Friday, January 17, 2014

నిషిద్దాక్షరాలు



 













ఎదగని వయసు తొందరపాటు ఆరాటం ఒక అనాద శిశువుకు .... అమ్మనాన్నలం మేమే అని చెప్పుకుని మొగ్గను నిర్దాక్షిణ్యంగా అమ్ముకున్న ఒక స్వార్ద దంపతుల నిర్ణయం, గతం గాయం ఆమెను వెంటాడుతుంది. .... కలలోనూ నీడలా.

ఆమె పేరు పూర్ణ. ఆమె కళ్ళు ఎప్పుడూ ఆలశ్యంగానే తెరుచుకుంటాయి. కళ్ళు తిప్పుకోలేనంత సమీపం లో ప్రమాదం ఉన్నప్పుడే ఆమెకు బోధపడుతుంది తను ప్రమాదం లో నిండా మునిగిపోయానని. విశ్రమించేందుకని కళ్ళుమూసుకున్నా .... పిచ్చి కలలే వస్తాయి. చూరునుంచి చినుకులు రసి, రక్తం లా జారి విష వృక్షాలు పుడుతున్నట్లు, తను అఘాదాల్లోకి, ఊపిరి ఆడని అంధకార కుహరాల్లోకి పడిపోతున్నట్లు, ప్రాణం గాల్లో తేలి, కలిసిపోతున్నట్లు కలలొస్తుంటాయి.

ఎవరో ఏడుస్తున్నట్లు, పెడబొబ్బలు పెడుతున్నట్లు, అది తనేనేమో అన్నట్లు అరుపులు వినిపిస్తుంటాయి. భయ విహ్వలై సహాయం కోసం అరిచే ప్రయత్నం సఫలం కానట్లు .... గొంతులోంచి మాటలు పెగలని స్థితే ఎప్పుడూ. జరగబోయే అకృత్యాల కీచక లక్షణాలు సమీపం లోకి చేరేకొద్దీ పూర్ణలో భయం, విచారం, బాధ .... అసలెందుకు పుట్టానా? అని తన అస్తిత్వం మీద అసహ్యమూ పెరిగిపోతూ ఉంటాయి.

ప్రతి రాత్రీ ఈ గతం జ్ఞాపకాలు పీడకలలా పీడిస్తునే ఉంటాయి. గతమే కదా అని మరిచిపోయి ఎంత దూరంగా జరిగిపోవాలనే ప్రయత్నం చేసినా విఫలమే అవుతుంది. అయినా ప్రతి సారీ ప్రయత్నించి భంగపడి తప్పనిసరై లొంగిపోవడం .... భయం తెరలు తెరలుగా ఆమె గుండెను ఆవహించి .... ఆమె ఉలిక్కిపడి లేవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడూ ఒంటరితనము చీకటే ఆమెను పరామర్శిస్తుంటుంది.

"వద్దు! ఆగు! తట్టుకోలేను! నన్నిలా వొదిలెయ్యి!" అనే పదాల వేడుకోలు అరుపులు ఆ పరిసరాలను అల్లుకుపోతున్నా పసుత్వ అలక్ష్యం ఆమెను లొంగదీసుకుంటూనే ఉంటుంది.

ఒక మానవత్వం లేని మృగం అతను, రాక్షసుడు. ఆ కళ్ళ లో ఎప్పుడూ ఆ ఎర్రటి జీరలే. కసి, ఉన్మత్తతే కనిపిస్తూ ఉంటుంది. పశుబలం దేహదారుడ్యం కలిగి అతను ఆమెను ఆక్రమించుకునేటప్పుడు, ఆమె కు ఎలాంటి తప్పించుకుని పారిపోయే అవకాశం దొరకదు. భరించలేని బాధతో విలవిల్లాడటం మినహాయించి. ఆమె హృదయం ఒత్తిడికి లోనై పిండినట్లై రోదిస్తూ కన్నీళ్ళు స్రవించేటప్పుడు మాత్రం, అప్పటికే మృగతృష్ణ తీర్చుకున్న అతను వాస్తవం లోకి వచ్చి అనునయిస్తాడు.

