ఎన్నాళ్ళుగా అలా నడిచేందుకు ఇష్టపడ్డానో తెలియదు. యాంత్రికంగా వందలో ఒకడ్నిలా, గొర్రెలా జీవితం పెరటిదారిలో బాటసారిలా
ఎన్నాళ్ళుగా అలా ఎదురు చూపుల జీవితాన్నిష్టపడ్డానో తెలియదు. పాకుడు నీరు, వాడి, రాలిన పూరేకుల జీవితం నిట్టూర్పుల నీడలో .... ఓపికగా నిలబడి
కానీ,
చాన్నాళ్ళకు ఆ మారని అలవాట్ల ఆత్మ విధ్వంసక భారం నుండి విముక్తి పొంది తెలుసుకున్నాను, వసంతం తో పల్లవించి చైతన్యం నేనై, జీవితం తొలి వరస .... చరిత్ర లో ఉన్నానని
పక్క నుంచి కదులుతూ ఈదురు గాలి అలజడి నన్ను .... ఒళ్ళంతా తడిమి నా శ్వాసలో ఒక భాగమై విలీనమై వీడ్కోలు వేళలో చిరు చౌర్యం నా తెలివి నా బద్దకం నా స్వేదం దొంగిలించి సాగరం లో పోటులా ఆ ప్రవాహం కాడలు విస్తరించి నన్ను మాత్రం స్థిరంగా ఉంచుతూ కాలం చూరు క్రింద
ఆతని ఆత్మ అంతరంగం తెరపై చీకటిని ప్రతిబింబిస్తూ చిక్కని ఛాయలా ఆమె ఆశ్చర్యం .... గా, రక్తవర్ణం లో కన్నీళ్ళు కార్చుతూ .... ఒకవైపు అతను ఒంటరిగా, లయబద్దంగా నర్తిస్తూ మరోవైపు ఆమె రాక్షసగణాలతో తాండవిస్తూ
సన్నని దారంతో ప్రాణ బంధమున్న నల్లని నీడల్లా .... నిప్పుకణికల్లాంటి కళ్ళతో చేతిలో ఆయుధం తో తాండవిస్తున్న ఆ కళ్ళలో ద్వేషం మంటలు తృటి లో .... శరీరాన్ని చుట్టుముట్టి రక్తం ఉడికి, నిలువెల్లా దహించబడి సర్వం జ్వాలల్లో భశ్మమవుతున్న దృశ్యం.
దుష్ట పాపాత్మ నవ్వొకటి, ఆలోచనల్ని మనసు ను ప్రభావితం చేసి పెళుసైన ఆత్మ ముక్కలు ముక్కలయ్యి నిశ్చేష్టత నిలువెల్లా .... ఒకనాటి, సుకుమారతత్వం, ఏకత్వం ఖటినత్వం, భిన్నత్వం గా పరిణమించి మది పొరల్లో జ్ఞాపకాలు మసకేసిపోతూ
ఆ నీడలు ఆ ద్వేషం ఆ ఆవేశం అన్నివైపులనుంచి ఆక్రమించుకుపోతూ తీక్షణ భావనల చూపుల సూదులు, గుండెల్ని చీల్చి, రక్తవర్ణపు వర్షపు బొట్లు రాలబోతూ ప్రాభావితమైన పరిసరాలు గాఢంగా ప్రబలిన ఆ చీకటి ఛాయలు మబ్బులు కమ్మిన ఆకాశం ఉరుము లే
రెండవసారి అని తెలుసు ఈ కలయిక పీటముడి .... నీకూ, నాకూ మధ్య నన్ను నమ్మడం నీకు కష్టమే కానీ తప్పదు. భయమేస్తుంది కదూ! సర్ధుకుంటాను. ఒక మాటమీదే నిలబడుతాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. అశరీరవాణి చెబుతుంది. వినకు! గుండె బ్రద్దలవుతుంది. జాగ్రత్త! అని ఒక్కసారి, ఈ ఒక్కసారి నా మాట విను! భిన్నంగానే జరుగుతుందని. ఇకనైనా నీవూ నేనూ ఒకే కల కంటూ ఒక గమ్యం దిశగా జీవించే సావకాశం అదిగో
