ఇది నా సామ్రాజ్యం .... ఇక్కడ అంతా నేనే
నాదే అంతా ఇక్కడ
నేను మాత్రమే నివశిస్తుంటాను.
నా అంగీకారంతోనే ఎవరైనా ఇక్కడ ఉండేది.
నేను ఉండమన్నప్పుడు ఉండి
వద్దంటే వెళ్ళిపోవాలి ఎవ్వరైనా
ఎవరైనా
నాతో మాట్లాడగలిగేది
నా సమ్మతం తోనే
నేను ఎక్కడ అంటే అక్కడే
నేను కోరుకున్న వాహనంలో
నేను నిర్ణయించిన స్థలం లో
నా ఇష్ట ప్రకారమే
ఇంతవరకూ జీవితం లో
నేను కావాలనుకున్న ప్రతిదీ పొందాను.
ఎలాంటి అసౌకర్యమూ కలగ లేదు.
సమశ్యల కొండలు ఎన్నైనా
ఒక్కటొక్కటిగా ద్వంసమై దూళిగా
గాలిలో కలిసిపోయేవి.
నాకు ఊపిరి పీల్చుకునే స్వేచ్చ దొరికేందుకు
ఉదయం నేను లేచినప్పుడే
ప్రకృతికీ స్వాంతనం
నేను కోరుకున్నప్పుడు,
నేనెరుగని కాలంలోకి
స్వాగతించబడుతూ ....
భవిష్యత్తు సుపరిచితం లా
నా పలుకరింపుకోసం అలమటిస్తూ ఉంటుంది.
రేపు ఎప్పుడూ అందంగా ఉంటుంది .... ఊహల్లో.
ఆ ఊహలు నా మనోగతం మేరకే ....
నేను కోరుకున్న భవితవ్యమే నాది
నాకు ఈ సమీకరణాలంటే ఇష్టం.
నేను కాలాన్ని ప్రేమిస్తున్నాను.
వర్తమానం లో జీవిస్తున్నాను
అది నాతోనే నేనే లానే అందంగనే ఉంటుందని.
దృష్టిని కోల్పోయి ....
చూడలేక
వర్తమానాన్ని,
అంధ మానసం లో
ఆవగింజ పరిమాణపు
అపనమ్మకం ....
భూతం లా
ఆమె చెప్పుకుంటుంది. సాగదీస్తూ,
నిన్నటి గురించి,
ఒకప్పటి నన్ను,
వసపోసిన నా వాగుడు లక్షణాన్ని
గంటల కొద్దీ తనతో గడిపి,
నవ్వించి ఆనందించిన .... నన్ను గురించి.
ఆమె ప్రేమ కోసం తపించి,
భక్తుడినై ....
పరికిణీల జూలియట్ కోసం
బస్టాండుల వెంట రోమియోలా తిరిగిన
ఒకప్పటి నన్ను గురించి,
మురిపెంగా పదే పదే తనలో తను.
వయసు మీదపడి ఇప్పుడు,
అప్పటి నేనులా ఉండలేకపోతున్నా!
అయినా ఒప్పుకోను. వాదిస్తాను.
కాలంతో పాటు మార్పులు సహజం అని,
మనం మనుషులం అని,
అందుకు మనం మినహాయింపు కాదూ అని,
.
రేడియో లా ఇరవైనాలుగు గంటలూ
తను మాట్లాడుతుంటే, వింటూ ....
ఆ ముఖభావనల్ని గమనిస్తూ,
మధ్య మధ్య కురిసే ఆ నవ్వుల్లో తడుస్తూ,
బ్రతికెయ్యొచ్చు అని ఎందుకనిపించేదో ఆనాడు,
ఇప్పుడదే పిచ్చేమో అనిపిస్తుంది.
అప్పటిలా యిప్పుడెందుకో ఆమెలో
ప్రియురాలిని, చూడలేకపోతున్నాను.
సహధర్మచారిణినే తప్ప,
వెన్నెల్లో తడుస్తూ నర్తించాలని అనిపించడం లేదు..
ఆమె గొంతు అరిగిపోయిన
గ్రామఫోన్ రికార్డ్ లా చీకాకనిపిస్తూ,
తల నెరిసి, ముఖాన ముడతలొచ్చి
గొణుగుతూ తను.
ఎప్పుడూ సాదిస్తూ ఉన్నట్లే ఉంటుంది.
ఒకప్పటి నువ్వు కాదు అంటూ,
నేను ఆమె, జ్ఞాపకాన్ని మాత్రమే
ఆ జ్ఞాపకానికి అస్తిత్వం లేదు .... ఆమె తలలో తప్ప.
నాకు ఎంతో ఇష్టం
ఆ నవ్వు.
ప్రేమిస్తున్నాను.
ఏ భావనలూ లేని,
ఏ భ్రమరమూ తాకని,
ఆ తెల్లని పూల
సువాసనల చిరు జల్లును.
అంతరాల్లోంచి
రా, రమ్మనే
ఆ స్వచ్చ ....
స్వాగత ఆహ్వాన సంజ్ఞలను.
ఇష్టపడుతున్నాను.
ప్రాణాధికంగా ప్రేమిస్తూ ఉన్నాను.
అతడు
ఒక శాస్త్రవేత్త.
పదార్ధాన్ని, వాస్తవికతను మాత్రమే నమ్ముతాడు.
హెచ్చవేతలు, కూడికల సమీకరణాలు చేసి,
సమశ్యల గోడల చుట్టూ సమాధానాలు వెదుకుతూ ఉంటాడు.
