడప్పుడూ గుండెలపై భారమై
ఊపిరిసలపనీయవు,
అప్పుడప్పుడూ స్పూర్తిదాయకమూ ఔతాయి.
విజ్ఞతతో వ్యవహరిస్తే ....
పదాత్మలు అప్పుడప్పుడూ
మదిని, ఎదను సంతులనం చేసి
ఉల్లాసాన్నిచ్చే వరాలౌతాయి.
పలుకని చూపుల
పదాల భావనలు కొన్ని
రెండు హృదయాలను కలుపుతాయి.
పలుకరాని మాటలు కొన్ని .... రాలి
గుండెల్ని బ్రద్దలు చేస్తాయి.
శ్వాసించలేని స్థితిలోకి నెట్టేస్తాయి.
విరహ వేదన రాగా లై
మరణాహ్వానాలై పలుకరిస్తాయి.
అక్షరాలు పదాలు
ఉచ్చారణ పరంగా .... అప్పుడప్పుడూ
స్వర్గం ఇచ్చిన
పదామృతము, దివ్యప్రసాదం కావొచ్చు
అప్పుడప్పుడూ నరకం ఇచ్చిన
లేమి, దుర్భిక్షాలూ కావొచ్చు
ఆ పదాలలో .... ఏ పాళ్ళలో
అమాయకత్వం, విజ్ఞతలను కూర్చుకోవాలో
నిర్ణయించుకోవాల్సింది మాత్రం మనమే.
Monday, January 20, 2014
నాలుగు కళ్ళు ఒకే చూపు
నేనెప్పుడూ ఒంటరిని అని అనుకోలేదు.
ఆనందంగా
అల్లరే తోడుగా తిరిగినంత కాలం
ఒక అమృత హస్తం సాహచర్యం అవసరాన్ని
ఊహించను కూడా లేదు
నాకు కావల్సిన, పొందాల్సిన గుర్తుండాల్సిన
జ్ఞాపకం .... జీవనానుభవమొకటి ఉందని
అందుకోసం ....
అదృష్టం నీవై .... ఎదురొస్తావని అనుకోలేదు.
నీవుగా వచ్చి నా కళ్ళు తెరిచేవరకూ,
ఇప్పుడు నా ఆలొచనల నిండా నీవే
నా జీవితం లో,
నా కలలో,
నా గుండెలో ....
ఇద్దరమూ వేరు కాదని అర్ధం అయ్యింది.
మనం ఒకరికోసం వొకరిమని
నా బాహువుల్లో, నా ప్రపంచానివై నీవు
ఇమిడుండే వరకూ
నేను సంపూర్ణుడ్నని ఎరుగను.
ఇప్పుడు నిన్ను నా నుంచి
విడదీసి చూసే ఊహను కూడా భరించలేను.
ఏనాడూ అనుకోలేదు.
ప్రేమ, ఇంత వింత మానసిక భావన అని,
అందులో ఇంత ఉత్సుకత ఉంటుందని,
ఊహకందని ఆకర్షణ నిన్నూ నన్నూ ఉక్కిరిబిక్కిరి చేసి
ఇరు హృదయాలను ఒక్కటి చేస్తుందని,
ఒకే ఆలోచన, ఒకే దృష్టి కోణం .... కలయిక
సుముహూర్తం
మన కోసం ఎదురుచూస్తుందని ....
అనుకోలేదు. కలనైనా తట్టలేదు.
నీ ఎదచాలనం తో నీవు నా కళ్ళు తెరిచి కలిసేవరకూ.
ఊహల నిర్జనారణ్యం లో ఆమె, అతను
మనుగడకోసం
మనిషి .... పోరాటాలు
సౌకర్యాలను కుదువబెట్టుకోవాలనే ఆరాటాల
ఆలోచనా సరళికి, దూరంగా
అందమైన అనుభూతిని కోరుకుంటూ
ఒక ఆమె, ఒక అతను.