నిజం పిల్లా! నీ ప్రేమస్వీకృతికి జీవన సాహచర్యానికి నేను సిద్దంగా ఉన్నాను ఇప్పుడు. నా ఈ మాటలు నా ఈ వేడుకోలు బ్రతిమాలటాలు నాలో నేను మాట్లాడుకునే నా స్వగతం ఒంటరి మాటలు అనుకోకు. ఇప్పుడు, మరోసారి ఒక్కటి కాబోయే ముందు నమ్మకం న్యాయం విడమర్చాలనే ఇన్నాళ్ళూ అతిగా మాట్లాడిన నేను ఒంటరి రాతృల్లో నిన్ను .... బాధ, చీకటి అయోమయం అగమ్యగోచర సంఘటనల్లోకి తోసేసిన నేను ఇకపై నీతో నిజాయితీగా ఉంటానని మాటిస్తున్నాను. ఓ పిల్లా! దయచేసి ఈ మాటలు శ్రద్దగా విను. నా అవసరాలు, జీవన ధర్మాలు నీతో ముడిపడి ఉన్నంతకాలం నేను నిన్ను ఒదిలివెళ్ళలేను. ఒదిలి వెళ్ళినా నీవు తిరిగి రానిస్తావని తెలిసినా సహజీవన అవసరం, సంపూర్ణ తత్వం, నిజం ఇది!
ఎందుకో తెలియదు. తగదనుకుంటూనే దగ్గరౌతున్నా చేరువవ్వాల్సిన అవసరం లేదనిపించినా తొలిచూపు ప్రేమను, తొలి పరిచయం ఆకర్షణను ఎంతో పరిచయం ఉన్నదాని లా ఎదురుపడే ఆ చిరునవ్వు ను, ఆ ప్రకాశాన్ని ముఖం పై దాచుకోలేని ఆ ఉత్సుకత ను కనపడనీయకుండా దాయాలనే ప్రయత్నం లో ఆ పెదవి కొరుక్కోవడం లోని విపరీతార్ధాలను ఆ విచలిత బలహీనతలను ఎవరైనా గమనించారేమో అనే ఆ తడబాటు ను చూసి
ఆ నవ్వును, ఆ బలహీనతను నీలో చూసాను. ఇంతకు ముందు నేనెప్పుడూ నిన్ను కలవలేదు. నువ్వెవరివని నాకు తెలియదు నీ ప్రాంతం, నీ పద్ధతులు నీ నడవడిక తొలిసారే నాకు. అయినా, ఒక్కటి మాత్రం ఒప్పుకుంటాను. నీ భావనల్ని సాహిత్యం గా మాత్రం చదివానని నీ ముఖం నీ చిరునవ్వు నీ కవితల్లో గమనించి ఆకర్షితుడ్నయ్యానని
నిజం! నేను, నిన్ను నీ సాహిత్యంలోనే చదివాను. ఆ పరిశీలన ఆ దృష్టికోణం ఆ విషయ పరిజ్ఞానం లో విజ్ఞతను చూసాను. నీవు రాసిన భావనల పదరూపకల్పనలు నిజం గా సమ్మోహనాశ్త్రాలే నీ లా ఏదో తెలియని అందం ఆనందం నమ్మకం .... నీ నవ్వులో పరిసరాల్ని తీవ్రం గా ప్రాభావితం చేసే శక్తిని చూసాను. అందుకే ఆశిస్తున్నాను, నీవు నన్నోసారి గమనించాలని, నన్ను చదవాలని, నేను సమాజాన్ని చదవడంలో సహకరించాలని .... నా భావావేశానికి అక్షర రూపం ఇవ్వడంలో
ఒక కొడుకునై నేను నీవు కోరుకున్న విధం గా నడుచుకోనందుకు క్షమించవా! అమ్మా! నన్ను, నా గతాన్ని నా వర్తమానాన్ని, నా భవిష్యత్తును నీ ప్రమేయం లేకుండా చేసుకుని జీవితాన్ని కాలరాసుకున్నందుకు ఉగ్గుపాలతో పాటు పోసి నీవు నేర్పిన పాటాలు విస్మరించి జీవితాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు
మన్నించవా! అమ్మా! ఒక పాపాత్ముడి తల్లివని నీపై మోపిన భారానికి నిన్ను, నిరాదరించి అవసరానికి ఔషదం లాంటి నీ మమతానురాగాల సాన్నిహిత్యం ను నిర్లక్ష్యం చేసినందుకు నేను క్షమార్హుడ్ని కాననిపిస్తుంది అమ్మా! నీకు తెలియకుండా పెంచి పోషించుకున్న మృగ లక్షణం నేను
