Wednesday, June 18, 2014

పరిత్రాణం




బాధతో, క్రుళ్ళి క్రుళ్ళి ఏడుస్తున్న
ఒక బాధాతప్త హృదయాన్ని
గమనిస్తున్నావు .... తెలుసా!?
నెమ్మదిగా, నిశ్శబ్దంగా నిరాశతో
మరణానికి సమీపంగా జరుగుతూ
కోరుకున్న దేన్నీ
పొందలేక పోయాననే ఆవేదన
రక్త సాంద్రత నియంత్రణ కోల్పోయి
ఆ సున్నిత కవాటాల
సిరలు దమనులు పోటెక్కి

బచ్చలి పండు రంగు లా
కమిలిపోయి
కన్నీళ్ళు కురుస్తూ .... హృదయం నుంచి
రాలుతున్న ప్రతి బొట్టూ
కండరాలను కంపింప చేస్తూ
ప్రతి కంపన
అలజడి ద్వని తో
బలహీనపడి,
నీరసపడిన ఆత్మ
కాలం తో పరుగెట్టలేని
ఓడిపోయిన పాత గడియారం యంత్రం 




రక్త కణాల పోరాటం
శరీర అవయవ
చివరి శాఖ వరకూ
వెళ్ళి రావాలనే ప్రయత్న వైఫల్యం
శరీరమంతా మొద్దుభారిన
అవ్యవస్థత
గతాన్ని వెదుకులాడి,
చరిత్రలోకి తొంగి చూసి
ఎలాంటి పునరావృతతను
గమనించలేని
మనో అంతర్నయనాల దుస్థితి

నా శ్వాసే
నా రక్తాన్ని
విషమయం చేస్తుందేమో
అన్న భయానక భావన
ఏ అమృతం ఉందో
నీ స్పర్శలో అని
అర్ధం చేసుకునే విఫల ప్రయత్నం
ఆలోచన ....
నీ, నా ప్రేమలో
ఇంత మహత్తు
ఎలా ఉందో అని తెలియక 




నీ సంరక్షణ, సాన్నిహిత్యంలోనే
ఇంత పరిపూర్ణత్వం
ప్రకృతి, పంచభూతాలు ఒక్కటై
"ఒకరికోసం ఒకరు పుట్టారు. మీరు
ప్రేయసీ ప్రియులు!"
అన్నట్లు, అనిపించడం,
వినిపించడం కలేమోనని
ప్రియా నీవైనా తెలియపర్చవా?
నేను నేనుగా ఉన్నప్పుడు
ఆ అసంపూర్ణత ఎందుకనో?

2 comments:

  1. అసంపూర్ణ భావన మనో నిర్ణయాల పరితాపం,
    ఇలాంటి భావనలు , సున్నిత మనస్కులకే సాద్యం,
    కవిత చదువుతుంటే ఓ విదమైన వైరాగ్యం అనిపిస్తుంది, ఆత్మ విమర్శా కనిపిస్తుంది,
    చాలా,చాలా బాగుంది సర్.

    ReplyDelete
    Replies

    1. అసంపూర్ణ భావన మనో నిర్ణయాల పరితాపం,
      ఇలాంటి భావనలు, సున్నిత మనస్కులకే సాద్యం,

      కవిత చదువుతుంటే .... ఓ విదమైన వైరాగ్యం అనిపిస్తుంది, ఆత్మ విమర్శా కనిపిస్తుంది, చాలా,చాలా బాగుంది సర్.

      చాలా చాలా బాగుంది పరిశీలన ప్రశంస అనుభూతి స్పందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు!

      Delete