Tuesday, September 11, 2018

తడబాటు జీవితం




దాదాపుగా దూరంగానే
ఉంటున్నాము అందరమూ
ఏ మనిషికీ మరో మనిషితో
సంబంధం లేదు.

వీడని భ్రమల్లో తేలుతూ
....
అకారణ ఆలోచనలతో
క్షణక్షణమూ
ప్రయోజనాన్నే ఆశిస్తూ 

ఏ ఇరువురమూ సమానం
కామని తెలిసినా
అసంతులన అస్థిరత్వం ....
చేరువయ్యేందుకు
సర్దుబాటుకు ఇష్టపడము.   

ఆలోచించాల్సిన అవసరం
లేని చోటే
అతిగా ఆలోచిస్తాము.
ఎన్నో విషయాలు
చివరివరకూ

చివరికి

రక్త వాహికలు
తట్టుకోలేని ప్రవాహం
ఒత్తిడి
గుండెపోటు అధికమై
పగిలే రక్తనాళాలు

మాట్లాడే పలుకులోనూ
అభద్రతా భావన ....
మన ప్రతి మాట, కూలబోయే
పునాదుల్లేని కట్టడపు
తప్పుల గాలి ఇటుకే

ప్రతి రోజూ ప్రతి క్షణమూ
చూస్తూనే ఉన్నాము ....
ఎన్నో తడబాటు చర్యల్ని
ఇంకో కొత్త బాధకు
ఇంకొన్ని కొత్త కారణాల్ని 

కొత్త ఊహాతీత లోకం




ఇదే సరైన సమయం ....
సరంజామా అంతా సర్దుకుని బయల్దేరేందుకు కొత్త లోకానికి  
ఈ వీధిలోనే .... ప్రయాణం
దూరంగా కొండైమీదనుంచి
ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు సూర్యుడు

మనిషి మనిషిలా సూర్యుడై
స్వయంప్రకాశం తో బ్రతికితే ఎంత బాగుంటుందో 

నేను వెళ్ళాలి అనుకునే .... ఊహాతీత ప్రపంచం అది
అక్కడ మనిషి శూన్యుడు సర్వమూ .... 
ఎక్కడో లేని ఇక్కడా కాని ప్రపంచం    
ప్రతి క్రియకూ ప్రతిక్రియే పర్యవసానం కాని
కాలానికి మాత్రమే తెలిసిన బంగారులోకం .... అది  




ఆకాశం మాత్రమే అనుభూతి చెందగలిగిన
అందమైన బంగారు లోకం 
మనిషి విపరీత ఆలోచనల విశిష్ట నిర్మాణం .... 
అందం వనమై ఆనందం తాండవం చేసే
ఒక నూతన అనుభూతుల ధామం .... అది

ప్రతిదీ ప్రతి ఒక్కరూ పట్టించుకోని
ఎవరు ఎవరినైనా
వారి జీవితం కంటే ఎక్కువగా ప్రేమించగలిగే 
ఏ సామాజిక కట్టుబాట్ల గోడలూ
ఎవరినీ ఇష్టానికి భిన్నంగా బంధించలేని ....

స్వేచ్చగా ఆలోచించగలిగే ....
ఎవరి కాళ్ళ మీద వారు నిలబడి నిండుగా శ్వాసించగలిగే
అస్పష్ట, నిరాకార, సూక్ష్మరూపులయ్యేలా  
కష్టాలు బాధలు అందువల్ల కలిగే నొప్పులు ను
శాశ్వతంగా వొదిలెయ్యగలిగేలా

ఆ ప్రపంచంలో మనిషి సమాధి స్థితి లో
తన్మయత్వం లో వ్రేలాడొచ్చు

బూత వర్తమానాల్లో మనిషి
మునిగి తెలుతూ ఊగిసలాడుతుండొచ్చు
చీకటి కాంతి తెరల మధ్య ....
అక్కడ తప్పులు దిద్దుకునేందుకు భూతం లోకి
వర్తమానం లోంచి .... ప్రయాణం సాధ్యమే 