నిద్దుర లేని ఉలికిపాటు గడియలే తలతిప్పి చూస్తే వెచ్చని భుజాలపై సుతారంగా చేతి వేళ్ళు కదిల్చిన జ్ఞాపకాల మధుర క్షణాలే
శంఖం లాంటి మెడ మీద చేతి వేళ్ళ కదలికలు దిండు ఆసరాగా వెన్నును వాల్చి విశ్రమిస్తున్న ప్రాణం వెన్నెముకను తడిమినప్పుడు నిదురిస్తున్న చర్మం మేల్కొని దృడపడిన కండరాల ప్రతి స్పందనల లా
పెదవులపై నాలుకను కదిపి తడిపినప్పుడు చిగురించిన తేమ మెరుపులు మెత్తటి మేకులు గుండె పై గుచ్చిన వైద్యం భావనలతో ఉదరం నర్తించిన గతం అనుభూతులు దృశ్యాలై
బలవంతపు పీడ నిట్టూర్పు లా .... అనవరతమూ మదిలో మిగిలిపోయిన మరకల లా శాంతంగానే ఉన్నట్లు ఉండి ఊరిస్తూ అప్పుడప్పుడూ ప్రకోపింపిస్తూ .... మది అస్థిమితమౌతూ
జ్ఞాపకాల తేనె తుట్టె కదిలి ఒక శారీరక ఆపేక్ష ఒక మానసిక అలజడి ఒక తీరని మనో వాంచగా పరిణమించి గుండె చప్పుడుకు తోడు, ఒక భారమైన నిట్టూర్పు లా
నీపై మోహ బావనల గాడత తో ఆత్మ ఎద సాగరం లోతుల్లో బంధించబడి నిట్టూర్పే ప్రతి శ్వాసై నరాల రక్తం నదిలో తేలుతు నన్ను నేను కోల్పోయి .... నా నీవు మాత్రం నా సామీప్యపు అనుభూతి ని గమనించడమే లేదు.
తన అవివేకానికి తను మూల్యం చెల్లించుకున్నాను అని అగ్నికి సర్వమూ కాలి బూడిదయ్యింది అని అస్తిత్వం, అహంకారం లోలోనే దాచేసుకుని ఏ మనిషైనా పగిలిన హృదయానికి మరమ్మత్తు లేక ఒంటరి నిరాశ నిస్పృహల జీవితం తో అలా కాక స్వీయ నమ్మకం పెంచుకుని, కవితల ద్వారా బాధను కక్కి, ఎద క్షతి అని కారణాలు వెదికి విశ్లేషించి తలచి, తలచుకుని, దేవదాసుగా మారడం మాని తొందరపాటు గాయం మానేందుకు నొప్పికి ఔషధం కోసం ప్రయత్నిస్తే అనుకోలేము, అది భగ్నప్రేమ అని తిరిగి ఎప్పటి లా మరో ఉదయం నిరంతర జీవనయానం సాగిస్తూ అవకాశాల వేటలో జీవన సార్ధకత దిశ గా వైవిధ్యం గా వ్యక్తిత్వ నిర్మాణం చేసుకుంటూ వొటరిగానే అయినా జిజ్ఞాసతో ముందుకు, ముందుకే సాగితే
ఆనందం, ఉపయోగం పనులు గమ్యం గా, కదలడం చైతన్యించడం ప్రారంభించి, "నేనే తను, తనే నేను .... కాకపోతే జీవితం లేదు. జీవించలేను" అనుకున్న చొట స్నేహమై పూసి ఎదురుపడ్డప్పుడు కుశల పరామర్శలు, దూరంగా ఉన్నప్పుడు శ్రేయోకాంక్ష, నిర్మల వాతావరణమే ఎదురయ్యేలా జీవితాన్ని మలచుకుంటే అప్పుడు మానదు, ఏ ఎద శ్వాసించడం మానవు, ఏ ప్రేమభావనలు పరిమళించడం
ఆలోచనల మబ్బులు కమ్మి కన్నీళ్ళ వర్షం కురవబోతుందనే అనుభూతి .... కానీ, తుళ్ళి పడాల్సిన బాధ కనుల అంచుల్లోనే ఆగి పొడిబారి కరుస్తున్నట్లు దురద
