Wednesday, May 22, 2013

నేను సామాన్యుడ్ని


డబ్బున్నోణ్ణి కాను .... నేను,
రైతు బిడ్డను
నేల నోరెండిన బంజరంత విశాలం
నా గుండె గది
అర్ధం కాని మాటలకు
అంతా అర్ధం అయినట్లు పగలబడి నవ్వలేను
కాలాన్ని నీతో కలిసుండి
మధురంగా
మలుచుకుందుకు ప్రయత్నించగలను
నేను డబ్బున్నోణ్ణి కాను.

ఎవరో మెచ్చుకునేందుకని,
నా స్థోమతును మించి
నీకు ఖరీదైన ....
డైమండ్ నెక్లెస్ ను కొనివ్వలేను.
నా స్వేదంతో చిక్కబడిన
కర్మ ఫలం ఫంట ధాన్యాల్ని
నీ ముంగిట్లో గుమ్మరించగలను,
సినిమాలో లా హీరో ని ....
ఆరడుగుల ఆజానుబాహుడ్ని కాను.
నిన్ను నిండుమనసుతో దగ్గరకు తీసుకుని
ఏ అసౌకర్యం కలక్కుండా చూడగలను .... నేను,
ఎవరో గొప్పగా అనుకోవాలని జీవించలేను.

క్షణ క్షణమూ అపనమ్మకం
అభద్రతాభావం .... నీడై వెంటాడుతున్నట్లు
వెకిలి జోక్స్ తో
నిన్ను నవ్వించాలని చూడను.
నీతో కలిసి
మరిచిపోలేని జ్ఞాపకాల్నీ
సిగ్గుల్ని, చిరునవ్వుల్నీ ప్రోగుచేసుకోగలను..
లాంగ్ డ్రైవ్ లు, విహారయాత్రలు
కలిసి తిప్పేందుకు .... ఓడంత కారు లేదు.
సాయంత్రాలు ఆరు బయట కలిసి కూర్చుని ....
గంటల్ని క్షణాల్లా కరిగించగలను .... నేను,
ఎవర్నో నవ్వించేందుకు విదూషకుడ్ని కాలేను.

అందగాడ్ని కాను.
కురూపిని కాను. మన్మదుడిలా ఉండను.
నీవు ఆనందంగా ఉండేందుకు
నీ మనసెరిగిన మనిషిలా మసలగలను.
నేను పెద్ద కుటుంభం ....
మోతుబరిని కాను .... నేను
నిజం, నమ్మకం, ప్రేమ ముద్దను!
మధురాక్షరాల పద భావాన్ని
నిష్కల్మషత్వం చిరునామా గా
నన్నూ, నిన్నూ వేరుగా చూడలేని సామాన్యుడ్ని .... నేను
అందగాడ్ని, మన్మదుడ్ని కాను.

No comments:

Post a Comment