Monday, October 22, 2012

ఒకటో తారీఖు!


నాలోని నిరుపేద

ప్రైవేట్ కంపినీలో గుమాస్తా

తనలో తానే గొణుక్కుంటున్నాడు

ఇన్సురెన్స్ గడువైపోయిందని  

గృహావసరాలు పిల్లల పరిక్షల ఫీజులు

పండుగ ఖర్చులు

ఇన్సురెన్స్ కని దాచిన సొమ్మును మింగేసాయి

 
సాటి ఉద్యోగి

జీతం డబ్బుల్ని అరువుగా

పక్షం రోజుల్లో

తిరిగిచ్చేస్తానని తీసుకున్నా

పెనాల్టీ లేకుండా కట్టాలనే ఆలోచన

మనసులో మాత్రం ... ఆశ

ఉన్న ఈ ఉద్యోగం చేజారితే

మరో ఉద్యోగం దొరుకదని తెలుసు ... అందుకే

స్నేహాన్నొకవైపు, ఉద్యోగాన్నొకవైపు కాపాడుకోవాలని

  
ఱంపపు అంచుమీద కూర్చున్నట్లుంది.

నాకు నేను ... నిజాయితీపరుడ్నైతే చాలదు

జీవన భారం సంసార సాగరం

కాలంతో పాటు ఈదే ప్రయత్నంలో

ఎప్పుడూ వెనకే ఉంటే ... ఆశించక తప్పదు.

ఎవరో ఒకరి చేయూతను ... ఎదురుచూడక తప్పదు.

ఒకటో తారీకెప్పుడొస్తుందో అని ... మాటమీద నిలబడగలనో లేదో అని,

అందుకే ... ఋణభారం తీర్చే సామర్ధ్యం ప్రసాదించమని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా!

ఆశ!


ఆ ధైర్యము ... ఒంటరి పోరాటం
ఆ త్రికరణశుద్ధి ... నిర్మలత్వం
సూటిగా ఉన్నదున్నట్లు మాట్లాడే తత్వం
ప్రకాశమానం ఆ ఆత్మగౌరవం
నా మనసు అయస్కాంతాన్ని చేరే ఇనుప రజనయ్యింది
ఇష్టమనే భావన .... ఉత్సుకతై ప్రేమయ్యింది
ప్రేమలో పడ్డాను
సమాజానికి ... సందేహాలుండొచ్చు
ఆడదాన్నని మరిచిపోకూడదు
అలా మాట్లాడకూడదు అలా ప్రవర్తించకూడదు ...
వినయం అవసరం అనుకోవచ్చు
నిజానికి ఆమె ఆస్తి అదే
నాకు మాత్రం
స్నేహానురాగ బంధాలతో ... ఆమెతో
సహజీవనం ఆరంభించాలని,
ఆమెకు అభ్యంతరంలేకపోతే
ఆమెతో కలిసి ఒకే గమ్యాన్ని చూడాలని ... ఆశ!

ఆనందవికాసం!




వడిగా పారే ప్రవాహపు బలం
కలతచెందని మనసు ప్రశాంతత
ఆరోగ్యం, ఆనందం, కలిమి కలగలిపి
సామాజికంగా ఎదురుపడ్డ అందరికీ చెందాలని
అందరూ ఆనందంగా ఉండాలని ...

కారణజన్ములే ప్రతి ఒక్కరూ
ఎవరికి వారు వారిలోని శక్తి, నేర్పరితనం
అధికపక్షం సామర్ధ్యం ప్రదర్శించే అవకాశం
ఆనందించే ఆలోచనలు చెయ్యాలనే
ఆశావాదం నిజం కావాలని ...

సర్వోత్తత గురించి ఆలోచించి
సర్వశ్రేష్ఠత కోసం పనిచేసి
ప్రాముఖ్యతను పొందాలని
స్వీయ విజయాన్ని ఆశ్వాదించినంత
ఆనందంగా, ఉత్సాహపూరితంగా
ఇతరుల విజయాన్నీ ఆనందించాలని ...

గతం పొరపాట్లు, తొందరపాట్లు పునాధులై
సాధించబోయే రేపటి విజయాలు
మహత్తైన కార్యాలపై దృష్టిని పెట్టాలని
ఎప్పుడూ చెరగని ఆనందం ముఖభావమై
చిరునవ్వుతో అందరినీ పలుకరించాలని ...

ఎవర్నో విమర్శించే సమయం లేని
ఔన్నత్వం కోసం పరిశ్రమ గమ్యంగా
చింత, కోపం, భయంలేని
సేద్యం చేసే కష్ట జీవిలా
సమశ్యల్ని స్వాగతించే సమాధానాలు కావాలని ...