అర్ధరహిత భావనలు కోరికల కొండి లు మదిలో గుచ్చుకున్న పీడ ఆశాభంగం పిదప మరిచిపోలేని భావోద్వేగాల రాని కన్నీళ్ళ ఊట.... తుడుచుకుంటున్న అనిర్వచనీయ అసంతృప్తి
ఆ అసంతృప్తి లోనే .... తెలియని ఆశ, అనవరతమూ నీడలా ఎదురవుతున్న నీవు లా నిన్ను చూసి నీలోని నిర్మలతను నీ పెదవులపై ఆ చిరునవ్వు వికసించిన పరిమళం చూసి నా కోసమే అనుకుని
నిన్ను ప్రేమించాలనుంది చవిచూడాలనుంది. తొలి ప్రేమ మాధుర్యాన్ని చేతులు బార్లా చాచి, హృదయ ద్వారాలు తెరిచి తారలు నక్షత్రాలు చేరిన నూతన అనుభుతిని పొందాలని .... నీతో సందేహాలకు తావు లేని నిర్భయ, నిష్కల్మష మానసంతో ఇంతకు పూర్వం ఎవ్వరూ కట్టని బలమైన గోడొకటి కట్టాలని అందుకై సర్వస్వం కోల్పోయేందుకు సిద్దమై .... మరీ ప్రేమ కోవెల వొకటి కట్టాలని ఉంది
నా మనోభీష్టం లక్ష్యంగా ఏమి పొందాలనుకుంటున్నానో .... అందుకోసం నిస్వార్ధం గా, నన్ను నేను సమర్పించుకుని భావనలకు సాన్నిహిత్యంగా జీవించుదామని .... నీ ప్రేమ సాంగత్యం లో నీ, నా పరిచయం .... అవి తొలిచూపులే అన్నట్లు ఇలలో తొలిప్రేమ మనదనే, తుది నిర్ణయం లా నీవు నన్ను ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నానో .... అలా నన్ను నేను సంసిద్దుడ్ని గా శిక్షణ ఇచ్చుకుంటున్నా నిన్ను ప్రేమించాలని అగ్నిలా
జీవితం లో నరకయాతన దిగజారిపోవడం అర్ధం అప్పుడే తెలిసింది. రకరకాల ఆర్ధిక సమశ్యలు, అప్పుల్లో కూరుకుపోయి ఋణ విముక్తుడ్ని, మళ్ళీ సామాన్యుడ్ని కావాలని ఉపరితలాన్ని చూడటమే గమ్యం గా పడిన కష్టం .... కనీసం, శ్వాసించగలననే పీకలవరకూ ఊబిలో కూరుకుపోయిన అసహాయత ఏ ప్రత్యక్ష ఒత్తిడి లేకపోయినా ప్రతి ప్రయత్నం లోనూ, మరింతగా దిగజారి ఆర్ధిక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఒడ్డున కూర్చున్న వారి సలహాలు గా మనసు పై తీవ్ర ఒత్తిడై, ఆ భరించలేని బాధ, పెనుగులాటలో మరింతగా దిగబడి, అప్పుల పాలై పోయి రాత్రి చల్లనిదే కానీ, ఆ శూన్యత లో, ఆ అంధకారం లో కళ్ళు మూయడం మినహా ఏమీ చెయ్యలేని అశక్తత నాలో నాకు ఉపశమనం పొందాలని ఆశ .... సమశ్యల్లొంచి వెలికి రావాలి నింపాదిగా శ్వాసించాలి అని .... ఆశ
ఆ క్షణాల్లో, నా కళ్ళలోంచి కారిన కన్నీళ్ళ వెచ్చదనం మాత్రం ముఖాన్ని తడిపేస్తూ నేనూ మనిషినని, భావనలున్నాయి నాలోనూ అని గుర్తుచేస్తూ
రేకులు రాలి దుమ్ముకొట్టుకుపోయి అవనతనైన గులాబీని లా నేను సంరక్షణ లేని తోట లో కొన ఊపిరితో మరి కొద్ది క్షణాల్లో ప్రాణం కోల్పోబోతున్నవాడిలా .... నా కళ్ళలోంచి ఉండుండి జారుతూ .... ఒక్కొక్క రక్తం బొట్టు, నేను ఒక పగిలిన హృదయపు అవశేషాన్ని, ఒక ఒంటరి ఆవేదనను.
