Thursday, March 14, 2013

సమాజానికి ప్రేమ అవసరం


ఎంత మనోహరం
ఎంత అద్భుతం ఈ లోకం
ఎటు చూసినా ఆత్మీయ భావాలే
స్నేహ అనురాగ చాలనాలే
రోజు వారీ చింతలు కష్టాలు కనిపించనప్పుడు
ప్రేమ భావన మనసులో మొలిచినప్పుడు 
ఎవరూ స్వార్ధులు కారు ....
వికసించిన పూల పరిమళాలను
ఒంటికద్దుకుని యదేచ్చగా తిరుగు సందడులే.
మనిషి ప్రేమలో పడ్డం
ప్రేమించడం .... వయసు తగ్గినట్లనిపించడం.
యౌవ్వన రాగాలే అన్నీ వారిలో .... లోలో

ప్రాణం
జీవితం ఎంత అమూల్యమైనదో
ప్రేమిస్తుంటేనే తెలుస్తుంది
అంతా ప్రకృతి మహిమ
మసికొట్టుకుపోవాలని వెలిసిపోవాలని అనిపించదు.
ప్రకాశవంతం యౌవ్వనపు చైతన్యం ఉత్సాహం
నడవర్చుకోవాలని మనసు ఉవ్వీళ్ళూరుతుంది.
ప్రేమలో పడాలనిపిస్తుంది.
నిన్నటి విషాధచ్చాయలు సమశ్యల తీగలు
ఇప్పుడు ఏమీ చెయ్యలేవు.
అన్నింటినీ తెంచుకుని పురోగమించే శక్తి
ప్రేమను మించిన ఏ కాంక్ష .... ప్రలోభ పెట్టలేవు.

గతం
తొందరపాటు నిర్ణయం
బోర్లాపడిన చిహ్నం గాయం
పోగొట్టుకున్న అవకాశం
సమాధానం మనిషి వద్దే ఉంటుంది ఆ క్షణం లో
చాలా ఆలశ్యం చేసాను అనిపిస్తుంది.
అప్పుడు ప్రేమ మనిషిని పిలుస్తుంది. ప్రేమిస్తుంది.
ప్రేమలో మునిగి ఉన్న భావనలు అంతటా.
సాహచర్యం గమ్యం ఉన్నప్పుడు
యౌవ్వనం తిరిగొస్తుంది.
ప్రతిదీ వేగంగా జరగాలనే ఆశ అతని నిన్నటి నేరం

అన్నీ ఆలశ్యంగానే జరగాలని లేదు
పరిస్థితి అవకాశాలే నిర్ణయిస్తాయి
కాలానికి తెలుసు గమ్యం చేరాల్సిన సమయం
మనిషి ప్రేమలో నిలువెల్లా తడిసినప్పుడు
ఆలశ్యం చేయరాదు. అలా అని తొందర పడరాదు.
మధ్యేమార్గాన్ని చూడాలి. ఆలోచించాలి.
గుండెకు తెలుసు నరనరాల ద్వారా అణువణువునూ
ఎలా చేరాలో .... రక్తం ఎలా ప్రవహించాలో
ఆలోచనల ఆక్సీజన్ తో ప్రేమ రక్తం
ఎలా పరిశుభ్రం చెయ్యాలో 
సమాజాన్ని ప్రేమమయం శాంతి మయం చేసేందుకు
అందుకే గుండెకు తోడు మనసూ ఉండాలి.

Wednesday, March 13, 2013

పారిజాతం పరిమళం


నిశ్శబ్దం రాజ్యంలో ఓ గుసగుస
ఉదయపు సూర్యోదయపు
తొలి దృశ్యం
ఆనందంగా జీవించాలనే
ఆలోచనకు ఆరంభం
నా నుంచి నేను దూరం
జరగాలని
చెల్లచెదురౌతున్న శ్వాస .... నీవు.
నా అడుగుల నడకల
క్రింద శబ్దంగా వినిపిస్తూ
ఎండిన ఆకు .... మన ప్రేమ.
బలవంతంగా చీల్చుకొస్తున్న
నీ నవ్వు
నా జీవనం
బృందావనంలో విరిసిన పారిజాతం.

