Friday, September 27, 2013

ఏ జన్మ పాపమో .... ఈ పీడకల


నిద్దుర లేని, కలలు రాని రాత్రులు
నిజంగా అంత కోపమా .... నన్నే వెంటాడను
ప్రశాంతత లేని, రెప్పలు మూయలేని
అభద్రతాభావం పెరిగిపోయి,
అణువణువూ అలుముకుపోయిన భయం .... నిలువెల్లా,
దయలేని నీడలా అంధకారం నా సమీపం లో
నా వెనుక, నా పక్కన, నేను లా ....

అంతా చీకటే! కళ్ళు చికిలించి చూసినా
కళ్ళు తప్ప వేరేదీ కనపడని
అనంత పైశాచిక భవనావరణలో ఉన్నాన్నేను.
శరీరం గడ్డకట్టి, గొంతు పిడచకట్టుకుపోయి
వక్రరూపమేదో మనసు గోడపై కార్వింగ్ చెయ్యబడినట్లు
దాని ప్రభావం నుండి తప్పించుకోలేక ....
రాని నిద్దుర కోసం .... తపిస్తూ, ఏడుస్తూ
ఆశావహమైన విశ్రాంతి, కాంతి కోసం ప్రార్ధిస్తూ.

పీక్కుపోయిన నల్లటి చారల .... డొల్ల కళ్ళు,
అసభ్యకర కదలికలతో ఆరున్నర చేతుల ఆటలు.
ఒక రాక్షసో, ఒక దెయ్యమో, ఒక శాపమో లా
చావురాని నరకానికెందుకో లాక్కెళ్ళాలనుకుంటున్నట్లు
ఆ గుణాన్నీ, ఆ రసాన్నీ, ఆ రాగాన్నీ .... అది ఏ లక్షణమో
అర్థం చేసుకోలేని దుర్ధశ లో .... కొట్టుకుంటూ,

భయంగా ఉంది! ఎప్పటికీ ఈ భయం ఇలాగే ఉంటుందేమో
ఈ పీడకలలు ఇలానే నన్ను వెంటాడుతూ ఉంటాయేమో,
ఆ చీకటి వక్రరూపం నన్ను పగబట్టే ఉంటుందేమో అని.
భయం నన్ను అవిటివాడ్ని చేసి,
చూసే కళ్ళకు .... నేను
శూన్యం లోకి పిచ్చిచూపులు చూస్తున్న పిచ్చి వాడ్నై.
అదే భావన, అదే భయం నాలో ఇంకిపోయి,
ఈ పీడకల .... ఏ జన్మ పాపమో! ఏ పాప పరిణామమో కదా!

2 comments:

  1. మాస్టారూ, ఆ రాకాసికి సాద్యం కాదు, మిమ్మల్ని లాక్కెళ్ళటానికి, మీ ప్రశాంతమిన వాక్కూ, నిర్మలమైన నవ్వూ దాని మనస్సు కూడా మానవత్వంతో నింపేస్తాయి.

    ReplyDelete
  2. మీరనుకున్నట్లు ప్రశాంతమైన వాక్కూ, నిర్మలమైన నవ్వూ, రాక్షసి ల మనస్సు కూడా మానవత్వంతో నింపే సంగతి ఏమో కాని ఒక చిన్న విన్నపం .... ఒరిజినల్ గా ఈ "ఏ జన్మ పాపమో .... ఈ పీడకల" ఒక మగవాడి మనోభావన కాదు. ఇది ఒక స్త్రీ మనోభావన.

    ఆ చీకటి రూపం నన్ను పగబట్టే ఉంటుందేమో .... భయం నన్ను అవిటిదాన్ని చేసి, చూసే కళ్ళకు నేను శూన్యం లోకి పిచ్చిచూపులు చూస్తున్న పిచ్చి దాన్నిలా .... ఈ పీడకల, ఇది ఏ జన్మ పాపమో! ఏ పాప పరిణామమో కదా! అని రాసుకుందే మగవాడ్ని కదా పురుషపక్షపాతం గా అలా మార్చడం జరిగింది.

    ధన్యవాదాలు ఫాతిమా గారు!

    ReplyDelete