నాకు వరమిస్తానికే దిగి వచ్చిన అమృతమూర్తివి లా ఏ రంగుహంగుల్లేని రెక్కల దేవత, స్వేచ్చా సంచారిణివి లా ఏ దివి నుంచో వచ్చి .... నీవు, పెళుసై పగిలిన నా హృదయాన్ని స్పర్శించేందుకు, గమనించేందుకు నాకు గుర్తులేని పసితనం మది పొరల్లో శిధిలమైన నా జ్ఞాపకాల ను
మరీ అంత సమీపం లోకి వస్తావనుకోలేదు. నా సమశ్యల సెగ ఆ వేడి, ఆ బాధల అనుభూతి తగిలినట్లుంది. గుంటలు పడి ప్రాణం కోల్పోతున్న కళ్ళ లోకి చూసి ఆవిరైపోయిన కన్నీటి పగుళ్ళ ఎర్ర జీరలు రాలని రక్తాశృవుల చారలను .... తుడిచే సాహసం ప్రయత్నం చేసావు
ఆ దివి దిగి వచ్చిన దేవతవనుకోను .... అమృతమూర్తి అమ్మవే అనుకుంటాను. నా నుదిటి పై ఒక సున్నితమైన ముద్దును ఇచ్చావు చూడు .... వరంగా, అప్పుడు క్యాన్సర్ పుండ్లుగా మారిన నా అంతర్గత గాయాలు ఆ క్షణం లో నే మానినట్లై తిరిగి ఏదో నూతన ప్రకాశం, ఒక నూతన చైతన్యం కొత్త అనుభూతులకు స్థానం ఏర్పడి .... వింత వెలుగులు నా కళ్ళలో
అలసి, విశ్రమించే క్షణాల నిద్దుర దూరమైన రాత్రుల అరణ్య ప్రశాంతతలో ఈ కీచు రాగం బహుశ, ఏ చిన్ని జీవం పక్షిదో, కప్ప ....దో అయ్యుంటుంది.