ఎవరూ లేని, ఎవరూ చేరని
ఎటైనా పారిపోతే ఎంత బాగుంటుందో అని,
భూగోళం అంచు వరకూ విస్తరించి,
ఏ ఆకాశ హర్మ్యాలూ
ఏ అత్యున్నత శిఖరాలు అడ్డుతగలని,
విశాలమైన ఎడారుల్లో, పడీదుల్లో ....
ఈ భూమీ, ఆ ఆకాశం
ఒకదాన్నొకటి స్పర్శించుకుని
ముద్దాడుతున్న స్వర్గదామం లో
ఒక స్వేచ్చ పవనం అయి వీయాలని .... ఆమె,
ఆ మబ్బు తెరలు వడబోసి పరుచుకునున్న
ఆ పలుచని వెలుతురులో
ఎడారుల్లో, పరుపుల్లాంటి ఆ పచ్చటి పడీదుల్లో
కలిసి పవ్వళించొచ్చేమో,
విశ్రమించొచ్చేమో అని .... అతను,
అవును!
ఊహల ఉయ్యాల ఊగగలగడం
అందని ద్రాక్షలు అందుకుని ఆరగించగలగడం
చేరని గమ్యం చేరగలగడం
ఎంత అందమైన అవేశం, ఎంత అందమైన అనుభూతో కదా!
Sunday, January 19, 2014
అమ్మను

నీవు పడిపోతావనిపించినప్పుడు
నా కాళ్ళు తడబడుతుంటాయి.
నీవు జీవితంలో భంగపడ్డప్పుడు
నేను నీరసపడి కృంగిపోతుంటాను.
బోర్లా పడిన గాయం నిన్ను బాధిస్తే
నాకు ప్రాణం పోతున్నట్లుంటుంది.
బలహీనతలు నిన్ను దిగజారిస్తే
పెంపకం లోపం అనుకుని అవివేకినౌతుంటాను.
నీవు నన్ను చేరలేని స్థితే ఎదురైతే
ఎలా బ్రతుకుతావో అని తల్లడిల్లుతుంటాను.
Saturday, January 18, 2014
నన్నులోకి చూసుకుంటుటే
తూరుపు కొండల్లో నిద్దుర లేచి వడి వడిగా వస్తూ
అడ్డొచ్చానని తన కిరణాల సూదులతో
నిర్దాక్షిణ్యంగా గుచ్చి, నవ్వుతున్నాడు సూర్యుడు.
నేను .... మైదానం లో ఒక తాపసి లా నిలబడి
నన్ను లోకి చూసుకుంటున్నాను.
ఇంతకుముందు ఎన్నడూ చూడనంత సమీపం గా
ఆత్మావలోకనం చేసుకుంటూ ఉన్నాను.
దృడ చిత్తం, ఉక్కు భావనల అనువంశిక లక్షణాలు,
వాటిని కప్పేస్తూ మట్టిరంగు తోలు
ఏ తాజా వ్యామోహం నుంచీ ఉద్భవించనట్లు
సాహసం, ధైర్యం, కృషి, సంకల్పము మాత్రం
సగర్వంగా నడిచే నడకలో కనిపించేలా.,
పైకి కనపడకుండా ధరించిన ఈ గాంభీర్యం మాస్క్ .... చర్మం
కంటి తో చూడలేని అనుభూతి, ఆ శరీరపు వెచ్చదనం
వికాసం, నమ్మకం లా.
నాది అనే భావన, నిర్ణయాల బాటలో
పొదుగుకున్న ధైర్యం, సాహసం
వ్యక్తి దర్శనానికి చాలినంత ఉండి
నిజం! మనిషి జన్మ ఎంత ఉన్నతం ఆనందదాయకం!