అప్పుడు ఆమె గది లో ఒక మూలన ముడుచుకుని కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఆమె శరీరం మీద అక్కడక్కడా గాయాలు, రక్కులు, రక్తం స్రవిస్తూ, అతి దీనంగా రాయైనా కరిగేలా చూస్తూ ఉంటుంది.
"నన్ను క్షమించు! ఆవేశం లో నన్ను నేను మరిచిపోయాను. ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వను. నన్ను నమ్ము!" అంటాడు.

ఈ తంతేమీ మొదటిసారి కాదు చివరి సారి చెబుతున్నాడు అనుకోవడానికి .... అతనికి పూర్ణ అమ్ముడుపోయిన నాటి నుంచి అదే తంతు. అదే బాధ, అదే నిర్దయ, అదే వాంచ .... అతనిలో మృగం పూర్ణను ప్రతి రోజూ చావుకు సమీపానికి తీసుకెళుతుండటం .... పూర్ణ విలవిల్లాడిపోతూ .... ఆ బాధను, అతన్నీ భరిస్తూ ఉండటం జరుగుతూనే ఉంది.

అలా జరిగిన ప్రతిసారీ పూర్ణ తనకు తాను పిచ్చి ఆస్వాసన ఇచ్చుకుంటూ ఉంటుంది "అతను మారతాడు" అని. కానీ,
చీకటిపడుతూనే అతను మళ్ళీ వస్తాడు నరకాన్ని తన వెంట తీసుకుని. మృగం లా, మందులో మునిగి .... అప్పుడు ఆమెకు అర్ధం అవుతుంది అతని మాటలు నిజం కాదని, అతను మారదని.




 













అలా, పూర్ణ తనను తాను బాధ అనే బంధనము లో బిగించుకుని ఆవిరైపోతుంది. ఇప్పుడు ఆమెను ఆ అమాయకత్వాన్నీ స్వార్ధ రాక్షత్వం బారి నుండి కాపాడటం కాలానికైనా సాధ్యం కాదేమో! ఎందరు పూర్ణమ్మల జీవితాలు ఇలా స్వేచ్చా సౌశీల్యాలను కోల్పోయి చరిత్ర పుటల్లో నిషిద్దాక్షరాలుగా మిగిలిపోతున్నాయో కదా!

5 comments:

  1. భూమ్మీద పుట్టిన జీవకోటిలో ....లక్షణాలను మార్చుకోగలిగే అవకాశం ఒక్క మానవునికే వుంది...కానీ దాన్ని చెడుకు ఎక్కువగా వినియోగిస్తున్నాడు , మంచి కంటే . అదే మన దురదృష్టం . చంద్రగారు కవిత వాస్తవానికి అతి దగ్గరగా ఉంది .

    ReplyDelete
    Replies
    1. భూమ్మీద పుట్టిన జీవకోటిలో .... లక్షణాలను మార్చుకోగలిగే అవకాశం ఒక్క మానవునికే వుంది .... కానీ దాన్ని చెడుకే ఎక్కువగా వినియోగిస్తున్నాడు మనిషి .... మంచి కంటే.
      అదే మన దురదృష్టం.
      చంద్రగారు కవిత వాస్తవానికి అతి దగ్గరగా ఉంది.
      చక్కని విశ్లేషణ స్నేహాభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete
  2. ఇలాంటి స్త్రీల వేదనలు వెలుగు చూడవు.చరిత్రకెక్కవు, చెవులకు వినిపించవు, సిరాను మాత్రం ఆరనివ్వవు.
    ఎవరు మారుస్తారు ఈ రాతలని, స్త్రీలకు ఆర్దిక స్వాతంత్ర్యం ఉండాలి, కొంతైనా మెరుగు కనిపిస్తుంది.
    మనస్సును మూగదాన్ని చేస్తాయి ఇలాంటి రచనలు.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి స్త్రీల వేదనలు వెలుగు చూడవు.
      చరిత్రకెక్కవు,
      చెవులకు వినిపించవు,
      సిరాను మాత్రం ఆరనివ్వవు.
      ఎవరు మారుస్తారు ఈ రాతలని,
      స్త్రీలకు ఆర్దిక స్వాతంత్ర్యం ఉండాలి, కొంతైనా మెరుగు కనిపిస్తుంది.
      మనస్సును మూగదాన్ని చేస్తాయి ఇలాంటి రచనలు.