నిద్దుర ప్రశాంతతను ఝుళిపించుతూ అప్పుడప్పుడూ, దూరంగా జాతీయ రహదారి పై బ్రేకులు వేసిన భారీ వాహన టైర్ల ద్వనులు కిటికీ అంచుని ఆనుకుని విస్తరించిన చెట్ల కొమ్మల కదలికల గలగలలు, లోతైన నా శ్వాస నాకు భారంగా వినిపించే శబ్దం పక్కింటి పెంపుడు కుక్క ఊరకుక్క తో వగలు సాగిస్తున్న గీర
సమయం, నన్ను లేపి మరీ ముచ్చటిస్తున్న ఈ జీవనానందానుభవాలు. వీటిని .... నాతో కలిసి పంచుకునే బాగస్వామ్యం కావాలని మనసు మారాం చేస్తుంది. ఆ సాహచర్యం భాగస్వామివి నీవైతే బాగుంటుందని
పిల్లా! ఆ రోజు వస్తే .... నేను, నీవద్ద సెలవు తీసుకునే రోజు నిజంగా నీవు విలపించవు కదూ ఆ రోజు వస్తే నేను, అలసి ఆకశ్మికంగా మరణించిన రోజు నిజంగా .... నా కోసం పిల్లా! ఆ రోజు వస్తే .... నేను, నీతో చెప్పేసిన రోజు నిన్ను నేను అపరిమితంగా ప్రేమిస్తున్నా అని తొలి పరిచయం నాడే నిజంగా .... నీవు నన్ను నవ్వుకోవు కదూ!? పిల్లా! ఆ రోజొస్తుందా? కాలం దానంతట అది కదులుతూ ఈ సమాజం కోసం, నా కోసం .... నీవు నా సుఖ సంతోషాలను కోరుకుని నవ్వుతూ వీడ్కోలు చెప్పే రోజు
పిల్లా! ఎందుకో అనిపిస్తుంది. నీవు, నేను ప్రేమించడం కన్నా మించి నీవు ప్రేమించే అతని కోసం అతని జీవితం లోకి లక్ష్మివై వెళ్ళాలని, ఎంతో బాగుంటుందని పిల్లా! తెలుసు! నా కోరికలు తీరవని నేను, నీకు ఏమీ కానని నీ కలలోకి రాలేనని తెలుసు అయినా, నిన్ను కల కనగలను. కాదనవు కదూ!
అతిధి దేవుళ్ళేమో అని నిండు మనసుతో స్వాగతించేవు అర్ధరాత్రి ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఎదురొచ్చి పరామర్శించే అసంతృప్తి, అసూయ, ఏదో పోతుందనే యేడుపు....లను, ఆ క్షణమే ఆరంభం అవుతుంది నిద్దుర కోల్పోవాల్సిన స్థితి
సౌలభ్యం, అనుకూలత, సున్నితత్వమూ కలిసి ఏర్పడే ఇష్టం ప్రేమ ఉదయం గాలి లో స్వచ్చత తాజా నిర్మలత్వం ప్రేమ ఒకరు ఇంకొకరికోసం అస్తిత్వం కోల్పోవాలనుకునే త్యాగం ప్రేమ అది నేను నీలో కనుగొన్నాను. వేసవి ఉదయం సూర్యోదయ వేళల్లో రాలే మంచు బిందువుల ఆస్వాదనాన్ని గులాబీ మొగ్గ లా . తప్పకుండా పల్లవించే పరిమళాన్ని. సతతహరితం అమరం మన ప్రేమ రెండును రెండు విధాలుగా చూడలేని రెండు హృదయాల సమ్మేళనం నీవూ నేనూ మన ప్రతి భావన లోనూ నూతనత్వం ఆరంభతత్వం గా తొలిఉదయం తొలిరాత్రి తొలిప్రేమ లా ఎప్పుడూ మన ఆత్మలు ఆనందోల్లాసాలతో నర్తించుతూ ఆ ఉద్వేగం ఆ వెచ్చదనం ఆ ఆవేశం అలౌకిక భావనలో ఆ మృదు మనోజ్ఞ మనోహర వికాసం ప్రజ్వలిత ప్రకాశం లో రెండు జ్యోతులు ఒక్కటై ప్రకాశిస్తున్నట్లు
రెండు చూపులు ఒకే గమ్యాన్ని చూస్తున్నట్లు సూర్యోదయ ప్రాభవం కీర్తి ప్రేమ, అర్ధరాత్రి సూర్యుడి చైతన్యం .... సమ్మిళితమైన క్షణాల పరిపూర్ణత్వం ప్రేమ కాలపురుషుడు మార్చలేని అర్ధవంతమైన అమరత్వం సతతహరితత్వం ప్రేమ
ఎవరైనా, ఏదో ఒక రోజు చేరాల్సిన గమ్యాన్ని .... నేను సాటి మనిషిని లా ఎవరూ నన్ను మోసపుచ్చలేరు. ఆనందం, ఉల్లాసం, ఉన్నతశిఖర అధిరోహణలప్పుడు ఎవరికీ నేను కానరాను. కష్టాల వలలో చిక్కి దిగులు సంద్రం లో పీకలదాకా మునిగి, ఎవరినైనా వారు మోసం చేసిన నీడలే .... వారి ఋణం తీర్చుకుంటున్నప్పుడు
నీడలా .... ఎదురుగా చెయ్యందించేందుకు సిద్దమై సమాధి లోంచి .... నేను, సమాధిలోకి వారిని లాక్కుంటూ .... ముందుగా నేను లాక్కునేది మాత్రం వారి శ్వాసనే! బాధలనుంచి వారిని విముక్తుల్ని చేసేందుకు, ఇంతకూ నేనెవరినో ఎవరికైనా తెలిసిందా? మరణాన్ని .... శాశ్వతత్వాన్నని!
