నా ఉద్దేశ్యం, భావం ఇదీ అని
నేను నీకు చెప్పలేదు.
నీవు నమ్ముతావో లేదో అని
నిజంగా అంగీకరించేదానివేనా?
లేక అర్ధం లేని పదాలతో
అనుకూల అర్ధాలు అల్లుకుని,
అపరిచితను పలుకరిస్తున్నాడు.
వెర్రి మనిషి అనుకుంటున్నావా!
నీవూ, నేనూ ఎప్పుడో, ఎక్కడో కలిసామనే
ఒక ప్రియభావన నాది,
ఎక్కడో ఎప్పుడో చూసినట్లుంటుంది
అందుకే, "నా ప్రియురాలొచ్చింది" ఇప్పుడు
అని నాలో నేను అన్నాను .... నీతో.
ఇలాంటి, ఒక్క క్షణం కోసం
కొంతమంది ఒక జీవిత కాలం
వేచి చూస్తూ ఉంటారు.
ఇలాంటి, ఒక సాంగత్యం కోసం
కొంతమంది శాశ్వత అన్వేషణ చేస్తూ
అనిర్వచనీయమైన అనుబంధం,
విలక్షణము, ఒక ప్రత్యేకమైన
సాన్నిహిత్యం ముద్దు కోసం ....
తపస్సులు చేస్తుంటారు.
ఓహ్! నేను నమ్మలేకపోతున్నాను.
నిజంగా నిజమేనా ఇదీ అని.
కానీ, పొందగలుగుతున్నాను.
ఎందరో వ్యక్తులు .... జీవితకాలం
వేచి, వెదుక్కునే క్షణం
నీ సాహచర్యం నా ముందుందీ క్షణం.
మూలాలతో పాటు అన్నీ మారుతున్నాయి.
కానీ సహధర్మం, ప్రేమ
సాంగత్యం అందం అలానే ఉన్నాయి.
అది ఎంతో లేతగా, సున్నితంగా
పసి మృదుత్వం లా
అక్షరాలు, పదాల్లో వివరించలేను.
నేను కలల్లో కంటుంటాను.
ఇప్పుడూ కలే అనుకుంటున్నావేమో ....
కాదు. నేను మెలుకువగా ఉన్నాను.
నా కలను నిజం గా, ఎప్పటికీ లా
మార్చుకోవాలని అనుకుంటున్నాను.
నీ తోడుంటే ఏదైనా సాధ్యమే!
జీవన భాగస్వామ్యం లో ప్రేమను కాపాడి,
పెంచి పోషించి, వర్ధిల్ల చెయ్యగలం మనం.
మనం మన బంధాన్ని
గొప్ప ప్రేమ బంధంగా మలచుకోగలము.
నీవు తడబడి ఎప్పుడైనా త్రుళ్ళుతున్నప్పుడు
పడకుండా నేను నా చెయ్యడ్డువేస్తాను.
నేను ఎప్పుడైనా తొందరపడి
అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు
నీవు నన్ను బుజ్జగిస్తూ ఉంటావు.
మరోసారి చెబుతున్నా నీతో .... పిల్లా!
ఎందరో ఇలాంటి క్షణం కోసం
ఒక జీవితకాలం ఎదురు చూస్తుంటారు.
అన్వేషిస్తుంటారు. ఇంకెందరో ఈ క్షణం,
ఈ సాంగత్యం, అనుభవం కోసమే శ్వాసిస్తుంటారు.
No comments:
Post a Comment