అతడు,
ఒక మతవాది.
అతని నమ్మకం, అతను చూడని దేనిలోనో ....
అన్నీ చూసేందుకు ప్రయత్నిస్తూ,
ఆ ఊహల రూపాన్ని ప్రతిష్టించి పరమార్ధాన్ని వెదుకుతూ ఉంటాడు.
అతడు
ఒక వేదాంతి.
కళ్ళముందు ఉన్నదంతా భ్రమే అని,
జగము, జీవము, పదార్దమూ అన్నీ మాయే అంటూనే,
ఏది కాదంటున్నాడో దాని మీదే కూర్చుని ఘాటుగా వాదిస్తుంటాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే,
అతడు
మూడు తలల మనిషి
తాను పెట్టుకున్న .... రంగు అద్దాలతో ప్రపంచాన్ని చూసి,
ఆ రంగు, ఆ లక్షణమే మూలం అనే భావనను ప్రపంచానికి పులిమేస్తూ ఉంటాడు.
ఎలా దాయను .... ఎలా?
ఈ అనురాగాన్ని
నాలోని ఈ పామరత్వాన్నీ
నా ముఖం పై
కనపడనీయకుండా .... ఎలా దాయను?
గుట్టుగా ఇన్నాళ్ళూ దాచుకునున్న
ప్రియ భావనల్ని .... ఎలా దాయను?
ఆమె వచ్చి
ఎదురుగా నిలబడి,
"ఎందుకలా!
ఇబ్బందిగా కదులుతున్నావు!
చెప్పు! నేనేమైనా చెయ్యగలనా!?"
అని అన్నప్పుడు
మాటలు రాని మౌనంలో,
బిడియం లో
నిండా మునిగి ఉన్న నేను,
తెరవెనక్కు జారిపోతూ .... ఎలా?
ఎలా దాయను ఆమెను? .... నా ప్రేమను??
చెప్పలేకపోతున్నాను.
ఎందుకని అని,
నా హృదయం
గాయపడింది.
అంతగా అని,
ఒక
తేనె మనసును మెచ్చి
బహూకరించిన
పిదపే ....
ఎందుకో మరి.
నీ చిరునవ్వు
గాలి చొరడానికైనా వీలివ్వని,
పలుకరింపు.
ఆ పలుకరింపు, పరామర్శపై
సమానీ కరించుతూ నా మనోభావనలు.
భద్రతారాహిత్యంగా,
నీ చూపుల వలలోచిక్కుకొని.

నిజంగా, అది ప్రేమ అని అనుకోలేను.
కళ్ళను కమ్మిన
ఆ కన్నీటి మేఘాలు
ఆ మసక పొగమంచు
పొరలను చూసి,
పగిలిన హృదయాన్నీ,
కోల్పోయిన
స్పర్శేంద్రియ గ్రాహక శక్తిని,
అయోమయానికి లోనై,
చెదిరిన ఆత్మను .... ఆమెను చూసాక.
ఆమె కదలికల్లో ....
యాంత్రికత
స్వస్థచిత్తత ను కోల్పోయి.
నిజం చెబుతున్నా!
ముమ్మాటికీ
అది ప్రేమ అని అనుకోలేను.
అనునయం, బుజ్జగింపు పొందాల్సుండి,
నిరాశ అంచులపై తిరగాల్సిరావడం,
అశిక్షితుఁరాలిలా,
అనాగరిక, అసంసారిక రేఖల సరిహద్దుల్లో ....
ఒంటరిగా తిరగాల్సిరావడం.
ఓదార్పు, స్వాంతనము
పొందిక లేని నరక జీవనం సాగిస్తూ
చిక్కుముడులు,
గందరగోళము,
అవహేళనలకు పాలౌతూ .... ఆమె,
నిజమే చెబుతున్నా!
అది ప్రేమ అని అనుకోలేను.
చీకటి కుహరం లో
మిగిలుండేందుకు
సుముఖతను చూపించడం,
ఆశ అనే ఆఖరి దీపం
అలసటతో ఆరిపోయేవరకూ
అస్తిత్వం, రూపం మసకబారేవరకూ
శూన్యంలో, మౌనం లో
కలిసిపోవాలనుకోవడం.
అపనమ్మకం,
అత్మ విశ్వాసం
సడలిన అసహాయత్వం,
అభద్రతాభావం
ఊపిరాడకపోవడం ....
ఉండుండి "అతనిది నిజమైన ప్రేమేనా!" అని
అతను కాదు, "నేనైనా నన్ను ప్రేమిస్తున్నానా!" అని
అంతరంగం లో ప్రశ్నలు
సంఘర్షణలతో సతమతమౌతూ,
నిజం! నిజంగా అది ప్రేమ కాదు.
ఎందుకంటే,
ప్రేమ, శూన్యం కాదు.
ప్రేమ, కలవరం, భ్రమ కాదు.
ప్రేమ, బాధ, పశ్చాత్తాపం కాదు.
ఒంటరితనం, మత్తులో మునగడం కాదు .... ప్రేమ.
తెలియని అనిశ్చితి,
కదలలేని సంశయము .... ఊబి,
అబద్దపు సాక్షం, మోసపూరిత ముసుగు కాని ....
ప్రకాశించే వెలుగు కిరణం .... ప్రేమ,
నిజం! ఆమె ఉన్న స్థితికి భిన్నత్వం వికృతే .... ప్రేమ