ఉక్కు, ఫైబర్, మాంసం, ఎముకల మయం
ఈ కనిపించని అస్తిత్వం,
చూడలేని ఈ గోరు వెచ్చని అనుభూతి
ఆకర్షణాత్మక ప్రకాశం .... ఆనందానుభూతి మనిషిని గా పుట్టడం
ఇప్పుడు, నా చర్మం కప్పిన ఒడిదుడుకులు
నాకు భారమూ, సిగ్గు అనిపించడం లేదు.
ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తము,
దమనులు సిరలు మాంసం కలిపి కప్పేసిన రూపం
దుమ్ము దూళి లోంచి
వ్యక్తి ఆకారం లో రూపొందించబడి
ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.
అసంపూర్ణుడిననే భావన లేదు.
నన్నులా దిద్దబడిన మానవ బ్రహ్మ చేసిన వ్యక్తిత్వాన్నని.
మట్టి మాలిన్యం విసర్జిత పదార్దాలనుంచి
రూపొందించబడిన వ్యక్తి ఆకారం .... నేను.
నన్ను నేను ఎప్పుడూ ఇంత నిశితం గా పరిక్షగా చూసుకోలేదు.
ఒక స్త్రీ ఒక పురుషుడి అభీష్టాల మేర దిద్దబడిన
తయారైన వస్తువును నేనేమోనని.
ఆత్మావలోకనం చేసుకుంటున్నా!
Friday, January 17, 2014
నిషిద్దాక్షరాలు
ఎదగని వయసు తొందరపాటు ఆరాటం ఒక అనాద శిశువుకు .... అమ్మనాన్నలం మేమే అని చెప్పుకుని మొగ్గను నిర్దాక్షిణ్యంగా అమ్ముకున్న ఒక స్వార్ద దంపతుల నిర్ణయం, గతం గాయం ఆమెను వెంటాడుతుంది. .... కలలోనూ నీడలా.
ఆమె పేరు పూర్ణ. ఆమె కళ్ళు ఎప్పుడూ ఆలశ్యంగానే తెరుచుకుంటాయి. కళ్ళు తిప్పుకోలేనంత సమీపం లో ప్రమాదం ఉన్నప్పుడే ఆమెకు బోధపడుతుంది తను ప్రమాదం లో నిండా మునిగిపోయానని. విశ్రమించేందుకని కళ్ళుమూసుకున్నా .... పిచ్చి కలలే వస్తాయి. చూరునుంచి చినుకులు రసి, రక్తం లా జారి విష వృక్షాలు పుడుతున్నట్లు, తను అఘాదాల్లోకి, ఊపిరి ఆడని అంధకార కుహరాల్లోకి పడిపోతున్నట్లు, ప్రాణం గాల్లో తేలి, కలిసిపోతున్నట్లు కలలొస్తుంటాయి.
ఎవరో ఏడుస్తున్నట్లు, పెడబొబ్బలు పెడుతున్నట్లు, అది తనేనేమో అన్నట్లు అరుపులు వినిపిస్తుంటాయి. భయ విహ్వలై సహాయం కోసం అరిచే ప్రయత్నం సఫలం కానట్లు .... గొంతులోంచి మాటలు పెగలని స్థితే ఎప్పుడూ. జరగబోయే అకృత్యాల కీచక లక్షణాలు సమీపం లోకి చేరేకొద్దీ పూర్ణలో భయం, విచారం, బాధ .... అసలెందుకు పుట్టానా? అని తన అస్తిత్వం మీద అసహ్యమూ పెరిగిపోతూ ఉంటాయి.
ప్రతి రాత్రీ ఈ గతం జ్ఞాపకాలు పీడకలలా పీడిస్తునే ఉంటాయి. గతమే కదా అని మరిచిపోయి ఎంత దూరంగా జరిగిపోవాలనే ప్రయత్నం చేసినా విఫలమే అవుతుంది. అయినా ప్రతి సారీ ప్రయత్నించి భంగపడి తప్పనిసరై లొంగిపోవడం .... భయం తెరలు తెరలుగా ఆమె గుండెను ఆవహించి .... ఆమె ఉలిక్కిపడి లేవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడూ ఒంటరితనము చీకటే ఆమెను పరామర్శిస్తుంటుంది.