      ఒక సున్నిత మనోభావన, హృదయం చలించిన అర్ధవంతమైన స్పందన ఈ ఆత్మీయాభినందన
      ధన్యమనోభివాదాలు ఫాతిమా గారు!

      Delete
  3. కవిత రాసిన మీరూ ఇక్కడ సానుభూతి చూపిస్తున్న మేమూ - మంచివాళ్ళమే - రేపిస్టులం కాదు. రేపిస్టు మనస్తత్వం ఉన్న వాళ్లెవరూ ఈ దరిదాపులకి కూడా రారు. పిల్లి మెడలో గంట కట్టడ మెలా?

    అన్ని సార్లు అందరూ అంతగా ప్రతిస్పందిస్తున్నా, ఈ మధ్యనే న్యాయ స్థానాలు కూడా శిక్షల మోతాదు పెంచినా, పట్తుబడితే ఇదివరకటి కన్నా యెక్కువ శిక్ష పడుతుందని తెలిసినా అవే పనుల్ని మరీ క్రూరంగా చేస్తున్న వాళ్లని ఆపడం యెలా?

    పైకి కనిపిస్తున్నట్టు అవి కేవలం లైంగిక నేరాలు కాకపోవచ్చు.అసలు సమస్యకి మూలం ఒకచోట ఉంటే అక్కడ కొట్టకుండా వేరే చోట కొడుతున్నామా?సోనియా గాంధీ నుంచి మమదా దీదీ వరకూ ఆ పాపాన్ని ఆదవాళ్ళ వస్త్ర ధారణ మీదకి నెట్టేసారు. కానీ అలాంటి వస్త్ర ధారణతో హల్చల్ చెస్తున్న ఆరకం ఆడవాళ్ళు సినిమాల్లో చేరీ మోడళ్ళు గా మారీ విమానాల్లో విహరిస్తూ క్షేమంగానే ఉండగా నిండుగా కప్పుకుని బస్సుల్లో రైళ్ళలో తిరిగే మధ్యతరగతి అమాయకపు ఆడపిల్లలే వీటికి బలవుతున్నారు.

    చాలా కాలం నుంచీ పిల్లల పెంపకంలో మనం ఒక తింగరి పధ్ధతిని పాటిస్తున్నాం.రేపు పెళ్ళయ్యాక ఒక ఆడదాన్ని సంతోష పెట్టి, పుట్టుకొచ్చే సంతానానికి ఒరవడిగా ఉందాల్సిన మగపిల్లవాడిని క్రమశిక్షణ అలవడేలాగ పెంచడం లేదు. 'వాడికేం మగవాడు యెలాగైనా ప్రవర్తించవచ్చు ' అనే ధోరణిలో ఉంటున్నది. ఇవ్వాళ పెంపకాల్లో వికృతమయిన విషయం అన్ని నిషేధాలూ క్రమశిక్షణలూ ఆదవాళ్ళకే విధించటం, మగవాడికి కారెక్టర్(శీలం) గురించి చెప్పకపోవటం. దీని వల్లనే మాన సమ్రక్షణ అనేది పూర్తిగా ఆడదాని బాధ్యత అయింది.అసలు నిషేధాలూ క్రమశిక్షణా రేపటి రోజున కుటుంబ పెద్దగా ఉండాల్సిన మగవాడికే అవసరం.

