Thursday, February 14, 2013

నా కోసం వేచిచూస్తున్న నెచ్చెలి


పగటి ప్రతికూలతలకు విరామన్నిస్తూ ....
అప్పుడే
నడుం వాల్చి .... వెల్లికిలా
ముంచుకొస్తున్న నిద్ర ....
కళ్ళు మూతలు పడుతూ
ఎలాంటి హెచ్చరికలు లేకుండా కమ్ముకుపోతూ

నిద్దుర పిదప .... లోపల
నా కలల జీవితం .... అక్కడ,
స్వాగతం అంటూ ఎదురుచూస్తూ .... నీవు
అక్కడే పరిచయం .... తొలిచూపు అయస్కాతం
నా ప్రేమ .... నా ఆత్మ సహచరి .... మన కలయిక

చేతులు కట్టుకుని
రెక్కలు విప్పుకుని నీతో కలిసి గడిపిన
ముచ్చట్ల మురిపాల మధుర క్షణాలు
నా హృదయం తెరపై కదులుతూ
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మధుర దృశ్యాలు

దివ్య మధురానుభవాల్ని .... సొంతం చేసి
నీ కళ్ళ మెరుపు చూడాలని
నీతో సహచరించాలని .... కలల్లో మాత్రమే కాదు
వాస్తవంలో ..... సంసారంలో
నీవు నా ముంగిట ముగ్గులల్లు గృహలక్ష్మి కావాలని .... ఆశ.

అకస్మాతుగా ....
ఏ అలికిడో, ఏ పిలుపో, ఏ విశ్పోటమో ....
కలలోంచి నన్ను మేల్కొలిపిన క్షణాలు .... గుర్తుకొస్తూ 
అప్రయత్నంగా జారే కన్నీటి బొట్టు
బుగ్గలమించి .... రాతి గుండె మీద పడి బళ్ళుమనే శబ్దం .... అది

ఆ క్షణం నుంచి అసహనం
మెలుకువగా నే ఉండాలని .....
అలజడి, హైపర్టెన్షన్ ..... శరీరాన్ని కుదిపేస్తుంది.
నా గుండె .... ఎందుకో, తియ్యని బాధను,
తన పతనాన్ని తాను ..... కొనితెచ్చుకుంటున్నట్లనిపిస్తుంది.

ఔనూ! కలలోనే .... ఎందుకు?
ఇలలోనూ నేను, నీతో కలిసి జీవించొచ్చుగా!?
మన ఆలోచనలను సంతులనం చేసుకుని,
ఆర్ధిక స్వావలంబనం, నిండు జీవితం .... దిశ గా,
ఒక్కరుగా కలిసి జీవించొచ్చుగా .... అనిపిస్తుంది అప్పుడప్పుడూ

నా అంతరంగ లో ..... లోలోపల మాత్రం,
ఇంకా నా కలలు, ఎప్పటిలానే ....
అక్కడ, నీవు నాకోసం నిరీక్షిస్తుండటం
జారిపోయే కరిగిపోయే కల
ఇప్పటికీ ఓ కన్నీటి చుక్కై రాలుతుండటం .... నిజం!

కొన్ని నిజాలు అంతే!
ప్రియురాలి మనసులో ఉండడానికి
కలల్లో జీవితంలో .... సాహచర్యం సౌఖ్యం
సరిహద్దుల్ని తట్టడానికి .... కాళ్ళమీద నిలబడ్డానికి,
నీ ప్రేమను ఆశ్వాదించి, స్వర్గాన్ని స్వాగతించడానికి
నా మనసు చేసే ప్రయత్నం తపస్సు పేరే .... పురోగమనం!

