Saturday, January 12, 2013

జీవితం ఒక దివ్యానుభవం



నిశ్శబ్ద రహదారుల వెంట నడుస్తూ .... నేను,
సమాధానాలకు ప్రశ్నలు ఆలోచిస్తూ ఉన్నా
దూరంగా కలిసినట్లుండి
సమాంతరంగా సాగే భూమ్యాకాశాల మధ్య
దూరం కొలవాలని,
రహదారి పక్కన కుంటలు
నీళ్ళల్లో .... ఆకాశాన్ని చూస్తూ
ఆశ్చర్యకరమైన ఆలోచనలు.
వేడికి తట్టుకోలేక,
శరీరాన్ని దాచుకున్న పసువులు,
పిచ్చి జమ్ము మొక్కల మధ్య
అక్కడక్కడా కలువ పూలు,
అంతులేని ఆశలు .... జలచరాలు,
అనంత ఆపేక్షలు స్నానాలాడుతూ ....
మనసుకు నచ్చిన ఆశలు కొన్ని
చిత్రాలుగా .... నా మెదడులో జ్ఞాపకాలై,
ఆపుదల లేని కాలం అవిశ్రాంత పరిభ్రమణం!
 కుంటల్ని దాటి కదులే కొద్దీ
విసర్జిత పదార్ధాలు పారవేసే స్థలం
ఆ చెత్తను ఈగలు, దోమలు, బొద్దింకలు
పురుగులు మయమై
ఆ చెత్తను బయో మాస్ అనలేను.
అలా అని మానవత్వం
మంటకలిసిన చెత్త పదార్దం అనలేను.
నా దృష్టిలో జీవితం
అందమైన ఓ ఉద్యానవనం!
అలానే నడుస్తూ పోతే,
అటూ ఇటూ కర్రలు కట్టిన చక్క వంతెన
పక్కనే ఒక వీధి
ఆ వీధి నిర్మానుష్యంగా,
ఇంకొక వీధి అర్భాటం, హడావుడీ తో సంతోషంగా ....
పిల్లగాలులు తాకి మంచు చినుకులు
గట్టిగా నన్ను తట్టి .... ఝలదరింపు
ఆకాశం మబ్బుల మయమై
మబ్బులు పడమటి దిశగా
కదులుతూ కమ్ముకొస్తూ ....
దూరంగా .... శ్మశానంలో
చెలరేగిన మంటల ప్రేలుడు శబ్దాలు
ఎవరో వెంటాడుతున్నట్లు
కల్మషంలేని యాంత్రిక ధర్మాలు
మనిషి ఎంతగానో పరిశోధన చేసి
ఒప్పుకున్న భ్రమరాహిత్యపు మృగభావనలు
అయినా నా ఉద్దేశ్యంలో
జీవితం ఒక అద్భుత అవకాశం!

No comments:

Post a Comment