నీడలా నన్ను వెంటాడుతూనే వుంది .... ఆమె
ప్రతి క్షణమూ ....
ఏ బలహీన క్షణాలలోనో
నలు వైపుల్నుంచి నన్నల్లుకుపోయి,
రేపనే నా భవిష్యత్తును ....
నాకు దూరం చేసేయాలని,
ఏవైపునుంచి వస్తుందో తెలియదు.
దాగుడుమూతలాడుతూ ఉంది.
శత్రువనుకోలేను.
నెచ్చెలి అనుకోలేను .... ఆమెను.
ఆ రోజు తప్పకుండా వస్తుంది
నా ఆశలు, కలలు, ఆరాటాలకు అంతం పలకాల్సిన రోజు.
ఆమెకు తెలుసు
ఆ సమయం కోసమే ఎదురుచూస్తుందామె
నా శ్వాసను ఆపేందుకు సిద్ధం గా ....
ఏ క్షణాన్నైనా ఆమె నన్ను పలుకరించొచ్చు
నాకు జీవన మోక్షమూ కలిగించొచ్చు!
అందుకే , ఈ లోగా ,
నా బాధ్యతలన్నీ నెరవేర్చుకునుందామనే
నాలో ఈ తొందర .....
నీడలా నన్ను వెంటాడుతూనే వుంది .... ఆమె
ఇక పై దేనికీ భయపడనక్కరలేదని తెలుసుకోవడం.
ఏ చింత, నిస్పృహ లేని
ఎలాంటి సమస్యలూ లేని
ఏ తప్పు చెయ్యక్కరలేని
నొప్పి లేని
రూపమే లేని
పాపపంకిలం కాని
శ్వాసించాల్సిన అవసరం లేని
ఏ పోరాటాలు ఆరాటాలు లేని సంపూర్ణ జీవితం అది
జీవితం ఆఖరి అడుగేసాక,
ప్రతి ప్రాణి అనుభవంలో రాసి ఉన్న వాస్తవం ....
ఎవరైనా ....,
ప్రేమను జాగృతం చేసి
మనసును
ఆటపట్టించి
శరీరాన్ని గిలిగింతలు పెట్టి
సన్నిహితంగా మసలితే ....
ప్రేమే అనుకోవడం
....??
కలలు నిన్ను కనికరించి,
నిద్దురలోనూ పరవసించి,
నీకు నీవుగా,
స్వేచ్చా విహంగానివి లా ఎగిరిపోయేలా ....,
విరిగిన నీ ఆశల రెక్కలు సరి చేస్తా,
ఆ గగన సీమలకు ఎగిరిపోదాం, .... వస్తావా నాతో?
మున్నెన్నడూ చూడని,
కలల లోకానికి,
కనపడని బాధల ఉపశమనానికి,
గాయాలు సమూలంగా మాయమయ్యే చోటుకు,
అంతా నీదే, అన్నీ నీవే అనిపించి,
స్వేచ్చగా పరుగులు తియ్యాలనిపించే
ఆ, బృందావనానికి .... వస్తావా నాతో ?
రాత్రిళ్ళను పగళ్ళుగా మార్చేస్తాను.
ఆ సూర్యుడ్నే నేనై .... నీ జీవితం లో,
భయమెరుగని ఉల్లాసోత్తేజాలతో,
ఆ గగనాన్ని చేరి చంద్రుడితో ముచ్చట్లాడి,
ఆ తారలతో ఎకసక్కాలాడే లా చూస్తా,
నీ కళ్ళలోకి చూస్తూ నేను పొందే తన్మయ భావన
నీలోనూ కలిగేలా చేస్తా, .... వస్తావా నాతో?
నా జీవన బంధపు బాంధవ్యానివై,
నేను అనే పందిరికి పూల తీగవై,
పరిమళానివై అల్లుకుపోతావా నన్ను?
ఆమెలో నా ఆకలి తీర్చాలనే తహతహను
అన్నపూర్ణను,
ఆ రాకతో రుచుల సంరంభాలను చూసాను.
శీతలతత్వం జిహ్వ చాపల్యమేదో అనుకున్నాను.
తడిపేస్తూ ఆమె నన్ను చల్లబర్చడం చూసి
ఆ అద్భుతం, ఆ మట్టివాసన ఎలా సాద్యపడిందో అని
నిజంగా .... ఆ శీతలతత్వం నన్ను చల్లబర్చుతుందా?
మండు వెచ్చని వడ సెగలతో నేనామెను కాల్చేస్తానా? అనే
ఉరుము మెరుపుల ప్రశ్నల మీమాంస తో
ఆకలిగొన్న నా వెచ్చని శరీరం నుంచి
ఉబికుబికొస్తున్న లావా తాకి
ఆమె నోరు కాలి పోకపోవడం చూసాను.
సంసారానికీ సేద్యానికీ ఆవసరం అనుకోలేకపోయాను.
వసంతమై ఆమె, వేసవినైన నన్ను కలవడం
ఋతు ఆగమనావశ్యకత అని సరిపెట్టుకోలేని స్థితి లో
పరికించి చూస్తే, ఈ విశాల ప్రపంచంలో,
ఎన్ని అద్భుత ఆభరణాలో .... !
అన్నీ అమూల్య జీవనావసరాలే,
అంతటా ప్రాణవాయువు,
పైన అఖండ వెలుగుల భాస్కరుడు,
క్రింద నిత్యావసర నీరు,
మధ్యలో ఈ ఖగోళము,
ఆ సూర్యకిరణాల కాంతిలో,
రాశిపోసినట్లుగా రాశి చక్రాలు,
ఆ మేఘాల పందిరి,
ఇంద్రధనస్సు రంగుల ప్రకృతి ....