Tuesday, February 12, 2013

పెదాలు దాటి రాని మాటలు


నా హృదయం
రోదిస్తుందని తెలుసు
నీవు ఎదురుగా లేవని
నీతో పంచుకోవాల్సిన ఎన్నో భావాలు
ఇంకా మిగిలే ఉన్నాయని

నీవు
నన్ను హింసిస్తున్నావు
నీ జ్ఞాపకాలతో గతం
మధురోహల మత్తు
నా నర నరాల్లో
దిగమింగుకోలేకపోతున్న ఊసులు

వయసు మీదపడుతూ
జీవితం సారం
అనుభవాలు ఇటుక రాళ్ళు
ఒకదానిపై ఒకటిగా పేరుకుపోతూ
భావోద్రేకపు పలుకులు కొన్ని
పెదాలపైనే మిగిలిపోతున్నాయి

జీవితం ఇంతేనా
అంతా మనోభావం .... ఒక ప్రేమేనా
ఒక అబద్దం ఒక అస్పష్టతేనా
ఒక అయోమయమేనా అని .... అడగాలి
అర్ధం తెలుసుకోవాలి అని
అక్షరాలు కొన్ని .....
అంతరంగలోనే ఆవిరైపోతున్నాయి

నేను భవిష్యత్తు వైపు
నిన్నను మించిన పురోగతి .... రేపు వైపు
కదుల్తూనే ఉన్నా!
నా హృదయం మాత్రం నిన్నలోనే
ఇప్పటికీ నీ ప్రేమ భావనల్లోనే
మధుర స్మృతుల్లోనే ..... రోదిస్తూనే
కన్నీటి ప్రతిబింబాలు .... భావాలు కొన్ని
మనసు గోడల్లోనే ఇంకిపోతున్నాయి!

Monday, February 11, 2013

మానవాళిని ప్రేమిస్తున్నా!


ఒక నమ్మకం!
ఒక కలిసి ప్రయాణించడం!
అపాయం చెయ్యని రాచపుండు .... దుర్గుణం!
కాలాన్ని తినేస్తూ .... కాలుడ్ని పరామర్శిస్తూ,
ఒదలరాని,
ఒదలలేని,
అనుసరించాల్సిన .... అమూల్య భావం!
ఉచితంగానే పొందేది.
అయినా,
కొనలేనిది.
విలువ కట్టలేనిది.
నా లాంటి,
నీలాంటి,
మనలాంటి .... ఎందరో
సముద్రాలు దాటి,
గగనసీమల్లో ప్రయాణించొచ్చి .... వెతుక్కునేది,
ఉచితమని మాత్రం కాదు.
మనసు పడి, 
ఇష్టపడి పొందాలనుకునే బహుమతి!
ఎందరి కళ్ళో పడి పొందాలనుకునే ఒక ప్రియ పోటీ భావం!
నేను పుట్టింది మాత్రం ....
అరుదైన ఆ ప్రేమ కోసమే!
ఎంత మూల్యాన్నైనా చెల్లించాలని ....
మనసు ఆరడిని దాచుకుని,
నా కళ్ళుంది. ఆ ప్రేమను చూడటానికే ....
ఆ ప్రేమ తోడుగా ....
దేశాంతరాలు తిరిగి రావాలని, 
ప్రేమంటే ఇదీ అని ....
ప్రపంచమంతా వెలుగెత్తి చెప్పాలని 
ఉరకలేసే ఉత్సాహం ....
ఉరుముతున్న ఆవేశం ....
ఆ ప్రేమ కోసమే .... నేను వేచి చూస్తుంది.
ఆ ప్రేమ కోసమే .... నేను వెదుకుతుంది.
ఆ ప్రేమ నా ప్రేమ
ఒక నమ్మకం ....
ఒక ఆరాటం!
ఒక ఆవేశం!
ఒక కలిసి ప్రయాణించడం ....
అపాయం చెయ్యని ....
ఒక చిత్రమైన వ్యాది .... దుర్గుణం!
తెలిసే,
ప్రేమిస్తున్నాను.
ప్రేమను ....
సాహచర్యాన్ని,
స్నేహ సుమ పరిమళాల్ని,
భావ సుమ సుఘందాలు పలువురికీ పంచాలని.

Wednesday, February 6, 2013

వేచి చూస్తుంది మృత్యువు



చలనం లేని,
తెలియని,
నమ్మకం లేని
సంకేతం .... వేచి చూస్తుంది.
గౌరవ,
భయాందోళన,
అద్భుతం ....
ఒక జీవితం ....
అంతం కాబోతుందన్నట్లు.

లక్ష్యరహిత,
ఆశయరహిత,
కనికరము లేని ....
తప్పు మార్గం .... నడిచిన,
నిన్నటి స్వార్థపూరిత,
క్రూర ....
నిజాయితీ
గతం ఒకటి
ముగింపు ముంగిట్లో కొట్టుకోవడం

మీదపడి
కబళించాలని కమ్ముకొస్తున్న
మృత్యుసంకేతం కై
వేచి చూస్తూ ....
ఒక జీవితం
ముగింపు
మూలం చూస్తూ
కార్చుతున్న కన్నీళ్లు
చారలు .... గతం 
అకృత్యపు మనసు ఫలకంపై వెక్కిరిస్తూ

నొప్పిలేని,
ఆకర్షణీయం కాని,
అనామకుడి
మరణం ....
భవిష్యత్తు పై
ఆశ,
సున్నిత,
గౌరవప్రద
జీవితం ఆశించని దౌర్భాగ్యపు జీవితం

నీచ,
అస్థిమిత,
అసభ్య
దృష్టి కోణం గమ్యమై
అసహ్యమైన,
వికర్షణాత్మక,
క్రూరమైన
ముగింపు మృత్యువు
వేచి చూసి కాటేసిన నిజం
మున్సిపాలిటీ బండిలో సగటు మనిషి శవం!

Tuesday, February 5, 2013

ప్రేమ గాధ



భగ భగ మని చప్పుళ్ళు చేస్తూ,
అగ్ని .... జ్వాలలు,
మంటలు,
నీటితో చల్లార్చటం సాధ్యం కాని .... జ్వాలలు
మండుతూ,
మండిస్తూ,
కాల్చేస్తూ .... నా ఆత్మను,

మండే నిప్పు .... నీ ప్రేమ!
దహిస్తూ,
నా ఆత్మను ....
నా మనసు కోరికకు .... ప్రతిక్రియ
ద్వేషాగ్ని ....
నా అత్మను దహించేస్తూ,
చల్లదనం .... ఆరడం సంభవం కాదు అన్నట్లు,

ఒక అగ్ని,
ఒక జ్వాల,
ఒక మంట,
నీరు చల్లార్చలేని జ్వలనం(లావా లాంటి అని)
నా ఆత్మ ను కలచివేస్తూ,
కాల్చేస్తూ మరో .... ప్రణయ కావ్యం!

Monday, February 4, 2013

నా జీవితాన్ని స్పర్శిస్తావేమో అని



ఒక మృదు సంతకం
ఒక చిహ్నం
హృదయాన్ని తట్టే లోతయిన ముద్ర ....
నిన్నే గుర్తుంచుకునేలా,
నీ గురించి మధుర భావనలు .... ఆలోచించేలా
నీ నవ్వు,
నీ తీపి వ్యక్తీకరణ,
మాధుర్యాన్ని తలచుకుంటుండేలా ....
నీవు నా జీవితాన్ని స్పర్శిస్తావేమో అని .... ఆశ!

ఒక వెచ్చని శాసనం ....
నీ వివేకం,
నా నడవడిక, ఆనందాన్ని .... నిర్దేశిస్తూ
నీ శ్రద్ధ .... నా జీవితంలో ప్రతిబింబించే,
స్పష్టమైన వివరణై ....
ఎప్పటికీ గుర్తుండిపోయేలా
ఆబగా, ఆతురతతో
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న
సమయం ఇదే అన్నంతగా
ఒక తీపి నిజానివై నీవు నన్ను తడిమేస్తావేమోఅని .... ఆశ!

ఒక ప్రేరణవై ....
జీవన దిక్చూచివై .... వెలుగువై
నీ ప్రేమకు బానిసను కాక తప్పని నమ్మకం
నీ చేతల్లో, నీ చూపుల్లో చూడటం
కల్పన కాని వాస్తవం
నా ఆశై,
నీ స్పర్శతో నీ జీవితం
నీ మనోభావనల్లో
నేనో ప్రత్యేక స్థానం .... పొంది
నీ  సంతోషానికి కారణం నేను కావల్సిరావాలని ..,. ఆశ!