Monday, September 10, 2018

నిరామయ(ప్రేమ)భావన




పోగొట్టుకోలేని
కావాలనుకుని పొందలేని
నిర్మలత్వం,
నిరాకారం నీవు     
ఎక్కడికి వెళ్ళినా
సర్వం నీవేలా ఉండి
ఆరంభమూ
అంతమూ కాని 
హృదయం
నిండిపోయిన
సమర్పణా భావన
అనుభూతివై  
ప్రతిచోటా ఉండి
కళ్ళతో చూడలేని
దైవత్వానివి, నీవు
గాలిలోనూ
నేలమీదా
అంతటా వ్యాపించిన 
బ్రహ్మాండం బ్రద్దలైన
నిశ్శబ్దం శబ్దానివి 

Monday, July 30, 2018

ప్రతిద్వనులు



ఉక్కిరిబిక్కిరిని చేస్తూ ఉన్నాయి
నీ ఆలోచనలు
కత్తుల్లా నా చర్మాన్ని కత్తిరించేస్తూ

గుసగుసల్లా వినిపించీ పించని
ఏవో పదాలు
నీ మాటలు
ఎర్రని ద్రవం లా ప్రవహిస్తూ
కొట్టుకుపోతూ ఉన్నా .... ఆ ప్రవాహం ఒరవడి లో   

ఎరుపెక్కిన కళ్ళలోంచి రక్తం
బొట్లు బొట్లై 
కరకు రాతి నేలమీద
రాలి గడ్డకట్టుకుపోతుంది. 



వేటకుక్కల్లా నీ జ్ఞాపకాలు కొన్ని
వెంటాడుతూ ఉన్నాయి నన్ను ....
ప్రతి క్షణమూ అప్రమత్తమై 
ముని వేళ్ళమీద ఉండక తప్పడం లేదు.

అర్ధరాత్రి వేళ కూడా మంచమీద
మేల్కొని ఉండక తప్పడం లేదు. 

నీ ప్రేమ
ఒక గొప్ప ఔషధం అనుకునేవాడిని

ఎప్పుడు నీవు నా పక్కన లేకపోయినా
ఒక అనర్ధ ప్రయాస అనిపిస్తూ ఈ జీవితం
అది నా సిరలు దమనుల్లో
మాదకద్రవం ప్రవాహం అవుతుందనుకోలేదు.

Sunday, July 22, 2018

దురలవాట్ల శయ్య



రాక్షస పక్షి బొడ్డు కింద
వ్యసనాల ప్రాణినై 
వ్రేలాడుతున్నాను.
నేలను తాకలేక

అశక్తత
వింత అనాసక్తత
ప్రాణాలు పోతున్నట్లున్నా 

కాలం కాలి గోళ్ళ మధ్య
నలిగిపోతూ
ఊపిరి అందడం
దిక్కు తోచడం లేదు.

పైకి, ఇంకా పైకి ఆకాశం లోకి
మబ్బుల మధ్యకు
లాక్కుని వెళ్ళబడుతున్నా
శరీరం తేలికైపోతూ 


గాలి ఒరిపిడికి
మండుతున్నాయి కళ్ళు ....
కన్నీళ్లు కారుతూ
అయాచితంగానే

ప్రార్ధిస్తున్నాను.
పశ్చాత్తపరహితం గా
స్వేచ్చ కోసమో
సామాన్యత కోసమో మరి 

కానీ,  పోగొట్టుకున్న జీవితం
బలహీనతలు లక్ష్యంగా
కాలం
అగ్నిని ఉశ్వాసిస్తుంది.

నిర్దాక్షిణ్యంగా
నా వైపు
ఆబగా చూస్తూ

ఇప్పుడు
దాని దంతాల లాకెట్టు
నాకు
స్పష్టంగా కనిపిస్తుంది.

