నిజంగా, అది ప్రేమ అని అనుకోలేను.
కళ్ళను కమ్మిన
ఆ కన్నీటి మేఘాలు
ఆ మసక పొగమంచు
పొరలను చూసి,
పగిలిన హృదయాన్నీ,
కోల్పోయిన
స్పర్శేంద్రియ గ్రాహక శక్తిని,
అయోమయానికి లోనై,
చెదిరిన ఆత్మను .... ఆమెను చూసాక.
ఆమె కదలికల్లో ....
యాంత్రికత
స్వస్థచిత్తత ను కోల్పోయి.
నిజం చెబుతున్నా!
ముమ్మాటికీ
అది ప్రేమ అని అనుకోలేను.
అనునయం, బుజ్జగింపు పొందాల్సుండి,
నిరాశ అంచులపై తిరగాల్సిరావడం,
అశిక్షితుఁరాలిలా,
అనాగరిక, అసంసారిక రేఖల సరిహద్దుల్లో ....
ఒంటరిగా తిరగాల్సిరావడం.
ఓదార్పు, స్వాంతనము
పొందిక లేని నరక జీవనం సాగిస్తూ
చిక్కుముడులు,
గందరగోళము,
అవహేళనలకు పాలౌతూ .... ఆమె,
నిజమే చెబుతున్నా!
అది ప్రేమ అని అనుకోలేను.
చీకటి కుహరం లో
మిగిలుండేందుకు
సుముఖతను చూపించడం,
ఆశ అనే ఆఖరి దీపం
అలసటతో ఆరిపోయేవరకూ
అస్తిత్వం, రూపం మసకబారేవరకూ
శూన్యంలో, మౌనం లో
కలిసిపోవాలనుకోవడం.
అపనమ్మకం,
అత్మ విశ్వాసం
సడలిన అసహాయత్వం,
అభద్రతాభావం
ఊపిరాడకపోవడం ....
ఉండుండి "అతనిది నిజమైన ప్రేమేనా!" అని
అతను కాదు, "నేనైనా నన్ను ప్రేమిస్తున్నానా!" అని
అంతరంగం లో ప్రశ్నలు
సంఘర్షణలతో సతమతమౌతూ,
నిజం! నిజంగా అది ప్రేమ కాదు.
ఎందుకంటే,
ప్రేమ, శూన్యం కాదు.
ప్రేమ, కలవరం, భ్రమ కాదు.
ప్రేమ, బాధ, పశ్చాత్తాపం కాదు.
ఒంటరితనం, మత్తులో మునగడం కాదు .... ప్రేమ.
తెలియని అనిశ్చితి,
కదలలేని సంశయము .... ఊబి,
అబద్దపు సాక్షం, మోసపూరిత ముసుగు కాని ....
ప్రకాశించే వెలుగు కిరణం .... ప్రేమ,
నిజం! ఆమె ఉన్న స్థితికి భిన్నత్వం వికృతే .... ప్రేమ
No comments:
Post a Comment