భుజానికి అయిన గాయం
పుండై సలుపుతుంది.
గాయం కదిలినట్లై,
..................
తటపటాయిస్తున్నాను.
నీవు అడిగినా
భారం దించుకోవాలని ఉన్నా
న్యాయమా అని,
..................
పుండు పై కారం చల్లినట్లు
నొప్పి ఎక్కువైనప్పుడు,
పరామర్శించి ....
నా బాధను చూడలేని,
ఒక మంచి మనిషి తోడు కోసం,
...................
నా సమశ్యల్ని పంచుకుని
శ్రద్దగా వినే
ఒక మంచి మనసు నీడకోసం
వెదుక్కుంటున్నాను ....
.....................
నా ఆత్మను తృప్తి పరిచి
నా తడి కళ్ళను తుడిచే
స్నేహ హస్తం ఎక్కడుందా అని.
.....................
చింతల్ని నా నుంచి
ఋణం గా తీసుకుని
సేదదీర్చే
అమృతహస్తం కోసం
.......................
నా శారీరక
సమశ్యల్ని, రుగ్మతల్ని తప్ప
అన్నింటినీ పంచుకునే
ఒక మంచి నేస్తం కోసం
ఎక్కడైనా ఎదురొస్తుందేమో అని.
బంగారము, ఇసుక,
పాలు, నీరు,
గాలి,
అగ్ని,
ఆకాశము,
నిర్మల తరంగాలలో ....
కడిగేసుకుంటున్నాను.
నిన్నటి పాద ముద్రల్ని,.
స్పష్టము, మృదువైన ఉపరితలం పునరుద్ధరణకని,
నూతన పాద ముద్రల్ని ఏర్పరిచేందుకని.

కన్నీళ్ళపర్యంతం
భయ విహ్వల అయ్యింది ఆమె.
భయం, అనుమానం .... అయోమయం
తనలో చోటు చేసుకున్న పరిణామాల్ని
విన్నవించుకుంది అతనికి.
........
సంతోషపడతాడు, ఉల్లాసంతో ఊగిపోతాడు.
"నేనున్నాను" అని, గర్వపడటం తో పాటు
ధైర్యం చెబుతాడు అనుకుంది.
"తొందరపడ్డావు? ఆలోచన లేదు!
మూర్ఘురాలివి?" ఊహించని మందలింపు,
అనాసక్తత ను తట్టుకోలేక పోయింది.
అతను .... దొరబాబు. వదలి, వెళ్ళిపోయాడు.
తిరిగి వస్తాడని, ప్రేమ పాశం లాక్కొస్తుందని
చూడకుండా ఉండలేని భ్రమలో
చాన్నాళ్ళు గడిపింది.
నిష్క్రమిస్తాడని, నిశబ్దం గా జారుకుంటాడని
ఊహించని, మనసుకు నచ్చచెప్పుకోలేని స్థితి లో
చరిత్ర పునరావృతం.
మరోసారి మోసపోయింది ఆడతనం.
ఆమె గుండె బ్రద్దలయ్యింది.
పగిలిన ముక్కల్ని యేరుకోవాల్సిన స్థితి.
తప్పంతా తనదే .... చేరువవ్వడం.
అప్సరసవన్నాడని. ప్రాణానివన్నాడని.
దేవతవన్నాడని.
బ్రతకలేనన్నాడని .... నమ్మడం.
............
బాధ్యతారాహిత్యం గా అతను,
పట్టించుకోకుండా పారిపోతాడని అనుకోకపోవడం.
సమాధానం చెప్పుకోవాల్సిన,
దుస్థితితో పాటు,
నేరస్తురాలవుతానని అనుకోక పోవడం.
...........
ఇప్పుడనిపిస్తుందామెకు.
మనిషిని చదవగలిగే మనసుంటే
ఎంత బాగుండేదీ అని.
హృదయం విశ్చిన్నం కాకుండా
కాపాడుకోగలిగేదాన్ని కదా అని.
ఈ కవిత అంకితం అతని ఊహల సహచరిణికి
ఆమె ఎంత అమూల్యమో .... అతనికి
ఎంత ఇష్టం, ప్రేమో ఆమంటే అని,
రాసుకుంటుంటే!
ఒక నమ్మకం, అభిమానం మాత్రమే కాదు.
నిజం! .... అతనికి, ఆమె ఒక గొప్ప బహుమానం.
ఆమె .... అతని సూర్యోదయము.
అతని సూర్యాస్తమయము.
అతని రాత్తిరి.
అతను శ్వాసించే గాలి,
అతనికి ఎంతో ప్రీతిపాత్రమైన వారసత్వం పునాది.
ఆమె .... ఒక స్నేహితురాలు అతను ఒంటరి అయినప్పుడు,
అతను బలహీనపడినప్పుడు తోడై బలాన్నిచ్చే ధైర్యం ఆమె
అతన్ని నిద్దుర లేపి, చైతన్యవంతుడ్ని చేసే
సూర్య కిరణాల ప్రకాశం .... ఆమె
సున్నితమైన చేతి వేళ్ళతో తాకి
సమశ్యలన్నీ మటుమాయం చేసే ఔషదం ....
