Friday, November 22, 2013

నీ దరి చేరాలనుంది

ఓ పిల్లా! ఇటు చూడు! నా మాట విను! 
ఎలా చెప్పాలో తెలియడం లేదు.
నీకు తెలుసు. 
నేనేది చెప్పినా, 
అది నిజమైనా అబద్దమైనా  
గుండె లోంచే చెబుతానని,
నేను తప్పు చేసానన్నది నిజం, 
సమర్ధించుకునేందుకు ప్రయత్నించి 
మానసికంగా నిన్ను దూరం చేసుకున్నాను. 
నిన్ను బాధించాలని మాత్రం కాదు. 
నీ మానసిక క్షోభను అర్ధం చేసుకుని, 
ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. 
నాకో అవకాశాన్నివ్వవా 
నీ తోడు నాకు కావాలి అని.

నా మూసుకున్న కళ్ళ వెనుక 
ఆశల, కలల బృందావనం లో 
పూచిన పారిజాతం, పరిమళం 
అద్భుతంలా నీవు. 
అక్కడ నీ ముందు ముద్దాయిలా నేను, 
.....
కళ్ళు మూయలేకపోతున్నాను. 
ఓ పిల్లా! నీవూ చూడు .... కళ్ళు మూసుకుని 
ఎక్కడైనా గమనించగలవేమో 
నీ కలల వీధుల్లో నన్ను .... 
నీ ప్రకాశం కోసం పరితపిస్తున్న .... బాటసారిని. 
నిర్దారణగా తెలుసు నాకు. 
దోషిగా నేను నవ్వుతూ నీవూ 
నిన్ను చూడాలనుకున్న ప్రతిసారీ 
కళ్ళు మూసుకుంటే చాలని.

నీవూ నేనూ ఒక్కరుగా కలిసి
స్నేహం, ప్రేమ ద్వేష రాగాలనూ  
ఒకరినొకరం  పంచుకున్నాము. 
ఇద్దరమూ కోరుకున్నదీ, పొందిందీ అదే. 
బేషరతుగా 
నీవు నా తోడువి ఎప్పటికీ అని 
అనుకున్నాను. 
నీ ప్రేమను నీవు బాధ్యత గా పంచాలి అని. 
అహంకారినై తొందరపడ్డాను. 
పరుషాలెన్నో అన్నాను. 
ఇప్పుడు బాధపడుతున్నాను. 
మళ్ళీ మాటకలపాలని చూస్తున్నాను.
కానీ పిల్లా! చిత్రం కాల మహిమ ....
నీవు లేని జీవితం ఊహించలేకపోతున్నాను. 
నాకు నీ అవసరమే గుర్తుకొస్తుంది.

నా మనసు మనసులో లేదు. 
అంతా శున్యం లా ఉంది. 
నీ పక్కనే ఉన్నా నిన్ను కోల్పోయాను. 
అశక్తుడ్ని, అచేతనుడ్ని. 
ఒక్క మాట చెప్పు పిల్లా! 
అన్నీ సరిదిద్దుకుంటాయి అని, 
ఎదురుచూస్తాను కాలాంతంవరకైనా. 
నీ అనురాగం, నీ అమాయకత్వం 
నీ మృదుస్పర్శను కొల్పోయాను. 
ఇప్పుడు కోరుకుంటున్నాను. 
నీవు నన్ను మన్నించాలని 
నన్ను నీ దగ్గరకు చేరనివ్వాలని.

మది శూన్యమై, ఒంటరిగా ఉన్నప్పుడు 
అలసినప్పుడు, ఆలోచనల్లో తలమునకలైనప్పుడు 
నీవే గుర్తుకొస్తుంటావు. 
నీ ప్రేమే గుర్తుకొస్తుంటుంది. 
నిన్ను బాధించాను. నిజమే! 
అబద్దాలు ఆడాను. తెలిసినా నీవు క్షమిస్తావనుకున్నాను. 
ఇప్పుడు నేను మారాను. 
నిజం! ఈ మార్పు మాత్రం అబద్దం కాదు. 
ఓ పిల్లా! నేను నీకు దగ్గర కావాలనుకుంటున్నాను. 
నీ గుండెలో తిరిగి స్థానం పొందాలనుకుంటున్నాను. 
నిన్నను మరిచి నేడు, రేపు లో 
నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను, 
రానియ్యవా నన్ను .... ఓ పిల్లా! నిన్నే!!

2 comments:

  1. కవిత మొత్తం చేసిన తప్పిదానికి పశ్చాత్తాప పడే మగ మనస్సు కనిపిస్తుంది.
    అయినా సరే పిల్లా..... అస్సలు నమ్మకు:-)
    ( సర్, కవిత చాలా బాగుంది, మీ కలం ఎందుకో పరుగెడుతుందీమద్య?

    ReplyDelete
    Replies
    1. కవిత మొత్తం చేసిన తప్పిదానికి పశ్చాత్తాప పడే మగ మనస్సు కనిపిస్తుంది.
      అయినా సరే పిల్లా..... అస్సలు నమ్మకు:-)
      ( సర్, కవిత చాలా బాగుంది, మీ కలం ఎందుకో పరుగెడుతుందీమద్య?) .... స్పందన అభినందన
      వేసిన రహదారి లో పరుగులు సులభమే. మీలాంటి వారి ప్రోత్సాహమే కారణం. నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!

      Delete