Monday, March 6, 2017

ఇంతేనేమో ఏ జీవితమైనా


మీ అందరికీ ఆనందమే కదూ నన్ను చూసి 
మీలా నేనూ నల్లబడి మసకేసిపోయానని .... కానీ
నేను మీలా పెళుసు పూరేకులా విరిగి రాలిపోను  
నాకు కొన్ని ఆశలు ఆశయాలు అస్తిత్వం ఉంది 
ఒక గమ్యము ఒక ఆలోచన .... తోడుగా

నేను ఒక సగటు సామాన్య అమాయక
పాపిష్టి పరమాణువునే కావచ్చు 
సూర్యకాంతి వేడికి కమిలి వంగి పడిపోవచ్చు కానీ
పరిసరాలు సుగంధిలం చెయ్యాలనే ఆకాంక్ష నాది  
నా చెమట తడి ఆవిరులను గాలిలోకి వీస్తూ 


కమిలి నల్లబడి రాలిపోవాల్సిన గులాబి పూరేకును
అయినా అనిపిస్తుంది నా అవసరం మీకెక్కువెందుకు అని 
దయాశీలత ఏమాత్రమూ లేని మీ పిడికిళ్ళలో నలిగి
మొయ్యలేని బ్రతుకు భారంతో నీరసపడిన క్షణాల్లో 
పెంకు కట్టి నలిగి విస్మరింపబడినప్పుడు 

నా ఈ మసక మధ్యతరగతి బ్రతుకుకు
ఏ నిరాశ నిస్పృహ నిస్తేజ క్షణాలతో పనిలేదు ....
ఈ ప్రాణం ఈ ఊపిరి ప్రపంచం మరిచిన ఒక జ్ఞాపకం
సమాజం బృందావనంలో పట్టించుకోని, రంగు విరిగి
వడలి రాలు పూ రేకు సౌందర్యం నేనై 

Sunday, March 5, 2017

నీవే .... అన్నీ




ఎటు చూసినా ....
గలగలమని 
పరవళ్ళుతొక్కుతూ 
పారే సెలయేరు 
నువ్వూ, నీ నవ్వూ
నీ కొంటె కవ్వింతల 
నయగార నర్తనల 
సుతిమెత్తని సవ్వడులలా 
గాలి పల్లకీలో 
ఊరేగింపులా విన వస్తుంటే 

నా ఈ మనోభీష్టాలన్నీ
ఏ దృశ్య కావ్యం లానో 
సంఘర్షణాత్మక కథలానో 
వర్ణించి 
రాస్తే ఎలాగైనా ....
ఎంత అందం ఆహ్లాదమో
ఆ కథలు, 
ఆ కావ్యాలు 
అత్యద్భుతం కదా ఈ ప్రపంచం 
నీతో ఆరంభం అయితే ....

నా భావనల్లో నిండి .... నీవు



ఇన్నాళ్ళుగా
నేను
నమ్మి రాస్తూన్న ....


నిజాక్షర పద
వచన కవితల్లోంచి ....

తొంగిచూస్తున్న
నా మనోభావనల
పరిమళాల మల్లీ .... ఓ మానసీ

నా ప్రతి
బాధ, ఆశల లోతుల్లోని 
ఆశయ ఆరాట ఆవేశాలు నీవు



కేవలం
నిన్ను గురించిన ఆలోచనల
ఆరంభ ముగింపులే .... అన్నీ

నీ నా
ప్రేమాత్మల రసాయనిక బంధ
విలక్షణ ప్రతీకృతులే .... అన్నీ 

Tuesday, February 21, 2017

అవ్యవస్థీకృత అందం



కాలుతున్న కోరికల
విరజిమ్మిన పొగల ఆవిరులు
కామమోహపుటాలోచనలు
మంటలు రాజుకుని కాల్చేయబడిన
ప్రియ అవశేషాల
బూడిద రాసులు అవి

ఏ పగిలిన గుండెల విరిగిన ఎముకల
కలిసిన అనుబంధాల
చిరిగిన అనురాగాల
సామాజిక వ్యక్తావ్యక్త అగ్రాహ్య,
అబోధ్య ప్రేమ పరిమళాలో అవి


సూర్య కిరణ ప్రచండ వేడిమి కి
మాడిన దూళి సెగలు
ఫెళఫెళమను ఉఱుముల
విలయ ఘర్జనల విన్యాసాలు అవి
దూరంగా ఎక్కడినుంచో
వినీవినబడకుండా వినిపిస్తున్న
పల్లె జానపదాలను స్తబ్దం చేస్తూ

ఆ ఘటన సంఘటనల
అవగాహనారాహిత్య పరిస్థితుల
సుడిలో కొట్టుకుంటున్న సగటు మానవుడి
ప్రతిబింబాన్ని చూస్తున్నా
నేను చూస్తుంది నన్నే అయినా
నన్ను కాదేమో అనిపిస్తుంది ఎందుకో

నేను, నా అస్తిత్వం మారినట్లే
ప్రపంచమూ మారి
అసంపూర్ణత్వం అవ్యవస్థీకృతమైన ....
పరిణామక్రమం లా
ఆ క్రమంలోనూ ఏదో అందం ....
ఆకర్షణ మిళితమై ఉన్నట్లు ఆకర్షిస్తూ

Wednesday, February 15, 2017

శేషం



మునిగి
దూరంగా
కొట్టుకుని పోతున్నాను.
ఆరాటపడుతున్నాను. 
శ్వాస అందని
ఎదురుచూపులు చూస్తూ
తల్లడిల్లుతూ
నువ్వొస్తావని, రక్షిస్తావని
తెలిసినా తెలియకపోయినా 
మరో మార్గం లేదు.
కళ్ళు తెరవాలనుంటుంది.
కానీ, 