మనమెంత భాగ్యులమో కదా !
హాయిగా , సంతోషంగా జీవించేందుకు
కక్షలు, కార్పణ్యాలు,
ద్వేష, విద్వేషాలను .... వదలేసి.
మల్లె తీగ తానై
పెంచుకుంటున్న,
ఆ ఆశలు, ఆ కోరికలు,
నేను అనే .... పందిరి చుట్టూ,
అల్లుకుపోతూ,
నాతో కూడా చెప్పని,
ఆ భావనల తీగల అనురాగం,
నాలో ఏదో ప్రత్యేకత ఉందని కాదు ....
తనలోని ప్రత్యేకత అనీ కాదు ,
ఈ విశాల ప్రపంచంలో,
ఒకరి కొకరమై,
ఆనందంగా, ఆహ్లాదంగా,
కడదాకా జీవించాలనే.
కథలు, కవితలు
కలలు
నిట్టుర్పులను రాయను .... నేనిక అని.
ఇప్పట్నుంచి
నీ స్పూర్తి
నీ ప్రభావం ఉండవు .... నాపై.
నా దినచర్యల్ని
నేనే చేసుకుపోతుంటాను.
నీ గురించి ఏ మాత్రమూ .... ఆలోచించకుండా,
అన్నీ నార్మల్ గా ....
తింటాను. తాగుతాను. తిరుగుతాను.
సినిమాలు చూస్తాను
ఆలోచిస్తాను, అందరిలా ....
నల్ల త్రాచులాంటి నీ కురులు,
నిండు తారల్లా మెరిసే నీ కళ్ళు,
ఆ చూపు అయస్కాంత శక్తి
నీవూ నేనే ఉన్నప్పుడు, గదిలో
ఒకప్పటిలా ....
ఇప్పుడవి నన్నేమాత్రం ప్రభావితం చెయ్యలేవు,
ఎవ్వరూ చూడనప్పుడు ఆన్ లైన్ లో
చదరంగం ఆడుకుంటానే కాని,
మునుపటిలా, నీ కొంగుకు వ్రేలాడి ....
ఏవో తుంటరి భావనల్ని
గజిబిజిగా రాసుకుని మదిలో .... తరువాత
ఏ కవిత గానో కథగానో
నిన్ను కేంద్రబిందువును చేసి .... రాసుకోను.
నాకు నేను, ఎవరి తోడూ లేకుండా .... జీవించగలను.
నియమబద్దం గా ....
సమయానికి పనికి వెళ్ళగలను.
పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనగలను.
త్రాగి తినగలను.
సంపాదించిన డబ్బు ఆదా చెయ్యగలను మరణించేలోపు.
నేను చెబుతున్న ఈ చర్యలను
పాటించడం .... చాలా కష్టమని,
చెప్పినత సులభం కాదని
నిన్ను కోల్పోతానని తెలుసు.
ఊపిరాడని అధ్వాన్న స్థితే .... అయినా
నన్ను కాదనుకోవడాన్ని మించిన శిక్షని మాత్రం
అనుకోను.
నేను నమ్ముతాను ,
ఈ సమాజం ....
ప్రేమను, సహజీవనాన్ని నమ్ముతుందని,
ఆ నిజాన్ని మనం ఏనాడూ అంగీకరించకపోయినా
అనంగీకారాన్నీ మాత్రం తెలియపరచము
గంతలు కట్టుకునుండటం వల్లేనేమో,
కళ్ళముందు తరాజు లో ....సత్యం,
వాస్తవమే తూకపు రాయై నిలబడినా ....
అంగీకరించ(లే)ము దేన్నీ ....
సాక్ష్యం అవసరమని అంటూ.
ఉన్నది ఉన్నట్లుగా చూసే
అలవాటు .... లేదు మనకు.
కనీసం
అనంగీకారాన్నైనా అంగీకరించము.
అందుకే ....
ప్రేమ భావన తో ఒక సమావేశం
ఒక నిర్ణయం తీసుకుందామని
ప్రతిపాదిస్తున్నాను.
నేను అన్నింటినీ నమ్ముతాను.
అడ్డంకుల్ని అధిగమించేందుకు చేసే ప్రయత్నం లో
సహజీవన ప్రక్రియను,
ప్రేమ జీవనయానాన్ని నమ్ముతాను.
ఒకవేళ, ఎవరైనా నన్ను
నా లాగానే ఆలోచించినా ....లేక
అయోమయావస్థలో ఉన్నాననుకున్నా ....
ద్వేష భావనలను .... దరికి రానియ్యకుండా
ఆలోచించేందుకు సిద్దపడితే చాలనుకుంటాను .
గాయాలు,నొప్పి ల
దుర్ఘటనల ప్రపంచం లో
నివసిస్తున్నాము మనం
ఏ బాధనూ, ఏ సమస్యనూ ,
ఎన్నడూ తక్కువగా చూడలేము
అలా అని తలనూ వొంచలేము.
మన మురికివాడల నివాసాలను
ఆరోగ్యకర వాసయోగ్య ముంగిళ్ళుగా మార్చుకునే నేపధ్యం లో
ఓ నేస్తమా! నేను నమ్మేదొక్కటే
ఈ సమాజం
ప్రేమనూ, సహజీవనాన్నీ .... నమ్ముతుందని
అంతేకాదు. ప్రేమని, మానవత్వాన్ని, ఔదార్యాన్నీ ....
సామరస్య సంఘీభావాన్ని కూడా
నమ్ముతుందని నమ్ముదాం .