ఆమె, అతని .... ఆనందం, సంతోషం
తేనెను పోగుచేసి, బాధల్ని పంచుకునే సహచరి
బహుశ, అతని కోసమే ఆమె,
ఆమె కోసమే అతను జీవిస్తున్నారేమో అనిపించేలా
అతని ప్రపంచాన్ని వెలుగుమయం, ప్రేమ, స్వర్గమయం
చేసేందుకే పుట్టిందేమో .... ఆమె,
అతను మాటల్లో చెప్పలేని భావం ....
జీవితం అవసరమూ, జీవన ప్రాణవాయువూ ఆమె.
ప్రతి యువకుడి యౌవ్వనం లో, ఊహల్లో
అతను కోరుకున్న భార్యామణి వ్యక్తిత్వం ఆమె.
క్రింద,
ఇంకా క్రింద
భూమి మీద, దూళిలో
నీవొక వృక్షం
నమ్మకం విత్తును విత్తి చూడు.
ఎదిగేందుకు ....
పైకి,
పైపైకి,
ఆకాశం లోకి,
స్వర్గం దిశగా ....
మట్టి లోంచి,
బురద లోంచి,
మురికి లోంచి,
నరకం ....
స్వేదం లోంచి.
నేను ఎప్పుడో వచ్చి,
ఇక్కడే ఉన్నాను.
బహుశ, నీకలా
అనిపిస్తుండకపోవచ్చు
నమ్మి, స్వేదించి చూడు!

వానలో, ఎండలో
ఒక చిన్న గొడుగు తోడు గా
జాగ్రత్తగా
స్వీయ రక్షణ చేసుకుంటూ,
బురదలో, ముళ్ళ లో
రాళ్ళూ, పగుళ్ళ రహదారిలో
ప్రమాదం లేని, అలసట తప్పని
ప్రమోదమో, విచారమో తోడుగా
నీవూ, నేనూ ....
ప్రయాణం చేస్తూ ఉన్నాము.
ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసుకుని ....
నవ్వుతూ, నటిస్తూ
జీవితాన్ని మోసం చేసుకుంటూ,
నేను నేనులా ఉండాలననుకుంటున్నా!
నా భావనల్ని పండించుకోవాలని,
నా కాళ్ళమీద నేను నడవాలని .... అనుకుంటున్నా!
మంచైనా, చెడైనా మనసుకు నచ్చిన విధంగా చెయ్యాలని,
ఈ సమాజం ఏమనుకుంటుందీ అని ఆలోచించకుండా,
ప్రేమించలేని, ద్వేషాన్ని భరించలేని పసివాడ్నిగా ....
కావాలని లేదు. ఏ సాహసమూ చెయ్యలేని
మనోధైర్యం లేని వృద్దుడ్ని గా బ్రతకాలని లేదు.
నా జీవితాన్ని నేనే జీవించాలనుకుంటున్నా!
నా ఆశ, ఆశయాల సాధన ను ఆనందించాలని,
నేను నేనుగా అస్తిత్వంతో బ్రతకాలనుకుంటున్నా!
ఏ కట్టుబాట్ల తాళ్ళకూ కట్టుబడాలని లేదు.
అందుకే నన్ను సరిహద్దుల్తో కట్టెయ్యాలని చూడకు!
స్వేచ్చగా జీవించాలనుంది. బయటపడాలనుంది.
నీ బంధనాలనుంచి, నీ ఆదేశాల నిరంకుశత్వం నుంచి,
నన్ను గమనించేందుకని నీ కాలం వృధా చేసుకోకు.
ఓ సమాజమా! నన్ను నన్నుగా నమ్ము!
నా గురించి మాట్లడకు! సంబంధం లేని వదంతులు పుట్టించకు!
నా ఆలోచనల్ని, నా నడవడికను, నా జీవనలక్ష్యాలను,
ప్రభావితం చెయ్యని జీవితాన్ని జీవించనీ .... ఒక్కసారైనా ....
నీ మాటల కత్తులు
గుచ్చిన గాయాలు
బాధై,
నీ నవ్వు
ఎగతాళి నొప్పి .... చల్లిన
కారం మంటల్లో
కురిసిన
కన్నీటి వర్షం
చినుకుల మెరుపులు
కారణం .... స్థిర చిత్తతకు
నన్ను నిలువునా ఆవహించిన
అంధకారం,
ద్వేషభావనగా మారి,
కాటుక కళ్ళు .... సూటిగా
నిన్ను చూస్తున్నప్పుడు
నా అస్తిత్వం, వ్యక్తిత్వం
గుచ్చుకుంటున్న .... చూపులు
అది చెడు దృష్టని
నీకు అర్ధం కాదు.
పరిణామం .... నీవోక వివేకవంతురాలివి.