2013, మార్చ్ 13, బుదవారం రాత్రి 9.50 గంటలు

చరిత్ర పురుషులు


వీరు ....
నమ్మిన సిద్దాంతమే చెబుతారు.
చెప్పిందే చేస్తారు.
తమ చర్య కు తామే బాధ్యులౌతారు.
విశ్వసనీయత నమ్మకం వీరి చిరునామా!
ఎంత వెదికినా దొరకని
ఓ కొత్త రకం జాతి మనుషులు వీరు.
ఏదో సాధించామని విర్రవీగని,
కులకని,
ఉన్నది చెప్పేస్తూ ....
తమను తాము సమర్పించుకుని,
చెడుకు సమాధానం చిరునవ్వే అన్నట్లు
తమ విజయాలు
గొప్పలు, అద్భుతాలుగా ఊదరగొట్టని,
ఓ కార్యకర్త ....
వాస్తవం ఎలాంటిదైనా
ఆనందంగా అందుకునేందుకు
అనుభవించేందుకు సిద్ధం అంటూ
ప్రతి కార్యంలోనూ
ఓ ప్రయోజనాన్ని చూపిస్తూ
సాధించిన తాజా విజయాలు
సమాజానివే అన్నట్లు
సాగే నిండు చైతన్యం
పురోగమనం
ఇక్కడ మన మధ్య .... మనిషై
నాతోనూ నీతోనూ చర్చించని
దుమ్ముకొట్టుకుపోతున్న చరిత్ర పుటల్లో
నిండు అక్షరాల్లా
నూతనోత్సాహం కొత్తవెలుగులై
సమాజం పూసిన పరిమళాలు వీరు.

Tuesday, March 12, 2013

కట్టడి అవసరం



అందంగా ఉంది.
నచ్చింది.
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా
ప్రేమిస్తున్నానేమో .... అనిపించింది.
పలుకరింపుగా నవ్వాను.
ఆమె నవ్వింది .... ఆ నవ్వులో అర్ధం కాని అపహశ్యం
నా ఆశ నిరాశయ్యింది.
ఆమెనూ, ఆమె ఆలోచనల్ని ఒంటరిగా ఒదిలేసాను.
నా మనో వాంచకు వాత వేసుకున్నాను.
ఇప్పుడు,
నా ఆలోచనల్ని నేను కట్టడి చేసుకుంటున్నాను.

Sunday, March 10, 2013

పెంచేసుకుందాం రా .... ప్రేమను


కలిసి ..... చద్దన్నం తిందాం. 
గంజి తాగుదాం.
చెట్టు గూడు నీడలో గూడుందాం. 
శ్రమ జీవనాన్ని అలవర్చుకుదాం.
రా! మడిసీ .... 
కాసింత దూరంలో ఊరుంది.
ఊరు నిండా మరలే
కొందరే మడుసులు.
సాటి మడుసుల్తో మన బంధం
ఖరీదు పెంచేసుకుందాం.
మన మాట
మన విధానాలమీదే మనం నిలబడదాం!
అప్పుడు, స్వర్గం శాంతి మన సావాసం చేస్తుంది.

Saturday, March 9, 2013

మనం


ఉదాహరణ అయి ముందుండి దారి చూపాలి.
గుండెతో ప్రేమించాలి.
ఆత్మ తో వ్రాయాలి.
ప్రతిస్పందనలు వింటూ
ప్రతిసోధిస్తూ పురోగమించాలి
మనం కవులం కళాకారులం!

Monday, March 4, 2013

నేను



శ్వాసించాలి.
రక్తం చిందించాలి.
చరిత్ర తిరగ వ్రాయాలి.
రెప్పలు ఆర్పకూడదు.
ఖాళీగా ఉండటం .... మహా పాపం!
చనిపోవడాన్ని మించిన .... మహా దారుణం.
నిజం నేస్తం .... నన్ను నమ్ము!
ఈ స్థితులన్నింటినీ అనుభవించాను .... నేను.