    ఇంకొకటి నిరుద్యోగ సమస్యకి సంబంధించిన గొడవ. ఒకప్పుడు అంటే ఆడవాళ్లకి స్కూళ్లు పెడుతున్న పాతకాలం రోజుల్లోనే వీళ్ళు మనకి పోటీగా వొచ్చి మనకి రావల్సిన వాట్ని తన్నుకు పోతారేమో అనే యేడుపు కూడా మొదలయింది.ఇప్పుడు కొత్తా యేడుపులు పెరిగినయ్గా. ఓసీలు బీసీల మీద పడి యేడుస్తున్నారు. ఆ బీసీలు పర్సెంటేజి చాలట్లేదని యేడుస్తున్నారు. ఈ కాటగిరీల్లో లేని వాళ్ళు లిస్టులో మా పేరు కూడా చేర్చాలని యేడుపు. యెంతటి యేడుపుగొట్టు వెధవయినా యెందుకూ పనికి రాని వాడయినా పెళ్లికి మాత్రం పనికొస్త్తాడు గదా. ఫైనల్గా ఈ గాడిదలందర్నీ చేసుకున్న ఆడవాళ్లకి బతుకంతా యేడుపు.యెంత చేతగాని మొగుడయినా అణిగిమణిగి పడి ఉండాల్సిందే తప్ప వీడు నాకక్కర్లేదని తిరగబడనంతగా ఆడవాళ్ళు మానసికంగా కండిషన్ అయిపోయారు.

    ఇదంతా నేను సరదాకి చెప్పటం లేదు. చాలా కేసుల్లో ఆ దుర్మార్గాలకి పాల్పడుతున్న వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళ సామాజిక వాతావరణం, కుటుంబ వాతావరణం పై విధంగానే ఉంటుంది. తమ కళ్ళ ముందు స్వేచ్చగా తిరుతున్న ఆడవాళ్లని చూసినప్పుడల్లా ఇంట్లో తన తల్లి తండ్రి యెంత అసమర్ధుడయినా యెలా ఒదిగి ఉందో అలా ఉండకుండా బరితెగించిన ఆడవాళ్ళలాగా కనిపిస్తారు. అలాంటప్పుడు వాళ్ళని శిక్షించాలనే అలోచనతో ఆ నేరాలు చేస్తున్నారు. అందువల్లనే నిర్భయ విషయంలో కేవలం మానభంగమే కాకుండా ఆ భీబత్సం చెయ్యడం జరిగింది.కాబట్టే వాళ్ళెవరూ శిక్షకి జంకడం లేదు.

    మూర్ఖుడికి మూర్ఖ పధ్ధతిలోనే చెప్పాలి.నేర స్వభావాన్ని బట్టి శిక్షా విధానాలు కూడా ఉండాలి.ఈ రకమయిన నేరాలకి అంటే రేప్, ఈవ్ టీజింగ్ లాంటివాటికి పెళ్ళి కాని వాడయితే వాడి తండ్రికీ, పెళ్ళయిన వాడయితే భార్యకీ వాడికి వేసిన శిక్షనే కంపల్సరీగా వేసే విధంగా న్యాయసూత్రాల్ని సవరించితే ఫలితం ఉండొచ్చు.

    ప్పోలీసులూ, న్యాయవాదులూ, న్యాయమూర్తులూ అంతా ఇప్పటి తలకిందుల పెంపకంలో పెరిగిన వాళ్ళే కాబట్టి ఆయా కేసుల విషయంలో నిర్లక్ష్యంగానూ నీరసంగానూ వ్యవహరిస్తున్నారు. న్యాయసూత్రాల్ని సవరించే అదికారం ఉన్నవాళ్ళు ఈ విధంగా యెప్పటికి అలోచించగలుగుతారో? అసలు నా సూచన మీకయినా నచ్చిందో లేదో? సమస్య మళ్ళీ పిల్లి మెడలో గంట కట్టటం దగ్గిరికే వొచ్చింది కదూ!

    ReplyDelete