Saturday, October 12, 2013

ఆవేశం!

నన్ను, నేను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తుంటే .... 
అది నీకు, మంచి చెడులపై నీవు వెలుగు ప్రసరిస్తున్నప్పుడు, 
నా వక్రీకృత ఆత్మ యొక్క అక్రమ వ్యతిరేకత లా కనిపిస్తుంది. 

నేను నేనులానే ఉండాలనుకుంటున్నప్పుడు
అది నీకు, నేను చీకటి సమయాల్లో 
హీన, అనైతిక ప్రవర్తన వాంతి చేసుకుంటున్నట్లు అనిపిస్తుంది.

నీకూ తెలుసు మృదు పదజాలంతో మోహం మత్తును నింపి 
అసామాజిక కవితలు రాస్తూ ఉన్నది నేను కాదు అని. 
ఉన్ని లాంటి మెత్తని పదాల్ని నీలా అందంగా నేను పొదగలేనని.

బాషే కాదని బరితెగించిన పదాలు అంటున్నావు. 
నీలాంటి కుసమాజ సంస్కర్తల కు అవకాశం యివ్వను. 
సంకెళ్ళు వెయ్యడానికి, నా నోటికి .... బట్టముక్క కుక్కనియ్యను.    

నీ వస్తువు వేరు, నా వస్తువు వేరు. మన ఆలోచనలు వేరు వేరు.
ఏ విధంగా చూసినా నీవు నాకు గురువువు కావు .... ఉపదేశించేందుకు
నన్ను మార్చాలని చూసేందుకు నీ తర్కం సరి పోదు.    

ఎందుకో ఈ మధ్య ఆలోచనల్ని దృష్టి కోణాన్ని మార్చుకోమంటున్నావు. 
నన్ను పైకి లేపి నిలబెట్టి, అక్కడే కట్టెయ్యాలని చూస్తున్నావు. 
నా ఉద్దేశపూర్వక ఉపేక్ష గమనించైనా ప్రయత్నం విరమించుకోవచ్చుగా!

నా ఆవేశం రాతలు సరిదిద్దుకుంటే అకాడమీ అవార్డుకు అర్హుడ్నన్నంటున్నావు. 
అక్షరాల గారడీ చేసి పొగడ్తలతో ఆశ పెడుతున్నావు. 
నేను తిరిగిందీ, అనుభూతి చెందిందీ చీకటి జీవితాలనే అని మరిచిపోయి మరీ,.     

కోరని విధంగా జీవిస్తున్న ఆ చీకటి పసి మనసు వేదనలకు 
అక్షరరూపం యివ్వడంలో నా ఆత్మ స్వేచ్చ, నా ఆనందమూ వున్నాయని
నీకు ఎలా అర్ధం అవుతుందో, ఎలా విడమర్చాలో తెలియడం లేదు.

అందుకే మరోసారి చెబుతున్నాను. నీ ప్రయత్నం మానుకో 
నేను ఎప్పుడూ సిద్ధమే! .... అవాస్తవిక, కలల వృక్ష చ్చాయలకు దూరంగా 
స్వేదం, కష్టం, కన్నీరు, ఆకలి, ఆవేశం కవితలు రాయడానికి అని

2 comments:

  1. అయ్య బాబో...్భగ,భగ మండుతున్నాయి అక్షర నిప్పు కణికలు.
    అజాత శత్రుడే అలిగిన నాడు ఏరులన్నీ, ఏకమై పారుతాయట.
    మరి మా శాంతి కపోతం ఈరోజెందుకో ఎర్ర జండా ముక్కున పట్టుకుంది.

    ReplyDelete
    Replies
    1. అయ్య బాబోయ్ భగ, భగ మండుతున్నాయి అక్షర నిప్పు కణికలు. అలుగుటయే ఎరుంగని ఆ అజాత శత్రుడే అలిగిన నాడు ఏరులన్నీ, ఏకమై పారుతాయట. మరి మా శాంతి కపోతం ఈరోజెందుకో ఎర్ర జండా ముక్కున పట్టుకుంది.
      ప్రేమ భావనల ఎదెందుకో ఈనాడు మదిని ప్రశ్నించి చూసింది .... అంతే .... బ్రమ పడకండి మెరాజ్ గారు .... కొన్ని బలహీనతల్ని అధిగమించాలని అనుకోవడమూ, ఆచరించడంలో ఎంతో వ్యత్యాసం వుంది. ఔనూ కవిత నిజంగా అక్షర కణికల మయమా .... సామాజిక ప్రయోజనం దిశ లో వుందా అని ఒక చిన్న అనుమానం!
      ధన్యాభివాదాలు అందమైన స్పందనకు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete