Thursday, August 7, 2025

 


కలగంటా  


కలగంటా .... ఈ రాత్రి నిద్దురలో నీ గురించి 

లోకం తప్పుపట్టేదేమో అనిపించే వాటి గురించి 


నీ స్పర్శకై నేనెంతగానో ఆరాటపడతానో, ఆ స్పర్శకై 

నీతోడి భవితకై నాకున్న ఆశ గురించి 


కలగంటా .... ఆ కొత్త అనుభూతికై, నాలో కలిగే ఆ పులకింతకై 

ఎంతో అపురూపం, నా పాలిట సర్వస్వం అనిపించే దానికోసం 


నాకు పట్టలేని పరవశమిచ్చే, ఆ ఆనందం కోసం  

తప్పకుండా నా జీవితాన్నే మార్చేస్తుందనే నమ్మకంకై  


కలగంటా .... మనం పంచుకోనున్న తీపి గురుతులకై 

ఒకరికొకరం పంచే ఆప్యాయతతో గడిపే సుందర క్షణాలకై  


హృదయాన్ని ఉప్పొంగించే కలను నేను కంటా

కలల లోకం వీడగానే, అదే గుండెను ముక్కలు చేసే కలను కంటా 


నే చెప్పేది ఓ కల కథనం

నన్ను ఉద్ధరించే ఓ కల, నన్ను విడిపించే ఓ కల ....


చాలా కాలంగా నాకిష్టమైన నాకు దూరమైన దాన్ని .... 


నా జీవితం .... ఇప్పుడిలా వెలితిగా, తప్పుగా తోచే నా జీవితం

నిజమవ్వాలనే ఆశ, అయినా తీరదేమోనన్న సంశయం నింపే కల 


ఏమైనా సరే, నేనెలా ఉన్నా, ఆశగా నేను ఎదురుచూసే కల 


ఇది నా కలల కల, నాలోని ఓ స్వప్నం

ఈ కల, ఎప్పటికైనా నిజమైతే, వద్దనను ఏనాటికీ  



 

No comments:

Post a Comment