Sunday, March 3, 2013

తెలియపర్చాలని



ఇది నా ప్రేయసికి, పొగరు దుస్తుల పొరుగమ్మాయికి
నేను ఆరాధించే బాల్యపు నేస్తానికి
నా జీవితమూ .... గమ్యం తనేనని తెలియపర్చే ప్రయత్నం

ఇసుకలో కట్టి కూల్చుకున్న పిచ్చుక గూళ్ళు
అర లాగులో నేను, పొట్టి గౌనులో ఆమె
కొట్టుకుని పోట్లాడుకుంటూ గడిపేసిన క్షణాలు

చిన్ననాటి మా చిరు సంతృప్తుల అనుబంధం
ఆమెను, ఆమెచుట్టూ ఉన్న పరిసరాల్ని,
ప్రేమ వెన్నెల పరిచి వెలుగుమయం చెయ్యాలనే .... నా భావనల్ని

నా మదిలో ఆమె స్థానం ఇదీ అని చెప్పని నా అబిమానం
నా ఉనికిని మించి .... నా కలల అస్తిత్వం ఆమె అని
నా కన్నా ఆమెకే ప్రాముఖ్యం నాలో .... అణువణువులో అని

నా జీవం లో జాగృతమైన ఇంద్రియాలన్నింటికీ తెలుసు
నా ప్రాణం నా శ్వాస నా కలల ఆరాధ్యం ఆమే అని
ఆమె నన్ను ప్రేమిస్తున్న నిజమూ నేను గమనించాననే నిజాన్ని

అందుకే .... ఆమె నన్ను కోరుకుంటుందని తెలిసాకే
ఆమెతో పసితనం అల్లరి భాగస్వామ్యం జ్ఞాపకాల నిధిని
ఆమె ముందుంచుతున్నాను ..... నా మనసంతా ఆమేననే నిజాన్ని

ఒడిదుడుకుల జీవనం లో ఏ సమశ్యల శరమైనా
నన్ను తాకాకే ఆమెను చేరేలా ఆమె ముందు నేనుంటానని,
ఆమెనే పిచ్చిగా  ప్రేమిస్తూ, మనసారా ఆరాధిస్తున్నానని

ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి రోజూ ....
ఆమెకోసం నా ప్రేమ ఇంతింతై, మరింతై ఎదగాలనే
నా ఆకాంక్ష .... నా ప్రియ భావన ఆమెకు అక్షర నైవేద్యం

Saturday, March 2, 2013

రేపో మాపో మరణిస్తాననే



నిన్ననే
నేను నీనుంచి ....
కావాలనే దూరంగా జరిగాను.
విడిపోవాలనుకుంటున్నాను.
నీ గుండెను రెండుగా పగులగొట్టి .... మరీ,

నిజంగా
అనుకోలేదు.
నేను నిన్నింతగా గాయపరుస్తానని
నువ్వింతగా రోధించాల్సొస్తుందని
నన్ను దోషిని చేసి నీవలా జాలిగా చూస్తావని

నీవింక
ఎప్పటికీ
పరిపూర్ణురాలివి కాలేవు.
నీలో .... నీ హృదయంలో
ఒక భాగం ఇప్పుడు నీతో లేదు.

నీ భావనల్తో
నేను ఆడుకున్నంత స్వేచ్చగా,
మన మధ్య
గాలి చేరలేనంతగా ....
నన్ను నీవు ప్రేమిస్తున్నావని తెలుసు.

నీ కలల
గమ్యాన్ని నేనని,
మనం కలిసి
జీవితాల్ని, సంసారాన్ని .... ఈదాలని,
నీ కోరిక అని .... నాకూ .... లోకానికీ తెలుసు!

ఏ కారణం వల్లో
నేను దూరంగా వెళ్ళిపోతున్నానని .... తెలుసుకున్నావు. అయినా,
నీ భావనల్ని .... నేను తెలుసుకోవాలని,
నీ ప్రేమ నాదే అని .... నాతో చెప్పాలనే నీ ఆతృతను .... కోరికను,
అలక్ష్యం చేస్తున్నాను .... కావాలనే .... నీకు దూరంగా జరుగుతున్నాను.