ఎవరు నిన్ను
నా నుండి రక్షిస్తారు
ఈరాత్రి ....
నేను విందు చేస్తుంటే అన్నట్లు

Friday, June 22, 2018

నిరీక్షణ



నీ కోసమే మౌనం గా
వేచి చూస్తూ ఉన్నా 
సహనం సన్నగిల్లిపోతూన్నా
గుండె చుట్టూ నీవు
నిర్మించుకున్న గోడల ద్వారాలు
తెరుస్తావేమో అని .....
ఆశతో నిశ్శబ్దంగా





ఈ భావోద్విగ్న మౌనవాసం లో
ఈ ఎదురుచూపుల ఏకాంతం లో
ఎంత కాలమో ....
ఇలా ఎన్ని ఆశ నిరాశల
సూర్యోదయ-అస్తమయాలో
ఎన్ని పరీక్షలో ....
కాలానికి మాత్రమే తెలిసిన
ఎన్ని నిర్లిప్తనిరీక్షణలో

Saturday, December 23, 2017

కుశలమా నీవు .....?




నా హృదయం
ఎలాంటి వెచ్చదనమూ దొరకక
అతిశీతలత్వంతో
గడ్డకట్టుకుని పోయింది.
భావోద్వేగ రహితమై
బాధ ఆనందాల
భేదం తెలియక
మన్నన ప్రేమలకు దూరమై 


సూదులతో పొడిచినా దిగని
తెగని కఠిన చర్మం ....
ఈ శరీరం శిలలా మారి
అనుభూతుల్లేవు .... నాలో
ఏ హాని భావనా కలగడం లేదు.
ఎంతటి బలమైన పదాలతో గుచ్చినా
భావోద్వేగాలు లేకే
శరీరానికి నొప్పి తెలియడం లేదు. 


ఔనూ! నిజంగా అక్కడ్నుండి
అంత దూరం నుండి
ఆకాశాన్ని కప్పేసిన
ఆ మబ్బు పొగల్లోంచి ....
నీవు నన్ను చూస్తున్నావా?
నేను అనుకోవడం లేదు.
భావోద్వేగ రహితుడ్నైన నాకు,
నా ప్రేమకు అంత శక్తుందని

Wednesday, December 13, 2017

అది భయమే కదూ



నిరాశ, వ్యాకులత మబ్బులు
అన్నివైపులా అలుముకున్న
భయానక ఉదాసీనత .... అది
కాలంతో పొరాడుతున్నట్లు
ముక్కలు ముక్కలై
రంద్రాల మయమైన శరీరంలొంచి 
వేలకొద్దీ ఆలోచనల శతృవులు
వెలికొచ్చి .... వెంటాడి 
బలవంతపు హత్యకు .... గురి
కాబోతున్నప్పుడు 



అది మరణమే, ఆ మరణం
అలసత్వానికి నిజాయితీకి ఉరి
స్వర్గ శిఖరం చేరినా తప్పని 
పరిక్ష, ఉరిశిక్షే
బూడిద అంటిన శరీరంతో పాటు
కళ్ళకు  బూడిద రంగు పులిమి
నిలువుగా శరీరాన్ని చీల్చినట్లు ....
నమ్మకం కోల్పోయిన ఆత్మ
విలవిలా రోధిస్తూ కేకలు వేస్తూ
అనాశక్తత తలదించేలా చేస్తే

Sunday, December 3, 2017

ఆమెకు తెలియాలి అని




ఆమెను నేను
అమితంగా
ఆరాధిస్తున్నానని 

ఒక నమ్మకాన్నై
ఒక బాసటనై 
ఒక తోడునై .....

ఆమెనే విశ్వసిస్తూ
చూసి గర్వపడుతున్నానని
సంభ్రమాశ్చర్య చకితుడనై 

ఒక సౌందర్యారాధ్యదేవత
ఇంతటి అద్భుత అస్తిత్వమా 
ఆమె అని ....

మనఃపూర్వక కృతజ్ఞత
అభివందనాలు చెబుతున్నా 
ఆ సృష్టికర్తకు .....

ఆమె స్థిరనివాసం .... ఇప్పుడు
నా గుండె అను ఆనందం
అనుభూతి పొందుతున్నానని