Sunday, July 19, 2015

ఆలోచనల్లో


నన్ను నేను కొల్పోయాను.
ఆలోచనల్లో కూరుకుపోయి
భావోద్వేగ సునామీలో
నా అస్తిత్వం
తుడిచేసుకుపోయి
చాన్నాళ్ళే అయ్యింది
పోరాడుతూ
నేను ఓడిపోతూ

అనంత ఆలోచనల సాగరం లో
మునిగిపోయి
అప్పుడప్పుడూ పూర్వాపరాలను
పరిశీలిస్తూ ....
పరిణామం తెలిసీ
బయటపడగలననుకోవడం
అసాధ్యమని తెలిసీ
ఆశల చిగురు కై ఆరాటపడటం
     
నేను, నా జీవితం లో
అన్నీ పోగొట్టుకున్నాను.
అస్వాధించాలి అనుకునే లోపే
ప్రతిదీ కోల్పోయాను.
విధ్వంసక ఆయుధం
నాలో నాకు మిగిలిన
రాగద్వేషమే అయితే
ఎవ్వరైనా ఏం చెయ్యగలరు అని  


అస్తిత్వం కోల్పొయి
ఆలోచనల అడవి .... జీవితం లో
అగమ్యంగా తిరుగుతూ
బయటపడే చిన్న క్లూ కోసం
ఏ దేవుడో ప్రకృతో చెయ్యందించరా
నాకై నేను నిష్క్రమించేలోగా
మన్నించో మందలించో అని
ఆశతో జీవిస్తూ



Saturday, July 18, 2015

బ్రతుకు భారమైన క్షణాల్లో


లేచి నిలబడి కళ్ళు గట్టిగా మూసుకున్నాను.
అన్నివైపుల్నుంచి అలుముకున్న అంధకారం అది.
నా ముందు, నా సమీపం లోనే నిలబడి ఎవరో ....
సహచరుల ఆత్మల్లా ఎవరివో నీడలు
వారి శ్వాస నన్ను తాకుతూ 
కళ్ళు తెరిచేందుకే భయం గా
వారు, సునిశితంగా నా ఆత్మలోకి చూస్తున్న భావన
భయం .... ఏమి చూస్తారో అని
నా నిక్షిప్త అంధకారాన్నా, ఆశలనా
కలలనా, భయాలనా లేక
నేనుగా రూపుదిద్దుకున్న నా అస్తిత్వాన్నా అని,

ధైర్యం చేసి కళ్ళు తెరవాలనిపించి .... తెరిస్తే,
నిజంగానే .... నిలువుటద్దంలో
నా ప్రతిబింబాన్ని నేను చూసుకుంటే ....
నాపై నాకు జాలి వేస్తుందా? లేక భయం వేస్తుందా?
జీవితం నిజంగా అంత అమూల్యమా!?
స్వీయ శతృవునై నాతోనే నేను ప్రతిరోజూ పోరాడుతూ
పోరాడి ఓడి రక్తశిక్తుడ్నై ఇంటికి చేరుతూ 
మరణం గురించే పదే పదే ఆలోచిస్తూ
అది వచ్చేవరకూ ఎదురు చూసే ఓపిక లేక
సాదరంగా స్వాగతించేందుకు సిద్దపడి
బలహీనంగా శ్వాసిస్తూ .... ఎన్నాళ్ళీ బ్రతుకు భారం

Friday, July 17, 2015

ఒకవేళ మరణించాల్సే వస్తే


 మరణించాల్సే వస్తే
వేటాడబడి, గాయపడి
బురద,
మురుగు గుంట
పందిలా కాకుండా
ఆకలీ, పిచ్చి ముదిరి
నాలుగువైపుల నుంచీ
చుట్టుముట్టబడి, శపించబడిన
అరుపుల కుక్కలా
కాకుండా
ఘనముగానే మరణించాలని,
వీలుంటే
ఒక్క రక్తపు బొట్టూ
నేల రాలకుండా
అది భయంతోనే అనుకో
అది భక్తి తోనే అనుకో 
రాక్షసులైనా రాజకీయనాయకులైనా 
గౌరవించి పూజించేలా మరణించాలని, 
చావు
నా సంబంధీకురాలై
నాకూ, చావుకు
ఈ సమాజం ఒక సాధారణ శత్రువై
సంక్యాబలాన్ని మించిన సంకల్ప బలం
ధైర్యం నేనై
వారు కొట్టే వేల దెబ్బలకు
సమాధానం
నా ఒక్క మరణం దెబ్బయ్యేలా
నా పిడికిలే
ఒక విశాలమైన శ్మశానం లా
మారి మరణించాలని
పిరికితనాన్ని ఎదుర్కొలేని
హంతకురాలిలా కాకుండా 
గోడకు నొక్కెయ్యబడి మరణించాల్సొస్తే
పోరాడాలని వీరనారిలా
ఒక పోరాటయోధినిలా