మంచిని మదించి ఆలోచించి
అరుపుల్తో కాక చేతల్తో
సమాజాన్ని నడిపించి
వెంట నడవాలనే విశ్వాసం పెంచి
నీతి, సత్యం, ఆనందవికాసం ... పొందాలని ...

జీవన ఆనందం!


కొమ్మకు కాపలా సూదిలా,
ఎదిగేకొద్దీ పదునౌతూ ... పువ్వు
సొగసు నీడలా రక్తం చిందించేలా ముల్లు
జీవించడం, ప్రేమించడం నీడలో
సమస్యల సూదులు తియ్యని అనుభవాల్లా ...
అయినా,
జీవిస్తూనే, ప్రేమిస్తూనే ఉన్నాం!
బాధలేని జీవితం లేదని తెలిసీ,
సమశ్యల సాగరం ఈదడం లో ఉంది ఆనందం!
అందుకే,
అందమైన గులాబీలాంటి గమ్యాన్ని చూద్దాం!
సమశ్యల ప్రశ్నల్లో నిలదీసే గడుచుతనం
ముల్లు చేసే కసి గాయం ... తియ్యదనాన్ని చూద్దాం!
ప్రేమ-మోహము కలిగించె నున్నని గులాబీ రేకుల
తియ్యని తేలివచ్చే పరిమళాల అనుభవం చూద్దాం!
అన్నీ తియ్యని గమ్యం చేర్చే అనుభవాలు ఆనందాలేగా!

యౌవ్వనావేశం!



ఒక సుకుమార,
సున్నిత స్పర్శ
కోరిక, వాంచ నిండిన
గుసగుసల స్వర ఝరి
శరీరాల రాపిడితో ... ఊపిరాడని
బిగి కౌగిలి ... వెచ్చదనం
ప్రణయ రాగ రసం ఎగసి,
సెగ, మంటై ... కాల్చేస్తూ ప్రణయం

మౌనమే బాష
ఆ ఇద్దరి మధ్య
ఉద్వేగం, ఊపిరి వెచ్చదనం
మాటపై నెలబడలేని మనో స్థితే
శరీరాల పలుకులు ... పదాలు
కసి నిజాలే అన్నీ
వెనుదిరిగి చూడలేని
పశ్చాత్తాపము ఆలోచన రాని అలౌకికం

ఒకరినొకరు పొదువుకుంటూ
అది ఆశో, వాంచో, భ్రాంతో
అమూల్యమైన క్షణాల కాలం
పరుగులు తీస్తూ కవ్విస్తుంటే
ఆమె దేవత అతనికి
అతను దైవం ఆమెకు ...
సమర్పణాభావం ఇద్దరిలో
కర్పూరం హారతిలా కరుగుతూ ...
నిశ్శబ్దం, ఒంటరితనమే వారి నేరం

సమాధానం చెప్పుకోవాల్సిన
రేపొకటుంటుందని, పరిణామం
సిగ్గు మోహాల్ని దాచుకోలేనితనం
బాధై మిగులుతుందని
ఈ చీకటి రాత్రి బలహీనావస్థ లక్షణాలు
మోహపు మంటలు చల్లారాక
ప్రశ్నై మిగులుతాయని ఎద ఎరుగదు
వయసు వేడి చల్లారాగ్గానీ మనసుకు తెలియదు!
 

ప్రేమసంపద!



నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో,
నా ఇష్టాన్ని ... మనసు భావాల్ని
చెప్పలేను పదాల్లో!
పలుకరింపుల్నీ, పులకరింపుల్నీ,
ఆనందాన్నీ, అనుబంధాన్నీ ... దాచుకుంది నీకోసమే అని

నా జీవితం ... బలహీన క్షణాల్లో,
మనుగడ కోసం తప్పని ...కాలంతో పరుగుపందెంలో,

సమశ్యల ఊబిలో కూరుకుపోయి, కదలలేక ... నీరసపడ్డప్పుడు
చెయ్యందించడానికి, ధైర్యం పంచడానికి ...
నీవూ నాతో ఉన్నావని వెన్నుతట్టే ప్రేరణవై సహకరిస్తున్నప్పుడు

నిద్దుర సేదదీరిన ... అరుణరాగం వేళ
జీవనావసరాల వేటలో అప్పుడప్పుడూ దొరికే విరామ వేళ
అనిశ్చితాల సుడిలో సతమత మయ్యే వేళ
మళ్ళీ విశ్రమించే చీకట్లు ముసిరిన వేళ
నా మదిలో ఆలోచనల్లో చైతన్యానివి నీవే

ఎదురుగా నీవు లేవని తెలుసు ... కానీ,
నా ఊహల్లో నీ రూపం చిత్రించుకుంటాను
ఎంతో సుందరమైన నీ చిరునవ్వును ... నా బలంగా
నాగరికంగా నిన్ను సుతారంగా స్పర్శించినట్లు
కౌగిలించుకున్నట్లు భావనల్లో మునుగుతూ ఉంటాను.