కాలమే బలవంతంగా 
నా కనురెప్పల్ని
ఏ గ్లూతోనో మూసేసినట్లు
తెరవలేని స్థితి ....
చివరికి 
నేను చెయ్యగలిగింది,
చేస్తుంది మాత్రం
మిగిలి ఉన్న
పెనుగులాడుతున్న
ఆ క్షణాలు ఆ ఘడియలే
నా భాగ్యం అనుకుని
ఆనందించడమే
ఎంతవరకూ

Saturday, February 11, 2017

మనోవైకల్యం



నిన్నే మనోహరీ, 
కాస్తంత సమయం నా కోసం వెచ్చించవా
చూస్తూ చూస్తుండగానే 
మతిస్థిమితం కోల్పోయాననిపిస్తుంది. 
అందరిలా నడుచుకోలేను. 
ఒక వ్యక్తిలా కాక అసామిజికంగా జీవిస్తూ 
అస్పష్టంగా విడ్డూరంగా ఉంది అంతా 
నిజంగా నాది స్థిరబుద్ధి కాదా అని ....

నీవే ఏదో ఒకటి చెయ్యాలి. 
ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళైనా సరే 

నీవూ చూస్తున్నావుగా .... ఎందుకో మరి 
 ఎవ్వరినీ కలవను .... కలవాలని ఉండదు. 
ఒంటరితనం తో తప్ప స్థిమితపడలేను.
బహుశ ఈ లక్షణమే వేరు చేస్తుందేమో 
అందరినుంచి నన్ను ....

నీకోసమైనా నీవు జీవించేందుకు 
 సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకినైనప్పుడు 
 కట్టెయ్యొచ్చుగా నన్ను, కనీసం .... 
నేనొక మానసిక హృద్రోగిననుకునైనా

ఉరుముతున్న ఆ ఉరుముల పిడుగు శబ్దాలతో 
 నా అంతరంగం అల్లకల్లోలమై 
అలజడికి గురై 
 సమశ్యలన్నీ బూతద్దంలో కనిపిస్తూ 
పిచ్చివాడ్ని చేసేస్తున్నాయి. 
పవిత్రత జీవితం పొలిమేరల్లో కూర్చుని 
వెక్కిరిస్తున్నట్లు వింత బోధనలు చేస్తుంది.

వైకల్యం అంతా మదిలోనే .... నాలో కాదనుకుని, నీవు 
 నీకు దూరంగా నెట్టెయ్యకపోతే చాలనిపిస్తుంది

Monday, February 6, 2017

సమ్మతించకనే




కాలిపోతున్నావు అలా
నిలువెల్లా నిర్వేదినివై!?
వేదన కానరానీయకుండా
నెమ్మది నెమ్మదిగా
నీలో లోలోపల

ఇవతలికి రావొచ్చు ....
మరి, 
యౌవ్వనవతివి

కానీ ఎందుకో
మళ్ళీ .... అలా నీవు
ఆ అవిభక్త చేతులతో  
భ్రమరం పోటులు
ఎండవేడిమికి లొంగిపోతూ  



సవికల్పజ్ఞానము లోంచి
పుట్టిన యౌవ్వనవతివైనా
గుచ్చుకుంటున్న
ఆ కళ్ళ పరిధిలోంచి
బయటికి వచ్చి
సూటిగా చూడొచ్చని తెలిసినా 

అలా చూసేప్పుడు 
అలసట అశక్తత పెరిగి
అగమ్యురాలివై
వాస్తవాన్ని సూటిగా
చూడలేను అనేనేమో
 
చూడటం లేదు నీవు
విస్మరించి, నీ స్వీయాతిశయం
భావనలను
అంతా అంధకారమే అని
అభద్రతాభావనను పెంచుకుని

Tuesday, January 17, 2017

అస్పష్టానుభూతి



వెళ్ళిపోయాక నేను
ఎలాగూ గుర్తుండను.
ఉన్నప్పుడైనా
మసకేసిన అస్పష్టతను
కాకూడదనే ....
ఈ మనో తపన
నా ప్రాముఖ్యత మాత్రం
అమూల్యమై అపహరించబడాల్సిన
క్షణాల చుట్టే .... 


నా అర చేతులు సున్నితంగా
నీ ముఖాన్ని నిమిరి
నేను నీ కళ్ళలోకి
లోతుగా చూసిన క్షణాల
జ్ఞాపకాల చుట్టే
కొన్ని క్షణాలే అయినా
నీవు నన్నెరిగి
నేను నిన్నెరిగే క్షణాలు అవి.  
నీ శరీరం మృదుత్వం
సున్నిత స్పర్శానుభూతి
ఒక మసకేసిన అస్పష్టత అయినా
నీకూ నాకు మధ్య

Tuesday, January 10, 2017

నాకు నీవు కావాలి



శరీరం పై దుస్తువులా కాని
ఆచ్చాదనం ఆత్మీయతవై 
చేతికి చిక్కని సౌకర్యం 
వెన్ను వెచ్చదనానివై
అప్పుడప్పుడూ బుగ్గపై
పారే వేడి కన్నీటి ధార
కానరానీయని పొడి గీతవై
గోడ అంచున
వెలుగు నవ్వుల
తెల్లని దీప కాంతివై 



మూసిన పెదవుల
విరిసిన మందహాసం మాటవై
తెరిచిన కన్నుల
కనురెప్పల
కనుపాపల లోతుల్లో
నేను ఆక్షేపించలేని కళ వై
నా హృదయ పరిమళానివై
నిజం మానసీ
ఎక్కడుంటే
నిన్ను కోల్పోయే అవకాశం ఉండదొ
నేను నాశనం చెయ్యలేనో
అక్కడే ఉండి ఉంటూ
నీవు నాకు కావాలి