Friday, March 22, 2013

జీవన న్యాయం!


నా హృదయ
స్పందనల లయ తెలుసు
కలల్లో విహరిస్తుంటానని తెలుసు .... నీకు.
ఎంత తిరిగినా
ఎంత శోధించినా
సప్త సముద్రాలు దాటి
ఖండాంతరన్నీ తిరగేసి చూసినా
మనసుకు స్థిమితం లేదు
నా కోరిక తీరడం లేదు
ఎందుకో
ఈ రాత్రి ఈ నగరం
అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది.
నా మనొభావాల్ని
నిజాల్ని వాస్తవాల్నే చెప్పాలనిపిస్తుంది. 
లేచి రా నగర వాసీ
కాసింత ప్రేమను పంచు!
నా పక్కన ఉన్నానని విశ్వాసం కలిగించు!
ప్రేమను ప్రేమించు
ప్రేమ కోసమే జీవిస్తున్న నన్ను ప్రేమించు!
నిష్కళంక ప్రేమ కోసం
తిరుగుతూ ఉన్నాను.
స్వార్దం ఉగ్రవాదం విషం చూస్తున్నాను.
సహనం, దయ, ప్రేమ
సాన్నిహిత్యం కోసం శోధిస్తూ ఉన్నాను.
నాలో
ఏనాడో కోల్పోయిన
నీ సోదరుడ్ని చూడు .... ఓ చిన్ని సోదరీ!
ఒంటరితనాన్ననుభవిస్తున్నాను.
ఓ నిండు మనిషినుంచి
సహజీవినుంచి
సహన మూర్తి ఎవరినుంచైనా
ప్రేమను పొందాలనుకుంటున్నాను.
లేచి రా తమ్ముడూ!
లేచి రా చెల్లెమ్మా!
లేచి రా నేస్తమా!
ప్రేమను ప్రేమించేందుకు
ప్రేమను బలపర్చేందుకు
ఒక మంచి కారణం చెప్పు?
కులం అవసరమా!
మత విభజన జీవితమా!
అగ్నితో ఎందుకు చెలగాటం?
పుట్టినప్పుడు లేని తోకల కోసం
పోరాటాలెందుకు?
నేను అబద్దం ఆడటం లేదు.
ఈ రాత్రి
ఈ నగరం ఎందుకో ప్రశాంతంగా ఉంది.
ఆహ్లాదంగా ఉంది.
ఈ ప్రశాంతతను ఇలాగే కొనసాగనిద్దామా!
మరో శుభ ఉదయం కోసం
మనవంతు కృషి మనం చేద్దామా!?
లేచిరా నేస్తమా!
ప్రేమను ప్రేమించేందుకు
సహ జీవనాన్ని పునరుద్దించేందుకు
నేనున్నానని పక్కన నిలబడేందుకు
జీవన న్యాయం వర్ధిల్లేందుకు ....
ప్రేమకై శాంతి కై నిలబడదామా నేస్తమా!

2013, మార్చ్ 23, శనివారం ఉదయం 8.30 గంటలు.

No comments:

Post a Comment