నా ప్రతి ఊహను అల్లరి ఆలోచనలను
ప్రేమావేశపు సరస భావనలను
పశ్చాత్తాపముతో విన్నపం లా కాకుండా,
అమూల్య సంపదలా ... నీతో పంచుకోవాలని ఉంటుంది
ఎందుకంటే,
నీవెప్పుడూ నా పక్షం నుంచే చూస్తున్నట్లుటుంది కనుక

అప్పుడప్పుడూ ఆ దైవానికి, ఈ ప్రకృతికి
నీ కన్నతల్లికి, సమాజానికీ
చెప్పుకోవాలనుంటుంది కృతజ్ఞతలు
నా సహచరిగా ... అమూల్యమైన ప్రేమసంపదను
నిన్ను పొందగలిగినందుకు ...

అందుకే,
నా మనసు భావం నిజం, వాస్తవం చెబుతున్నాను
నీవే నా జీవన బృందావనం రాధికవు హృదయ రాగానివి అని

సాంకేతికం మానసం


నీతో పరిచయం అయ్యాకే తెలిసింది
నా శ్వాస లో చల్లదనం ఇక ఉండదని.

కాలమంతా సాంకేతిక సమశ్యల ...
చదరంగం ఎత్తుల మయమై యిన్నాళ్ళూ
గుండె కొట్టుకోవడం లో నెమ్మదితనం
వాదించో నిరూపించో సాధించేవాడ్ని!

నీతో మనసుచాలనం చేసాకే తెలిసింది.
ఇన్నాళ్ళూ నా బాహువుల్లో,
నా ఆరాటం లో, నా ఆలోచనల్లో
శూన్యమే అంతా అని,

నా మది నీ ఆలోచనలతో ...
సతమతం అవ్వడం
తగలని గాయం సలపడం ... మొదలయ్యాకే
ఏమయ్యిందో ఏమో ... కూర్చోలేను నిలబడలేను!

జీవన చదరంగంలో నేనిప్పుడు
ఆటగాడ్ని కాదు ... ప్రేక్షకుడ్ని.

క్షణాలు, గడియలై ... గడియలు రోజులై ...
ఆలోచనల టైం అవుట్ అవుతూ ...
ఎదురుచూపుల కలవరం ...
నిన్న నిన్ను కలిసేవరకూ
ఆకాశంలో చంద్రుడు నక్షత్రాల మిణుకు మిణుకులు ...
తణుకులు చోద్యంగా చూసేవాడ్ని!

నిన్ను బిగి కౌగిలిలో బందించాకే
చూసాను ...  నక్షత్రాల మిణుకులు తణుకుల్ని
నీ కళ్ళలో!
ఆకలి భావన ఆహారంతో తీరని ఆబ
తీరని దాహం ముచ్చెమటలు పట్టడం
నీతో కలిసి తిని తాగి పంచుకునేవరకూ
సహకరించని శరీరం

నిన్న నిన్ను ఉద్యానవనంలో కలిసాకే ...
పరిపూర్ణత అంటే ఏమిటో
ఆకర్షణ కోల్పోవడంలో ఆనందం
అర్ధం తెలుసుకోవాలని అభిరుచి మెదలయ్యింది.

డిజైన్స్ చేసేప్పుడు రిడండన్సీ
ఫెయ్ ల్ ప్రూఫ్, క్రిటికాలిటీ, యాక్షన్ ప్లాన్
ఇత్యాదులే తెలుసు ... ఇన్నాళ్ళూ!

నీతో తొలిచూపు కలిపాకే
తొలి కలయిక అయస్కాంతంలా నా
ఆలోచనలన్నీ నిన్ను అంటుకు పోయాకే తెలిసింది
సుడిగాలి, చక్రవాతంలా మనశరీరాలు
ఆత్మలు ఒక్కటవ్వడమే
నా మనస్థితికి సమాధానం అని.

పదాలు కవితల్లా పెదాల్ని తాకి,
తియ్యని మధుర గీతంలా ... అలరించాకే
నా ఈ మనోభావన
ప్రియా! ప్రియతమా! ఎన్నాళ్ళింకా నా ఈ నిరీక్షణ  నీకై అని

ఒకరికొకరమేనా నీవూ నేనూ!?




