Friday, December 20, 2013

ఎవరికి తెలుసని?




 




 





చెప్పలేరు ఎవరూ. ఎంతప్రయత్నించినా
ఏ ప్రేమ మొలక .... ఎప్పుడు చిగురులేస్తుందో 
అంకురం దశలోనే .... మురిగిపోతుందో అని,
మది భావనలు, ఎద స్పందనలు రెట్టింపై
ఏది వాస్తవమో, ఏది కృత్రిమమో తెలియని క్షణాల్లో.
.............
ఎప్పుడైతే, తనలో .... లోలో సర్వం చిద్రమై
అస్తిత్వం ముక్కలై, చెల్లాచెదురైన క్షణాల్లో ....
ఏమని చెప్పగలరు? ఎవరైనా ....
ఉప్పొంగే హృదయస్పందనల్ని దాచుకోవాల్సి వస్తే
దాచుకునేందుకు మదుగే లేకపోతే
.......................
ఒకవైపున జీవితం సాఫల్యం చెందిందని
మరోవైపున హృదయం కన్నీరు వర్షిస్తూ
అంతా సవ్యం, ఎక్కడా పొరబడటం లేదు అని
తప్పేందుకు అవకాశమేలేదు అని అనుకుంటూ,
హృదయం మాత్రం దైన్యంగా, సుడిగుండం లో
చిక్కుపోయినట్లు ఉక్కిరిబిక్కిరౌతుంటే ....
.........................
తలదాచుకుందుకు .... మనసు పరామర్శ
కనీసం నీడ దొరకని క్షణాల్లో .... కణ విశ్చిన్నం
గమనించక తప్పనిసరైనప్పుడు,
అది ఊపిరి అందీ అందని గుండె పోటే అవుతుంది.
అప్పుడు ఆ ప్రాణం ఉంటుందో, పోతుందో
చెప్పేదెలాగా? ఎవరికి తెలుసని!?


Thursday, December 19, 2013

నేనామెనే ప్రేమిస్తున్నా .... కానీ



 










ఒక పారిజాతం నవ్వింది.
ఆ నవ్వులో పరిమళం, ఉల్లాసం
ఆలోచనల ఉపశాంతి,
ఆమె చూపుల్లో చిలిపితనం ....
చిత్రం!
"ఏదో అనబోతున్నావు, అనొచ్చుగా!?"
అన్నట్లు .... కొంటె పలుకరింపు.
...............
నవ్వాను ప్రతి పలుకరింపుగా,
నాలో కంగారు, అలజడి.
తెలుస్తూ ఉంది.
నా మనోభావనలు
అమూల్యం,
మనోజ్ఞం అయిన పదాలు
పెదాలమీంచి దొర్లి,
"నేను నిన్ను ప్రేమిస్తున్నా!" అన్న క్షణం
ఆ పదాలు,
నేను, ఆమె సొంతం అయిపోతామని.

Wednesday, December 18, 2013

వడలి రాలుతున్న పూరేకును



 


