"వద్దు! ఆగు! తట్టుకోలేను! నన్నిలా వొదిలెయ్యి!" అనే పదాల వేడుకోలు అరుపులు ఆ పరిసరాలను అల్లుకుపోతున్నా పసుత్వ అలక్ష్యం ఆమెను లొంగదీసుకుంటూనే ఉంటుంది.
ఒక మానవత్వం లేని మృగం అతను, రాక్షసుడు. ఆ కళ్ళ లో ఎప్పుడూ ఆ ఎర్రటి జీరలే. కసి, ఉన్మత్తతే కనిపిస్తూ ఉంటుంది. పశుబలం దేహదారుడ్యం కలిగి అతను ఆమెను ఆక్రమించుకునేటప్పుడు, ఆమె కు ఎలాంటి తప్పించుకుని పారిపోయే అవకాశం దొరకదు. భరించలేని బాధతో విలవిల్లాడటం మినహాయించి. ఆమె హృదయం ఒత్తిడికి లోనై పిండినట్లై రోదిస్తూ కన్నీళ్ళు స్రవించేటప్పుడు మాత్రం, అప్పటికే మృగతృష్ణ తీర్చుకున్న అతను వాస్తవం లోకి వచ్చి అనునయిస్తాడు.
అప్పుడు ఆమె గది లో ఒక మూలన ముడుచుకుని కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఆమె శరీరం మీద అక్కడక్కడా గాయాలు, రక్కులు, రక్తం స్రవిస్తూ, అతి దీనంగా రాయైనా కరిగేలా చూస్తూ ఉంటుంది.
"నన్ను క్షమించు! ఆవేశం లో నన్ను నేను మరిచిపోయాను. ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను. నన్ను నమ్ము!" అంటాడు.
ఈ తంతేమీ మొదటిసారి కాదు చివరి సారి చెబుతున్నాడు అనుకోవడానికి .... అతనికి పూర్ణ అమ్ముడుపోయిన నాటి నుంచి అదే తంతు. అదే బాధ, అదే నిర్దయ, అదే వాంచ .... అతనిలో మృగం పూర్ణను ప్రతి రోజూ చావుకు సమీపానికి తీసుకెళుతుండటం .... పూర్ణ విలవిల్లాడిపోతూ .... ఆ బాధను, అతన్నీ భరిస్తూ ఉండటం జరుగుతూనే ఉంది.
అలా జరిగిన ప్రతిసారీ పూర్ణ తనకు తాను పిచ్చి ఆస్వాసన ఇచ్చుకుంటూ ఉంటుంది "అతను మారతాడు" అని. కానీ,
చీకటిపడుతూనే అతను మళ్ళీ వస్తాడు నరకాన్ని తన వెంట తీసుకుని. మృగం లా, మందులో మునిగి .... అప్పుడు ఆమెకు అర్ధం అవుతుంది అతని మాటలు నిజం కాదని, అతను మారదని.

అలా, పూర్ణ తనను తాను బాధ అనే బంధనము లో బిగించుకుని ఆవిరైపోతుంది. ఇప్పుడు ఆమెను ఆ అమాయకత్వాన్నీ స్వార్ధ రాక్షత్వం బారి నుండి కాపాడటం కాలానికైనా సాధ్యం కాదేమో! ఎందరు పూర్ణమ్మల జీవితాలు ఇలా స్వేచ్చా సౌశీల్యాలను కోల్పోయి చరిత్ర పుటల్లో నిషిద్దాక్షరాలుగా మిగిలిపోతున్నాయో కదా!
జ్ఞాపకాల డైరీలో ....
ఒక మగువ మనసు తెలుసుకోవాలనే ఈ ఉబలాటం నా ఒక్కడికేనా ప్రతి పురుషుడిలోనూ ఉంటుందా! చిత్రం గా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే .... ఒక చిన్న చిరునవ్వు లో ఒక చిరు పలుకరింపులో అంత ఆకర్షణ ఉంటుందా అని.