అపరిచితుల్లా మొదలయ్యింది
నీ, నా స్నేహం
నువ్వన్నావు!
నివంటే ఇష్టం! నిన్ను ప్రేమిస్తున్నా ... అని
ఆ క్షణం ... ప్రతిస్పందించి,
స్వాగతించే స్థితిలో లేను నేను

రోజు రోజుకూ
మన పరిచయం పెరిగి ...
కలుసుకోవడం
ఆలోచనల్ని పంచుకోవడం
ఒకే దృష్టితో
సమస్యల్ని చూడ్డానికి ప్రయత్నించడం నిజం!

ఔనూ!
ఇద్దరు వ్యక్తులు స్త్రీ పురుషులు అయితే,
ఆ బంధాన్ని
ఇష్టం, ప్రేమే ... అని
ఎందుకనుకోవాలి?
స్నేహం, సామాజికం అనుకోవచ్చుగా అని అనుకున్నాము.

అలా ఆటలా,
పోటీ వాతావరణంలో మొదలయ్యింది
నీ, నా భావాల సంఘర్షణ
ఆటలో నిండా మునిగిపోయాము.
నాకు తెలియకుండానే
నేను మునిగింది ప్రేమలో అని
అప్పుడే తెలిసుకున్నాను

ఆ క్షణం నుంచి ...
మేలుకొన్న తరువాత,
చివరికి నిదురించేముందూ నేను చేస్తుంది.
నీ ఆలోచనల్నే!
నిన్నే నేనూ ప్రేమిస్తున్నానని,
నిన్ను వీడి నేనుండలేని జీవితం ...
కోరుకోవడం మొదలని అర్ధమయ్యిన క్షణాలవి!

మన ప్రతి కదలిక,
అర్ధరాత్రి ఆలోచనలు,
మూగసైగల పరిహాసాలు,
అనుపయుక్త చేతలు,
నవ్వుకోవడాలు
మరింతగా,
నీ ప్రేమలో నన్ను తడిపేసాయి.

నా మనసు
సీతాకోకచిలకలా
నీ ప్రతి తియ్యని
పలుకుల చుట్టూ
పరిభ్రమిస్తూ,
కాలం క్షణాల్లా ...
జీవితం సంధ్యావస్థలోకి

అప్పుడప్పుడూ ...
నిన్ను ప్రేమించని మనిషితో
ఉన్నట్లు ఉండే ... నీ ప్రవర్తనే ఆశ్చర్యం
నిజంగా, నీవూ నేనూ ఒకరి కొకరి మై పుట్టామా,
ప్రమాదవశాత్తు ఒకటయ్యామా,
లేక ... మనసు నైజమే అంతా అని
మనోవేధన కలవరం ... ప్రియతమా!

పొగొట్టుకున్నాను



నీవూ,
నేనూ కలిసిన
తొలిసారే
నన్ను నేను పోగొట్టుకున్నాను!

విశాలమైన
నీ కనుల ఆకర్షణలో
లోతైన నీ చూపుల
వెన్నెల సముద్రంలో .......

సిగ్గు బుగ్గ పై
సొట్ట మొగ్గ పల్లవించిన
వివర్ణమైన
రోజాపువ్వు సొగసులో .......

దూదిలా
సున్నితమైన
పాలరాతిలా నున్నని తెల్లనైన
నీ శరీర చాయలో .......

పెదాల చాటున
నవ్వినప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ
దోబూచులాడే ముత్యాలు
దానిమ్మ గింజల్లాంటి
పలువరస మెరుపులో .......

ఇష్టాల్నీ
మనోభీష్టాల్నీ
లాలసనీ దాచుకుని మరీ
నన్ను నేను కోల్పోయాను.

అన్నీ
సర్దుకుని
నమ్మించి, మౌనంగా
నువ్వు వెళ్ళిపోయావు.

ఇప్పుడు

లోతైన
నీ చూపుల
వెన్నెల సముద్రం లేదు.

పల్లవించిన
వివర్ణమైన
రోజాపువ్వు సొగసు లేదు.

పాలరాతిలా
నున్నని తెల్లనైన
నీ శరీర చాయ లేదు.

ముత్యాలు
దానిమ్మ గింజల్లాంటి
నీ పలువరస మెరుపు లేదు.

వలపెక్కడో వగపే అంతా!
నీ నీడలా ... నన్ను నేనే కోల్పోయాను
మనోవేదన, పశ్చాత్తాపం తియ్యని బాధై ....... నా హృదయంలో!