Thursday, July 16, 2015

పిచ్చివాడి దేవతా ....


జతగా ఉండేందుకు ఎవ్వరూ ఇష్టపడనప్పుడు
ఎవ్వరైనా ఏమి చెయ్యగలరు?
ఒంటరి జీవితమైనప్పుడు

ఎన్నాళ్ళు ఈ పరుగులు
ఎన్నాళ్ళు ఈ దాగుడు మూతలు
అంటున్నావు!?


ఆత్మగౌరవం అంటూ
అవివేకంగా నడుచుకుంటున్నానని
అంటున్నావు.

నీకూ తెలుసు

పిల్లా! నీ కోసం
నీ ప్రేమ కోసం, నేను
నీ ముందు మోకరిల్లుతున్నానని  


ప్రాదేయపడుతున్నానని 
దయచేసి నా మది స్థిమితానికి 
కారణానివి కమ్మని

గమనించావో లేదో నన్ను ....
నిన్ను ఆకట్టుకునేందుకు
పడుతున్న ఆరాటం తాపత్రయాల్ని

నీకోసం సంబంధాలు
వెతుకుతున్నారని తెలిసాక మరీ
పిచ్చివాడ్ని లా అయిపోతున్నాను.

నీ ప్రేమలో పడ్డ క్షణం నుంచీ 
నేను నేనులా లేను. నా ప్రపంచాన్ని
తలక్రిందులు చేసుకున్నాను.

చెడు, మంచీ
చీకటి, వెలుగులను విడదీసి చూడు 
మరింత పిచ్చివాడ్ని కాకమునుపే 

దయచేసి చెప్పకు .... మార్గం కనిపించలేదని
వరాన్నీ జీవితాన్నీ ప్రసాదించగల
దేవతామూర్తిని చూస్తున్నాను నీలో

మౌనరాగం


మన ప్రేమకు
ఒక సమున్నత సముచిత
ఉన్నత స్థానం ఇవ్వాలనుంది.
నిశ్శబ్దం లోతుల్లో ....
కొండ చరియల్లో
చెట్ల శాఖలు నిలువుగానూ
వంపులు తిరిగి వ్యాపించి
వాటి నీడలు పైకి
పైపైకి పాకుతున్నంతగా 

మన ఆత్మలు
ఒక్కటిగా కలిసిపోవాలనుంది. 
హృదయమూ, మనసూ 
ఇంద్రియములు
పారవశ్య
నిత్యనూతనత్వ ఏకీభావనల
సమీకరణాలమై 
అస్పష్టసోమరితనం
వ్యసనాలకు దూరంగా

కళ్ళు మూసుకుని
హృదయాన్ని లయబద్దంగా
కొట్టుకోనిస్తూ విశ్రమించాలనుంది. 
నిరర్థక ప్రయత్నాల నుండి
విముక్తులమై
గాడనిద్రలోకి జారి
చేతులు రెండూ
రొమ్ములపై వేసుకుని
ఎప్పటికీ ఫలించని
కోరికల్ని బహిష్కరించుతూ. 


అప్పుడే తెలపాలనుంది. 
సమ్మతి
నీటి వాటంగా కదులుతూ
నీవూ నేనూ
తియ్యదనము, వెచ్చదనము 
ప్రశాంతత .... పిల్ల గాలులై
జోలపాట పాడి
బంగారపు గడ్డి విసెనకర్ర
వింజామరలను పరామర్శిస్తూ   

ఆస్వాదించాలనుంది.
రాత్రి ప్రారంభం కాబోతున్న
సాయంత్రం వేళల్ని
చెట్లు, కొండచరియలు
లోయల అంచులు
నలుపు రంగు పులుముకుని
మన జరిగిపోయిన
పగటి నిరాశ నిస్పృహలను
తన గంభిరమైన గొంతుతో
ఏ రాత్రి కోయిలలానో పాడుతూ