అప్పుడు నా వయస్సు ఇరవై నాలుగు.
ఆర్ టి సి బస్ స్టాండ్ లో పరిచయం అయ్యింది ఆమె. ఆమె ఎవరో ఎక్కడినుంచొస్తుందో ఎక్కడికి వెళుతుందో తెలియకుండానే మది ఆలోచనలు వాటంతట అవే ఆమె చుట్టూ అల్లుకుపోతున్నాయి. ఆమె కు ఇష్టం కలిగేలా నడుచుకోవాలని .... నాలో తహ తహ. ఆమె దృష్టిని ఆకర్షించాలని, ఆమెలో ఉత్సుకతను పెంచాలని,
ఆమె ఏమి చూడాలనుకుంటుందో అని ఊహించుకుంటూ తర్జనబర్జన అవుతూ .... మండుతున్న బంగారం లాంటి మనసును ఇష్టపడుతుందా లేక వెండిలా మెరిసే కండరాలను ఇష్టపడుతుందా అని ప్రశ్నలు?
ఒక వైపున ఆశ్చర్యం .... మరోవైపున పరిక్షగా చూడలేక పోయానే అని బాధ. చామంతి సొగసని .... ఎర్ర గులాబీలా ఉందని .... చామన చాయ సాధారణ సొగసని .... ఊహల అల్లికలు!?
ఔనూ వేసవి ఉదయపు వేళల్లో, చలికాలపు మధ్యాహ్నపు వెచ్చదనం వేళల్లో ఆమె శ్వాస వేగం సరళమా, భారమా అని? సరళమైన ఆమె మది మెలికలు తిరిగి నాకే ఎందుకు ఎదురుపడింది అని, అప్పటివరకూ ఆమె కూర్చున్న సీటులో ఆమె మరిచి పారేసుకున్న ఆ జ్ఞాపకం .... ఆ చేతి రుమాలు నాకే ఎందుకు దొరికిందీ అని .... ఆ యాదృశ్చికతల పరిణామాల పై అనుకూల ఊహలు?
బహుమర్మంగా పలుకరించినట్లే పలుకరించి అంతలోనే గుడ్ బై చెప్పి మాయమై, మదిని ఊహలు, విచారం తో నింపేసిన ఆమె .... మరోసారి డైరీలో అక్షరాల రూపం లో కళ్ళముందొక్కసారిగా తళుక్కున మెరిసి మాయమయ్యింది.
Thursday, January 16, 2014
నా ప్రేయసి గదిలో గోడకు వ్రేలాడుతూ నేను
గాలి లేదు. ఉక్కబోస్తుంది. శ్వాసించలేకపోతున్నాను.
భయంకరమైన నిశ్శబ్దం ఏదో నా ప్రపంచాన్ని తడుముతూ
అక్కడ .... గోడకు కొట్టిన మేకుకు వ్రేలాడుతూ
ఫొటో ఫ్రేం లో తీవ్ర కంపనకు లోనౌతూ, అలజడి చెందుతూ .... నేను,
నా ఫొటో బయట వాతావరణం మాత్రం అచేతనత్వమే అంతా.
నిశ్చలంగా, ఒంటరినిగా కొన్నాళ్ళుగా అక్కడ .... జీవిస్తూ,
నేనూ, నాలా పక్కనే మరో ఫ్రేముల్లో మరికొందరు.
నాకు వారు తెలియరు. వారికెవరికీ నేను తెలియను.
