Wednesday, September 18, 2013

ఒక ఘనమైన ప్రేమ



అప్పటికి ఎంతసేపయ్యిందో ....?
ఒంటరిగా నేను చీకట్లో
నా ఎదురుగా వచ్చి నిలబడి నీవు ....
నన్ను తట్టాకే వాస్తవం లోకి తిరిగి వొచ్చింది.
ఎంత అందంగా దోచుకున్నావో మనసు
నీకిదే నా వందనములు ప్రియా!

ఒత్తిడి తట్టుకోవాల్సిన
తొలి దశ లొ
ఒక తోడు లా వచ్చావు.
నీ ప్రేమను వ్యక్తం చేసి
నాకు జీవితం పై విశ్వాసం కలిగించావు.

నిజం చెప్పు ప్రియా!
ఘనమైన నీ ప్రేమకు నేను అర్హుడ్నా!
వృత్తిపరంగా నీవూ నేనూ వేరువేరు.
వేరు ప్రాంతం ఉద్యోగులం .... దూరంగానే ఉంటున్నాము.
ఒకవేళ కలిసి ఉండేందుకు సిద్దపడితే ....
ఇరువురము ఎన్నో కోల్పోవాల్సొస్తుంది.

నాకింకా గుర్తుంది.
నీవు నా కళ్ళలోకి తదేకంగా చూస్తూ అన్నావు ఆనాడు.
ఏ ఐశ్వర్యమూ, ఏ బంగారమూ
ఈ భూమి, చివరికి ఈ జీవితం .... కోల్పోవడానికైనా నేను సిద్దం అని,
నీవు చేతిలో చెయ్యేసి గట్టిగా పట్టుకుని
నా తోడుంటాననే .... నీ ప్రేమే నాకు ముఖ్యం అని.

నేనూ అంతే నేస్తం!
నాకు తెలిసిన ఒకే ఒక ఆనందం
నిన్ను పొంది కౌగిలిలో బంధించి ముద్దాడటంలోనే.
నీవు తోడుగా నా పక్కన ఉంటే ....
ఏ ఐశ్వర్యమూ పొందలేకపోయిన బాధ నాలో ఉండదు.
నీవేలేని నాడు నాలో ప్రేమ లేదు .... నా ప్రేమ నువ్వే కనుక.

ఓ ప్రేమదేవతా!
నిన్ను నా కోసమే ఆ బ్రహ్మ సృష్టించాడనుకుంటున్నా!!
నాకు సంపూర్ణత్వం కలిగించడం కోసమే నా జీవితంలోకి వచ్చావని 
నా హృదయానికి నీవు ఒక మెరెసే కవచానివి అని అనుకుంటున్నా!
పరిపూర్ణత్వం కోసం .... ఆ విధి కోసం మనం
ఎప్పటికీ ఒక్కరిమై ఈ ప్రేమను పోషించుకుందాం .... పరిమళించుకుందాం!

No comments:

Post a Comment