Tuesday, December 24, 2013

పిల్లా! ఒక్క మాట చెప్పు చాలు




















పందిరి మంచం పక్కన నీవు, 
వేడి వేడి కాఫీ తో గోరువెచ్చని మందహాసం తో
ప్రతి ఉదయమూ ....
పిల్లా! 
దాయలేను. తుడిచెయ్యలేను ఈ భావనల్ని 
అవి కలిగించే ఆహ్లాదాన్ని .... మదిలో, 
సంపూర్ణుడిని అనే భావన నీవు పక్కన ఉన్నప్పుడు. 
అడగాలని అనిపిస్తూ ఉంటుంది, నా హృదయానికి, 
"నేనంటే ఎంతో ఇష్టం అని", చెప్పి, 
ఆ క్షణాల్ని అలాగే ఉండనియ్యమని .... నిన్ను.

నిజం చెబుతున్నా!
నీ చేతిలో చెయ్యేసి, కలిసి నడుస్తానని, 
నీ ప్రతి అవసరమూ, నా అవసరం అనుకుంటానని, 
నాడు, 
మంగళవాయిద్యాల సందడిలో, 
నీవూ నేనూ చేసుకున్న ఆ మౌనబాసలు ....
ఇంకా గుర్తున్నాయి. ఎప్పటికీ గుర్తుంటాయి. 
ఓ పిల్లా! 
ఒట్టేసి చెబుతున్నాను. 
నా హృదయభావనలు, 
నా మనసుమాటలు ఒక్కటే అని. 

పిల్లా! మనది సామాన్యమైన ప్రేమ కాదు. 
ఏంత తాగినా తీరని దాహం మనది. 
ఇరువురం అస్తిత్వాలు కోల్పోయి, నీవు నేనై 
నేను నీవై పరిపూర్ణులం అయ్యేవరకూ 
తీరని ఆర్థి అది.
మళ్ళీ చెబుతున్నా!  నా హృదయం, ఆత్మ, కణకణమూ 
ప్రతి రోజూ ఆ ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి. 
నిన్ను ఇంతగా ప్రేమించే శక్తిని నాకిచ్చినందుకు .... 
ప్రతిరోజూ నీవు 
"నేనంటే ఎంతో ఇష్టం అని", 
చెప్పేవరకూ మురిపించే శక్తిని ప్రసాదించినందుకు.

నీవు సంకల్పించిన ప్రతి పని లో తోడుంటాను 
ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏమి చెయ్యాలనుకున్నా 
పిల్లా! 
నేను నీ పక్కనే ఉంటా! 
ఆ ప్రకృతి సాక్షి గా చెబుతున్నా! 
ప్రాణమున్నంత వరకూ, నీ శ్వాసనై ఉంటానని, 
మాటిస్తున్నా! అన్నీ సక్రమంగానే జరుగుతాయని, 
సర్వం సవ్యమే అని ....
పిల్లా! 
"నేనంటే ఎంతో ఇష్టం అని" ఒక్క మాట చెప్పు చాలు.

2 comments:

  1. ఇంత వివరంగా చెప్పాక కూడా తోడు ఉండనని ఎలా చెప్పగలదు ఆ పిల్ల . చంద్రగారు ఎంతయినా అనుభవాల సారంతో మీ కవితలు సారవంతంగా ఉంటాయి .

    ReplyDelete
    Replies
    1. "ఇంత వివరంగా చెప్పాక కూడా తోడు ఉండనని ఎలా చెప్పగలదు ఆ పిల్ల. చంద్రగారు ఎంతయినా అనుభవాల సారంతో మీ కవితలు సారవంతంగా ఉంటాయి."
      చిక్కని భావన స్పందన. స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు శ్రీదేవి!.

      Delete