అలసిన సూర్యాస్తమయ వేళ .... నేను,
ఇంకా పరుగులుతీస్తూ ఉన్నాను.
ఇంటికి, నా ఆలోచనలకు దూరంగా
శిల్పం లా మలిచేందుకు అనువైన
ఒక శిలాహృదయం నా కోసం ప్రతిష్టాపించుకోవాలని
వెదుక్కుంటూ తిరుగుతున్నాను.
తపిస్తున్నాను .... అహరనిశలు.
మనసులో, హృదయం గోడపై పుట్టుమచ్చలా
మిగిలిన నీ ముఖం ....
కనపడకుండా చూసేందుకు
క్రొత్త దృష్టితో .... ప్రపంచాన్ని చూసేందుకు.
.......................
కారణం నీవే అని నీకు తెలుసా?!
.........................
అమాయకత్వం ....
నీ ముఖం చూసిన ప్రతిసారీ,
నిజం!
నన్ను నేను దాచేసుకుందుకు చేసిన ప్రయత్నం
ఎందుకో .... మనం ఎదురైన ప్రతిసారీ
శృంగభంగుండ్నయ్యేవాడ్ని.
నిన్నొదిలెళ్ళలేకపోయేవాడ్ని.
నీవు ఒదిలెళ్ళేప్పుడు మాత్రం
మనసెందుకో వడలిన పువ్వు లా అయి
ఒక్కో కణాన్నై నన్ను నేను కోల్పొతున్నట్లు
నాలోని కణాలన్నీ నన్నిడిచెళుతున్నట్లు అయ్యేది.
నిజం ప్రియా! అప్పుడు,
నాలో నేను గుండెపగిలేలా అరిచేవాడ్ని.
నీవు వచ్చేదానివి కాదు.
బదులిచ్చేదానివి కాదు. నేనున్నానని.
నీకోసం వెతుక్కునేవాడ్ని!
నువ్వక్కడుండేదానివి కాదు!
నా మనోవొకారం మినహా ....
నేను నిదురిస్తున్నప్పుడు .... అక్కడా నీకోసమే చూసేవాడ్ని.
నీవు దూరం గా ఎటో చూస్తూ .... కనిపించేదానివి.
నేను విశ్చిన్నమైపోయేవాడిని. బావురుమని ఏడ్చేవాడిని.
...............
అప్పుడు, ఆ క్షణాల్లో
వడలిపోతున్న పువ్వును లా
రాలిపోతున్న ఆశలు రేకుల్లో రేకును లా .... నేను
తుఫాను ఉప్పెన తాకిడి తగిలినట్లు అల్లల్లాడుతూ
నాతో నే మాట్లాడుకుంటుండేవాడిని.
వరదలో కొట్టుకుపోతున్నట్లు,
సుడిగుండం లో చిక్కుకున్నట్లు,
అర్ధం కాని లోతు తెలియని ప్రవాహం లో
కొట్టుకుపోతున్నట్లు ....
శరీరమంతా చలి, గడ్డకట్టుకుపోతున్నట్లు
ఒడ్డుకు చేర్చే మృదు హృదయం కోసం వెదుకులాడుతున్నట్లు,
నేను .... ఒక వడలి రాలుతున్న పూరేకును లా ఆ క్షణం లో.

నాది నిజమైన ప్రేమే



 

















నిజంగా నాది నిజమైన ప్రేమే
ఓ అమ్మాయీ!
నమ్ము!
ఈ భావనల్లో
ఈ మనసులో ఉన్నది నీవే!
ఆట అనుకుంటున్నావేమో నా మాటల్ని
నీ సాన్నిహిత్యం
చేరువ కావడం కోసమని
....
నిజంగా నేను దిగులుచెందటం లేదు,
నీవు ప్రేమించవేమో అని.
నా మనసుకు తెలుసు
నా ప్రేమ స్వచ్చమైనదే అయితే
నీకూ ప్రేమించకతప్పదని.
నీ వద్ద ఉన్నదంతా
నిన్ను నీవుగా
సమర్పించుకునే రోజు వస్తుందని నమ్ముతున్నా!
....
నేను నేనుగా నిర్మలంగా
నీ పై నా ప్రేమ సడలకుండా ఉంటే,
నీవూ నేనూ వేరు కాదని నువ్వనుకునే రోజొస్తుందని.
....
ఇప్పుడు
నీవు కోరుకునేదీ అదే అయినా ....
కొంత సమయం పడుతుంది నీకు,
నీ ప్రేమను ప్రకటించడానికి.
అప్పటివరకూ పల్లవించి ఉన్న
నా ప్రేమ పరిమళాలు పంచుతూ ఉంటుంది.
....
నిరాశోపహతుడ్నౌతాననుకోకు.
నీకూ వ్యవది అవసరం అనుకుంటా
నీకుగా నీవు నచ్చజెప్పుకోవడానికి.
....
ఒక్కసారి
నచ్చి మనసిచ్చాక
నా మాటే నీ మాట అంటావని తెలుసు.
నాకు నమ్మకం
అప్పుడు
మన మనసులు మమైకం అయి
సాహచర్య మాధుర్యం మనం చవిచూస్తామని.

Tuesday, December 17, 2013

బొమ్మ



 














ఆమె

ఒక ఖాళీ పాత్ర.