Sunday, February 3, 2013

జీవితం కటినం

జీవితం కటినం

జీవించడం కష్టం అని చెప్పను.
కష్టసాధ్యం!
మనం నడుచుకుని,
మనం చూసే సజీవ సరళి అది.

సమశ్యలు, ప్రశ్నల వలయం జీవనం!
జీవితాన్ని వంతెనగా మార్చి,
ఆ వంతెన మించి
ఆవలి ఒడ్డును చేరే ప్రక్రియ జీవనం!

ప్రశ్నల సమాధానాలు
సమశ్యల పరిష్కారాలు ....
శ్రమిస్తేనే,
ఆలోచనల మాధ్యమంగానే సాధ్యం!

కష్టంలోనే ....
కష్ట సాధ్యంలోనే .... ఆనందం!
సోమరితనం, దాటేసేతనం .... ఫలాలనివ్వదు.
విజ్ఞులు చెప్పింది ఇదే .... జీవితాన్ని పరిపూర్ణంగా జీవించూ అనే,

జీవితం సులభం అని కాదు.
సులభం ఎప్పటికీ కాదు ....
సోమరితనాన్ని స్వాగతించడం,
సులభం కావాలని ఆశించడం .... మనల్ని మనం మోసగించుకోవడమే!

జీవించేందుకు పోరాడక తప్పదు.



చేదు నిజం!
భయంకరము హానికరమైన సమాజంలో నేను
దిక్కులు ఆలోచిస్తూ,
చలికి ఒణుకుతూ,
నిలబడి ....
ఈ కాలంలో పుట్టల్సిన వాడివి కావు!
బంగారంలాంటి మనసు నీది!
అమ్మ మాటలు .... అమ్మలెప్పుడూ అంతే!

చిక్కని చీకటి,
కళ్ళుచించుకున్నా కనపడని
ప్రమాదకరమైన అర్ధరాత్రి!
నన్ను దూరంగా ఒదిలి వెళ్ళమనకు!
.....నా అభ్యర్ధన.
నాకు భయం లేదు.
నేను స్వేచ్చకోసం పోరాడతాను.
.....నా బింకపు మాటలు.

అకస్మాత్తుగా ఇలా ఒంటిమీది బట్టల్తో
.... ఇంట్లొంచి వెళ్ళమంటున్నావు!
మళ్ళీ ఆలోచించు!
నా గురించి కాదు, మీ గురించి ఆలోచించండి!
నా జీవితం ఎలా జీవించాలో నాకు తెలుసు.
పుట్టినప్పుడే
బ్రతకడం ఎలాగో నేర్చుకున్నాను.
చేపకు ఈదడం నేర్పక్కర్లేదు.

ఉగ్రవాదం వేరు,
క్రాంతి పదం, విప్లవవాదం వేరు!
నా భుజాల్లో శక్తికి కొదవ లేదు.
నా ఆలొచనల్ని,
నా నమ్మకాల్ని కాపాడుకోగలను.
నా నమ్మకం నాది!
పోరాడగలనని, విజయించగలనని .....
తెలుసు .... జీవించేందుకు పోరాడక తప్పదు అని.


నిర్నిబంధ ప్రేమ!



మనసుభావనలు
మాటల్లో చెప్పక్కర్లేదు.
ఏ ప్రమాణాలు అవసరం లేదు.
సున్నిత దృష్టి కోణం ప్రేమ .... ఉంటే చాలు.
ఒక్కరుగా కలిసి
ఒక్కరై జీవిస్తూ,
ఒకే ఆశ, ఆశయం జీవనమై ....
కలలు .... కలిసి కంటూ,
బౌతికంగా ....
వ్యక్తులు ఇద్దరైనా
ఒకే ఆలోచనై,
ఒకే ఆత్మ, హృదయం లా ఉంటూ,
చచ్చేంతవరకూ చేతిలో చెయ్యి ....
చచ్చాక స్వర్గంలో తోడు
మళ్ళీ జన్ముంటే
బేషరతు సమర్పణాభావం .... ప్రేముంటే

అది నిర్నిబంధ ప్రేమ!