నా పేరు .... నాకూ, నా ప్రేయసికి మాత్రమే తెలుసు
ఇసుక లో రాసుకునున్నాము .... ఒకరిపేర్లొకరం కనుక,
ఒక్కసారి అనుకుంటాను .... ఒకే ఒక్కసారి
ఫొటో ఫ్రేము లోంచి .... గాలికి, భూమ్మీదకు రాలి పడాలని
ఒంటరిగా కూర్చునున్న .... నా ప్రేయసి ఒడిలోకి జారి సేద దీరాలని
ఆమె నోట నా పేరును వినాలని .... ప్రయత్నించి, భంగపడి
మరింత బలంగా గోడనున్న మేకుకు ఉరేయబడ్డాను.
Wednesday, January 15, 2014
అతి

మార్పు కోసం కావొచ్చు, మెచ్చుకోలు కోసం కావొచ్చు
వచన కవిత్వాన్ని మళ్ళీ మళ్ళీ మైక్ లో ఊదుతూ
ఓ నేస్తమా! నీలో నీవు .... అంతగా
ఆ గర్వం ఫీల్ అవసరమా!
చతుష్పాదాల కట్టుబాట్ల
చందోబద్ద సాహిత్యాన్నొదిలేసి,
సుదీర్ఘ రాగాల .... పద్యాలనొదిలి,
చురకత్తులు, వాడి పదాల విప్లవ సాహిత్యాన్నొదిలి.
ఈ సంచలనాత్మక, మనసు భావనల
సామాజిక పదచిత్రాన్ని భావనాత్మకం గా చదువుతున్నట్లు,
వేదిక పై నీవు పడుతున్న ....
అవస్థ, నీ కదలికలు నవ్వును తెప్పిస్తున్నాయి.
మార్పు కోసం, మాలిన్య నిర్మూలనం కోసం
పొంగుతున్న, అణచిపెట్టుకున్న .... ఆవేశం బేస్ తగ్గించి,
కేవలం నీ పేరు నీ ముఖం
మాత్రం కొన్ని రోజుల వరకు గుర్తుండిపోతే చాలన్నట్లు.
ఓ పిల్లా .... నీకే చెబుతుంది!
ఒక అతను
ఒక నీకు మనసిచ్చి మనువాడవచ్చి చేరువై
దగ్గరకు లాక్కుని "నిన్నే ప్రేమిస్తున్నా!" అని
నీ ఇంటికి సరళంగా దారి అడిగితే,
ఓ పిల్లా! అనుమానించకు!
"నేను నీకోసము, నీవు నాకోసమే పుట్టాము!" అనే
అర్ధమూ ఉండొచ్చు ఆ మాటల్లో .... అలోచించు.
అతని మనసు, ప్రపంచం అంతా నీవే అయి,
ఫంచభూతాల్ని ప్రతిగా నీకు సమర్పించేందుకు సిద్దమేమో ....
నీ అనురాగం పొందడం కోసం!
అతను ప్రేమలో మంచిని మాత్రమే చూస్తాడు.
ప్రియురాలు మంచిని మాత్రమే తలుస్తుందనే నమ్మకం ప్రబలమై
ఎవరైన ఆప్త మితృడు
చెడు లక్షణాలను చూపే ప్రయత్నం చేస్తే
ఆ మిత్రతనైనా ఒదులుకునేందుకు సిద్దపడే అంత ప్రేమిస్తాడే కానీ,
ఓ పిల్లా నిజం! నిజంగా అతను నీకు మనసిస్తే,
నీ కోసం తనను ఖర్చు చేసుకుంటాడు.
అన్ని జీవన సౌకర్యాలను వొదులుకుంటాడు.
వర్షంలో తడుస్తాడు. ఆరు బయట .... పవళిస్తాడు.
ఒకవేళ నీవు ఆనందిస్తావనుకుంటే .... మంచులోనైనా సరే,
పిల్లా అదీ ప్రేమంటే!
నీ కోసం బికారి అయ్యేందుకు ఇష్టపడటం.
నిన్ను మించిన విలువైనదేదీ లేదు ఈ ప్రపంచం లో అనుకోవడం
అందుకే పిల్లా! ప్రేమనెప్పుడూ చులకనగా చూడకు
అతని అంతరంగం ఆత్మ అలజడి చెందేలా నడుచుకోకు!