ఏనాడో కలిసుండాల్సింది కలిసి ఉండకపోవడమే, ఆశ్చర్యంగా ఉంది. ఆ వెన్నెల వికసించే వేళ నీవు, నేను లేని బాధను విరహ వేదన అనుభవిస్తున్నావు కదూ! గాఢంగా ...., చీకటి పొరల్ని, చకోరాల్ని మృదువుగా స్పర్శించాలని మదనపడుతున్నావు కదూ .... నాలా తల దాచుకుని ఏ నక్షత్రాల నీడలోనో మరో ఉదయం ప్రశ్నించే ప్రశ్నల సమాధానాలను ఒంటరితనాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక,
నీకు ఇక అంత అవసరం, ఒంటరిగా ఉండాల్సిన స్థితి ఉండదు. ఇద్దరం, ఇకపై ఒకే కల కందాము. ఒకే దుప్పటి పంచుకుందాము. ఒకే కోరిక, ఒకే అవసరం .... ఒకే గాలిని శ్వాసిద్దాం! బాహువులను తోడుంచుకుని ఒకరికొకరం చేరువయ్యేందుకు గుండెను గుండెకు హత్తుకుని స్థిమితతను కలిగించుకునేందుకు ఉపక్రమించుదాం!
అంతా జీవితమే! బ్రతుకు ఆటలో భాగమే, వైఫల్యాలను తప్పించుకోవాలనే ప్రయత్నం లో పాఠాలు నేర్చుకోవడం ఆశల సమీపానికి చేరి వేటాడాలనుకోవడం అప్పుడప్పుడూ అతిగా ప్రవర్తించడం. నిజం! దిగజారిన క్షణాల లోనే మనిషి నిజ వ్యక్తిత్వం చూడగలిగేది. కోరికలు తీర్చుకోవాలనే ప్రాకులాటలో కొంచెం కొంచెం గా అంతా ఆక్రమించుకోవాలనే .... ఆరాటం లో స్వేచ్చగా ఎగరాలని, ఎగరలేక పడిన ప్రతిసారీ అదే ఆఖరి అనుభవం కావాలని .... జాగ్రత్తగా ఉంటాను అని సర్ధి చెప్పుకోవడం లో, గుండె ఆతురత, తొందరపాటును సర్ధుకోవడం లో, అవును ప్రేయసీ .... నా నొప్పిని నీవు చూడగలుగుతున్నావా? నిజంగా నీకూ నొప్పిగా ఉందా? దూరంగా నడుస్తూ .... వర్షం లో నా అడుగులు తడబడుతున్నప్పుడు, పశ్చాత్తాపం తో .... జారుతున్న నా కన్నీళ్ళను
నీ ప్రేమ కొసం పిడచకట్టుకుపోయిన నా పెదాల దాహాన్ని కలల ఎండమావుల వెంట పరుగులు తీయడం నీడలో నా అరాటాన్ని గమనిస్తున్నావా? నాలానే నీవూ తపిస్తున్నావా? ప్రేమే కారణం .... అదే లేకపోతే హృదయం యాంత్రికతతో చిలుము పట్టక తప్పదు. అందుకే ప్రియా! .... రా! నా చెయ్యందుకో! నన్ను విశ్వసించు! నిన్ను విశ్వసిస్తున్నాను. నా మోహావేశపు వెన్నెల వీధుల్లో నాతో కలిసి నర్తించుతావని .... ఆశగా