Tuesday, July 14, 2015

వివేకం


నాలుగువైపుల్నుంచీ
కప్పేసి
మూసేసిన
చీకటి ని .... నిన్ను
గమనిస్తూనే
రోషపడి
నీ కళ్ళలోకి
సూటిగా
తీక్షణంగా చూసాను.
నీలానే నేనూనూ
నన్నునూ చూడలేవు
అని నోరు జారి
తెలుసుకున్నాను.
నీవు వివేకివి అని

Saturday, July 11, 2015

పిచ్చి అని తెలిసీ



నా గుండె పిచ్చిదై పోయింది.
ఊపిరాడ్డం లేదు
నీ ద్రోహం సెగ తగిలి
కొట్టుకోవడం మానేసింది

ఐనా,
నా రక్తంతో నీ దాహం తీర్చాలని ఉంది
నీ చెడు కర్మలనుండి
నిన్ను సంరక్షించుకోవాలని ఉంది. 

Thursday, July 9, 2015

నా అమరత్వం నీవే


నా కళ్ళలోకి అలా సూటిగా చూడకు
ఉబికొస్తున్న .... కన్నీళ్ళ ప్రశ్నలను పరచకలా
"నీలో నేను ఏమి చూస్తున్నాను
నాకు ఇంకా ఏమి కావాలి అని అనుమానంగా"
నాకూ నీకూ తెలుసు అప్పుడప్పుడూ
మన ఆలోచనలు ఒక్కటి కావు అని ....
అవి ఒక్కటయ్యేందుకు నీ ప్రయత్నమే ఎక్కువని
అలా నా భారం తగ్గించాలని చూస్తుంటావు.

ఎవరు కన్నారో నన్ను అనాదను ఈ ప్రపంచం
కాదన్నప్పుడు, నాకో సాహచర్యం
అవసరం అయినప్పుడు
నన్ను స్వాగతించి, ఆదరించి ప్రేమించావు.
నేను నా ఆశలన్నీ కోల్పోయినప్పుడు
ఒక్క అడుగూ ముందుకు వెయ్యలేననుకున్నప్పుడు
ముందుకు వచ్చావు నాకు తోడయ్యుండేందుకు
నీ పరిపూర్ణ ప్రేమను పంచేందుకు

ఇన్నాళ్ళూ నీకో నిజం చెప్పలేదు
నా ప్రవర్తన తో నీకు అర్ధమయ్యుంటుందనుకుని
తప్పు చేసాను .... క్షమించు
ఒకవేళ నీకు తెలిసేలా ప్రవర్తించి ఉండకపోతే
నా దృష్టిలో నా జీవితం లో నీ స్థానం ఏమిటో అని
ఓ పిల్లా! ఇప్పుడు చెబుతున్నా విను 
ప్రతి రోజూ ఒక నూతనోదయమే నాకు
నీవున్నావనే ఆలోచన నా పక్కన నా సహచరివై 


"అది చాలదు" అని అనలేవుగా
నేను ముందే విడమర్చుంటే 
నిజం! నీనుంచి నేను అన్నీ పొందాను.
నా హృదయం కోరికలన్నీ పండించుకున్నాను.
సూర్యోదయం, సూర్యాస్తమం నుంచి అర్ధరాత్రి వరకూ
నా జీవితాన్నే కాదు,
నా ఆకలిని, కలలనీ పంచుకున్నావు.
నీవు కలిసాక అన్నీ పొందిన
పరిపూర్ణుడనే భావన నాలో .... ఇప్పుడు

Wednesday, July 8, 2015

అది నువ్వే


బంకజిగురులా పేరుకుపోయిన 
వదలని ఆలోచనలతో
నీ యొక్క సుకుమార
వ్యక్తిత్వ సువాసనలను
వెదజల్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు,
ఒక పునః సంభవ కలలో లా
నీ జ్ఞాపకాల నీడలు వెంటాడుతూ
ఆ నీడలను చూసి ఉలిక్కిపడి
కొట్టుమిట్టాడుతూ
ఏదో స్వరం .... గదిలో
ప్రతిధ్వనై అన్ని వైపుల నుంచి
నీవే లా .... నీ సవ్వడి లా