ఒక పొడి పుష్పం,
నిట్టనిలువుగా రేకులు రాలుతూ
దాయలేకపోతున్న ఆ చిరుగు వస్త్రం మోస్తూ.

ఆమె

ఒక గాజు బొమ్మ.

శుద్ద మానసం,
ఎవరి ఆడటం సరదా కోసమో.
పెళ్ళున పగిలిన ఒక నమ్మకం ఓడి పడిపోయి,

ఆమె ఒక పగిలిపోతున్న వాస్తవం.

Monday, December 16, 2013

ప్రేమాహ్వానం ....




 










మనసుందా? మరి మార్గమూ ఉంది.
అన్వేషించు! తెరిచేఉంచా ....
నా ఎద తలుపుల్ని,
ఎక్కడ్నించైనా సరే, రా!
గుమ్మం వద్దే నిలుచునున్నా .... నీకోసం
ఇక్కడ, నీ స్థానం పధిలంగా ఉంది.
లోపల ఓ  చిన్న దీపాన్ని
వెలిగించుంచాను.
వీలు కుదుర్చుకుని,
నీవు నీవుగా వచ్చేప్పుడు
దారి నీకు స్పష్టంగా కనిపించాలని.

ఈ ఎదలో విశ్రమించేందుకు
వచ్చే నీ ప్రయత్నం, మార్గం
సులభం కాదని తెలుసు.
ఎక్కడైనా అడుగులు తడబడి,
నువ్వు త్రుళ్ళిపడినా ....
నమ్మకం తగ్గినా, చెప్పలేను.
నీపక్కన నేనే ఉంటానని.
కాలం తో పాటు పరివర్తన చెందే
కొన్ని ప్రశ్నలు, అనుమానాలు
ఉదయించనేరాదు.
ప్రేమ, నమ్మకం లోనే ఉన్నాయి
నీక్కావల్సిన సమాధానాలు ....
వెదుక్కుంటే.

దయచేసి
ఎద లో నివసించేందుకు
ఆత్మతో ముడివేసుకుందుకు
సమాయత్తం అయి కదిలి వస్తావు కదూ!

కాలం కలిసి రావొచ్చు!
రాకనూ పోవచ్చు!
ఎవరు అర్ధం చేసుకోకనూపోవచ్చు!
ఏవేళైనా ....
నన్ను పిలిచి చూడు
నీ పక్కనే ఉంటాను .... తప్పకుండా. .
కొన్ని కట్టుబాట్లు
పెద్దలు కొందరి ఆశలు, పట్టుదలలు
వారెవరికో చేసిన ప్రమాణాలు
తెంపుకుని రాక తప్పదు .... నాకు.
శబ్దం రాకుండా
ఒక్క మాటా మాట్లాడకుండా

జీవితం లో సెటిల్ కాని కారణమే
ఇన్నాళ్ళూ నాకుగా నేను
తలుపులు మూసి ఉంచేలా చేసింది.
ఇన్నాళ్ళూ నా దృష్టి ని, నా ఆలోచనలను
ఆకర్షణలకు దురంగా ఉంచేల చేసింది.
ఇప్పుడు స్థిరపడ్డాను.
స్థిరపడ్డాకే నువ్వు కనిపించావు.
నీ ఆశలు, ఆశయాల అర్ధం తెలుసుకున్నాకే
ఇష్టం అనిపించింది.
నా లక్ష్యమూ కనిపించింది.
అందుకే, ఈ ఎద తలుపులు తెరిచింది.
వెలుగులు పరిచింది.
నీ మార్గం సుగమం చేసి,
నా హృదయంలో రాణివాసానికి
సాదరంగా ప్రేమాహ్వానాన్ని పంపింది.


Sunday, December 15, 2013

మరణావస్థ




మరణించిన కళ్ళ మసకేసిన అద్దాలవి
అక్కడ, అన్నీ
జ్ఞాపకాల ఏడుపులే ....
భయంకరమైన కన్నీటి చారలే.

అది బ్రతకడానికి చేసే
పోరాటం అని అనుకోను.
కళ్ళముందు ఆకశ్మికం గా కనిపించిన 
మృత్యువును చూసిన అచేతనావస్థ అనుకుంటా.