తడబడుతుంటాను. చిద్రమైపోతుంటాను .... మాట్లాడాల్సొచ్చిన ప్రతి సారీ ఏడుస్తాను లోలోపల .... మనసు భావనలను మాటలు లా పలుకలేక .... నత్తి తో ............ అక్షరమేదో పంజాలా నా గళంపై దాడి చేసినట్లు పదాలు, పదబంధాలు బిగుసుకుపోయిన గొంతులోంచి కక్కి, దగ్గిన పదాలు అనర్ధవంతమవుతూ ........... మదిలోంచి పళ్ళవరకూ వచ్చినట్లు వచ్చి నైజాన్ని కోల్పోయి .... ఆగిపోయిన శబ్దం పదం లో 'త ' అనే అక్షరం గుండె లో ధమని వద్దే కొట్టుకుంటూ ............. నాలో బాధ వినేవారికి ఆశ్చర్యం గా పరిణమించి తల్లి, తండ్రి, తమ్ముడు కేవలం 'త ' అనే అక్షరం గొప్ప విషాదం 'త ' ను పలుకలేకపోవడం .... నేను
అమృత హస్తం అందించడం మరువకు నిద్దుర లేస్తూనే .... నేను కార్యోన్ముకుడిని అయి అంతలోనే ఆగి ఆలోచిస్తుంటే .... అర్ధం భయమని కాదు. నా కల, ఆశయం గమ్యం చేరే రహదారిలో నాలుగు రోడ్ల కూడలిని చేరి గతం మరిచిన ఒక మానసిక రోగిని .... నేనని రాత్తిరి చీకటి పుటల్లో నీ జ్ఞాన హస్తాన్ని వెతుక్కుంటున్నానని
నీ గుండె కొట్టుకుంటున్న శబ్దం ప్రతిద్వనిని నా తల నీ ఎదపై వాల్చిన క్షణాల్లో .... వినిపిస్తూ ఉంటుంది నీ రక్తనాళాల్లో .... పరుగులు తీస్తూ పరవశత్వం గా పరిణమిస్తూ ప్రేమ నా ప్రతి స్పందన కు ప్రతిస్పందన నీవై నీ ఆవేశం కదలికల కావ్యం .... నేనై
నా అనుకున్న అన్నీ నన్నుతో సహా ఇచ్చేసాను నీకు ఇంకా ఇచ్చేందుకు ఏమీ మిగలనంతగా అయినా నీ కళ్ళలో బాధే ప్రకాశిస్తుందెందుకో ఎవరికైనా ఇచ్చేసావేమో దొంగిలించారేమో ఎవరైనా .... హృదయాన్ని నా ఎద, మది మాత్రం నీ వద్దే పంచుకునేందుకు దాచుకునేందుకు నావద్దంటూ ఏమీ దాచుకో లేదు .... నా కోసం నిన్ను గుండెలను గాఢంగా హత్తుకుని ముద్దాడాలనుంటుంది కానీ ఏ ప్రతిస్పందననూ పొందలేక వొదిలెయ్యాల్సొస్తుంది మరింత గాఢంగా దగ్గరకు లాక్కోవాలనే ఉద్వేగాన్ని దూరంగా నెట్టేసి .... మరీ నీ గొంతు ద్వని లో బాధే వినిపిస్తూ ఉంది. కేవలం నిశ్శబ్దమే ప్రతిద్వనిస్తూ ఉంది. వెన్నంటి వున్నట్లు .... నీడలా చీకటిలో నిలబడి ఎదురుచూస్తున్న రాగబంధం లా .... చెలీ
నీవు వస్తావనే ఎదురుచూపులలో తెలియని భారం నొప్పి విసుగు ఆతురత .... ఆరంభంలో నీవు రాని ఒంటరితనం లో మాత్రం ద్వేషం కోపం గా ప్రబలమై సహనం పరిక్షతో ఎంత వ్యర్ధమో కదా సమయం