నీవు తలచుకుంటే
అతని జీవితం లో అల్లకల్లోలం సృష్టించగలవు.
అతన్ని పిచ్చివాడిలా ఆడుకుని
అతని ఊహకు రాని భావనల చేష్టలతో పిచ్చివాడ్ని చేసి
పరిణామం చివరికి మాత్రమే అతనికి తెలిసేలా చెయ్యగలవు.
పిల్లా! అతను చెబుతుంది నీతోనే "నిన్నే ప్రేమిస్తున్నా! అని"
నీకు సర్వం సమర్పించుకునేందుకు సిద్దంగా ఉన్నాను అని,
అతన్నీ, అతని వారసత్వ సంపద నూ
నీ ప్రేమను పొందడం కోసం .... నీ కోసం,
నీతో జన్మజన్మల బంధం ఏర్పరచుకోవడం కోసం
పిల్లా! అతన్ని అలా నీవు పిచ్చివాడు, గుడ్డివాడు గా చూడకు!
చెడుగా భావించకు! అతనే కావాలని కోరుకో!
అవును పిల్లా!
మనసారా ప్రేమించిన నీకు అతను ఎలాంటి చెడూ చెయ్యలేడు.
మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడడు. ప్రేమిస్తున్నాను అని చెప్పి నీవు పారిపోతే తప్ప!
పిల్లా! ఓ పిల్లా! ఇది పురుష ప్రపంచం కాదు.
స్త్రీ కి సమాన హక్కులు కోసం పురుషుడు పోరాడాల్సిన ప్రపంచం!
ప్రేమ ప్రపంచం .... ఓ పిల్లా! మార్పు నీ ముందే ఉంది.
నిన్నటి పురుష సమాజం రేపటి స్త్రీ, పురుష సమాజం అయ్యేందుకు.
పిల్లా! ప్రేమతోనే సాధ్యం అంతా!
Thursday, January 9, 2014
ఒక వింత భావన .... ప్రేమ
అది ఒక వింత అనుభవం
నేనూ నీవూ ఒక్కరిమవ్వడం
ఒక వరమని అనుకుంటా!
నువ్వనీ, నేననీ
నీతో నే నా జీవితం అని
ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!
నిన్ను ఎదురుగా చూస్తూ ఉంటే,
స్వర్గం నన్ను చుస్తూ
చిరునవ్వులు చిందుస్తున్నట్లుంది.
అందుకే, ఈ రాత్తిరి
ఆ చందమామతో ....
నా ఆనందం పంచుకోవాలనుంది.
మన ఇరు హృదయాల
రసాయనిక కలయికకు మునుపే
అడగని కోరికలు తీర్చే వరాన్నిచ్చిన
దేవతను, నిన్ను పొదివి .... దగ్గరకు
నీ సమ్మతి తో .... తీసుకునే వేళ
ఆ తారల రేడు కి
మది అభివాదాలు చెప్పాలనుంది.
చల్లని ఆ వెన్నెల కాంతి లో
నీ ముఖం ప్రకాశిస్తూ
వెన్నెల పరావర్తనం చెంది
ఉక్కిరిబిక్కిరయ్యే నేను
నీ కళ్ళలోకి చూస్తూ
నిన్ను ప్రాదేయపడే వేళ ....
నిజాన్ని దాయలేను.
నీ అంత చిక్కని, చక్కని
ముగ్ద, మనోజ్ఞ సౌందర్యం
వరించడమే అదృష్టం అని,
మనసును సమర్పించుకోగలను కాని
మాటల్లో వర్ణించి చెప్పలేను అని
నిజం!
నేను, నీవు కలవక మునుపే
ఎవరో నిర్ణయించిన కలయిక మనది
అదృశ్య హస్తం ఏదో ఉందనేది నిజం.
అది ఆ వెన్నెలరేడు హస్తమే అని,
Subscribe to:
Posts (Atom)