ఎంతో లోతుగా నన్ను ఎవరో
భూస్థాపితము చేయబోతున్నట్లు,
బలంగా శవపేటికపై వొరుసుకుపోయేలా
నన్ను ఎవరో తాళ్ళతో కట్టేస్తున్నట్లు,

కాకుల్నుద్దేశించి, తన అయిష్టాలే ఇష్టాలని జరిగే
పిండం ధానాల బంతుల్లాంటి ముద్దలు ....
చేసిన పాపాల ప్రభావాన్నుంచి స్వర్గానికి
సాగనంపే షార్ట్ కట్ల దారులు అవి అనే నమ్మకాలు.

ఏ శతృవు కూడా ఊహించని,
ఇష్టపడని శిక్షలు, ఆ చీకటి విస్తరణలు
సహచరిణిని సౌందర్యరహితంగా
మార్చే సాంప్రదాయ ప్రక్రియలు అవి.

మరణించిన నా కళ్ళ మసకేసిన అద్దాల్లో
అక్కడ, అన్నీ
అనుబంధాల ఏడుపులే ....
భయంకరమైన కన్నీటి చారికలే.

చివరికి నా అస్తిత్వం యొక్క యెముకలు
రంగును కోల్పోయి మట్టేసిపోతున్నట్లు ....
ఔనూ! బ్రతికున్నప్పుడే చేసిన పాపాల్ని
కొన్నింటినైనా సేవ, ధర్మాల తో కడిగి, తగ్గించుకుంటే,


Saturday, December 14, 2013

శిఖరారోహణ







 



ఒక భూమి ప్రయాణం లాంటిదే ఈ జీవనయానం
బయలుదేరిన చోటుకే తిరిగిరాకతప్పదు.
తనచుట్టూ తాను తిరుగుతూ .... గుండ్రంగా భూమి
కొన్నిచోట్ల సమతలంగా, కొన్ని సమయాల్లో సులభంగా
అప్పుడప్పుడూ, అక్కడక్కడా .....
ఆ మొండి మైదానాలు, ఆ దూరాభారాలు
ప్రేమానురాగభావాలు, కష్టతరమై నిలువెత్తున
మీదమీదకు వచ్చిపడే ఆ సమశ్యలు .... బాధలు,
ఆ నిలువెత్తు సమశ్యల శిఖరాలు
అదిరోహించగలిగిన క్షణాల్లో మాత్రం .... ఒక్కోసారి,
అది ఒక అద్భుత పక్షి వీక్షణ.
అది ఒక అత్యున్నత జీవనావిష్కరణ,
ఆ క్షణాల్లో కళ్ళు సంతోషంతో నిండిపోవడం,
గాలిలో ఎగిరిపోతున్నట్లు అనిపించడం,
ఆ విజయోత్సాహాన్ని గళమెత్తి పాడాలనిపించడం,
ఆ ఆనందం అందరికీ పంచుకోవాలనిపించడం ....
ఒక పల్లవించిన చైతన్య సుమం .... ఆ భావన.
అది అంతటితో ఆగని ప్రయాణం ..... అది ఒక పురోగమనం.
ఉన్నత శిఖరాల మీంచి, మరోవైపు నుంచి క్రిందికి దిగివస్తూ,
దారి వెంబటి ఆదర్శ కేతనాలెగురవేస్తూ, కదులుతూ ....
ఆ పాదాలు తాకి శిల అహల్య అవుతూ, అది ఒక
అవిశ్రామ గమనం .... అనుభవపాటాలకు అక్షరరూపాన్నిస్తూ పోతే,

నీవెవరివి?



 



నా
మనోవినీలాకాశం లో
ఎన్నినాళ్ళుగానో
నేనెదురుచూస్తున్న
నా ఊహల గమ్యం
స్వర్గం లో
ఆ మధుర భావహాసం
తారవు .... నీవా!
నా రాత్రుల్ని
ప్రకాశవంతం చేసే
ఆ వెన్నెల నవ్వు
మార్గదర్శక కాంతి వా?
నా కలల గమ్యం,
హృదయావేశానివా?
నా ఆశల, ఎదురుచూపుల
ప్రియ రూపానివా .... ?
ఎవరివి? ఇంతకీ నీవెవరివి??