ఆమె చుట్టూ చీకటి. ఆమెలో లోలో
ఏవో వంకరటింకరి, నులిపురుగులు, పొడుగాటి మీసాలతో
పీకల దాకా ఎక్కిన మత్తు .... డోక్కుంటూ,
మనసిచ్చి మనువాడిన చోట అతనెందుకలా ....?
సమాధానంలేని అన్వేషక ప్రశ్న,
ఎన్నో దుఃఖకర భావనల్లో ఒక భావన.
కలలో కూడా పిచ్చి పిచ్చి అరుపులు, ఏవో పొలి కేకలు
మనిషి చర్మాన్ని పోలిన ఒక విధమైన గుడ్డ ను ముసుగులా ....
భయం, అసహ్యం, దౌర్భాగ్య తాండవం చేస్తూ,
రెండు చేతుల్లో సరిగా పట్టుకోలేకపోయిన కక్కును మెల్లగా ఊడ్చి, శుభ్రపరుస్తూ
పరస్పర విరుద్ధమైన పొసగని వాద్యం కీచు కీచుమని భూమిని రాసుకుంటున్న ధ్వనుల్ని వింటూ
ఆ జిగట, ఆ బంధనంలో జారుతూ జీవితం అంచుల్ని
వేళ్ళతో, తాఁకుతూ .... కుళ్ళిన గాయాన్ని గీకుతున్నట్లు
ఓ ఇల్లాలి అణగద్రొక్కబడిన ఆలోచనలు అరవలేని అరుపులు, ఆర్తనాదాల్లా
నరకం, అగాధం, సముద్రగర్భం లోతుల వరకూ వ్యాపిస్తూ .... ఇంకా ఏమీ పట్టనట్లు ఆ కాలచక్రం.
No comments:
Post a Comment