Saturday, August 24, 2013

ఒక పాట నీ కోసం

నేను, నీ కోసం 
ఒక అందమైన భావనను 
కవితలా రాయాలనుకుంటున్నాను. 
ఒక 
మనోహర, సుందర అనుభూతిలా 
ఒక పాటలా రాయాలనుకుంటున్నాను.
ఆ అక్షరాలు, ఆ పదాలే 
అసూయ చెందేంత అందంగా
ఒక మధుర మనోజ్ఞ సుందర భావాన్ని .... ఒక పాటలా 
నీ మది పొరల్లో 
నిక్షిప్తమైన జ్ఞాపకాల పరిమళాలు అస్వాదించేందుకు 
నీ మది, నీలోంచి 
రెక్కలమర్చుకుని గాలిలో ఈదుతూ 
గగనం లోకి 
సినిమాలో లా సాగి 
శూన్యంలోకి వెళ్ళి భూగోళాన్ని చూస్తున్నట్లు 
మానవాళిని కలల్లోకి నెట్టి 
విధ్యుద్ధీపాల చమక్కుల చీర కట్టుకున్న పట్టణాలు 
ఉద్యమాల బెడద లేని నిద్దుర లో 
ప్రశాంతంగా పవ్వళిస్తున్నట్లు చూస్తున్నట్లు ....
ఒక అందమైన వింత భావనను 
పాటలా రాయాలనుకుంటున్నాను.
కేవలం నీ కోసం 
నేను, ఆ అందమైన భావనను 
పాటను ఆలపించాలనీ అనుకుంటున్నాను. 
కానీ, నా గళం అంత సున్నితం కాదు. 
నా గానం గాంధర్వమూ కాదు. 
నా పలుకుల్లో వ్యంగత్వం కనిపించొచ్చు!
మరి ఓ వచనం లా 
కవులకు మాత్రమే అర్ధం అయ్యే ఒక కవిత లా 
ఒక ప్రేలాపన లా చదువుతూ ఉన్నట్లుండొచ్చు!
నేను, నీ కోసం 
ఒక మధుర మనోజ్ఞ సుందర భావనను 
పాటలా రాసి నీ ముందుంచాలనుకుంటున్నాను. 

No comments:

Post a Comment