నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో,
నా ఇష్టాన్ని ... మనసు భావాల్ని
చెప్పలేను పదాల్లో!
పలుకరింపుల్నీ, పులకరింపుల్నీ,
ఆనందాన్నీ, అనుబంధాన్నీ ... దాచుకుంది నీకోసమే అని
నా జీవితం ... బలహీన క్షణాల్లో,
మనుగడ కోసం తప్పని ...కాలంతో పరుగుపందెంలో,
సమశ్యల ఊబిలో కూరుకుపోయి, కదలలేక ... నీరసపడ్డప్పుడు
చెయ్యందించడానికి, ధైర్యం పంచడానికి ...
నీవూ నాతో ఉన్నావని వెన్నుతట్టే ప్రేరణవై సహకరిస్తున్నప్పుడు
నిద్దుర సేదదీరిన ... అరుణరాగం వేళ
జీవనావసరాల వేటలో అప్పుడప్పుడూ దొరికే విరామ వేళ
అనిశ్చితాల సుడిలో సతమత మయ్యే వేళ
మళ్ళీ విశ్రమించే చీకట్లు ముసిరిన వేళ
నా మదిలో ఆలోచనల్లో చైతన్యానివి నీవే
ఎదురుగా నీవు లేవని తెలుసు ... కానీ,
నా ఊహల్లో నీ రూపం చిత్రించుకుంటాను
ఎంతో సుందరమైన నీ చిరునవ్వును ... నా బలంగా
నాగరికంగా నిన్ను సుతారంగా స్పర్శించినట్లు
కౌగిలించుకున్నట్లు భావనల్లో మునుగుతూ ఉంటాను.
నా ప్రతి ఊహను అల్లరి ఆలోచనలను
ప్రేమావేశపు సరస భావనలను
పశ్చాత్తాపముతో విన్నపం లా కాకుండా,
అమూల్య సంపదలా ... నీతో పంచుకోవాలని ఉంటుంది
ఎందుకంటే,
నీవెప్పుడూ నా పక్షం నుంచే చూస్తున్నట్లుటుంది కనుక
అప్పుడప్పుడూ ఆ దైవానికి, ఈ ప్రకృతికి
నీ కన్నతల్లికి, సమాజానికీ
చెప్పుకోవాలనుంటుంది కృతజ్ఞతలు
నా సహచరిగా ... అమూల్యమైన ప్రేమసంపదను
నిన్ను పొందగలిగినందుకు ...
అందుకే,
నా మనసు భావం నిజం, వాస్తవం చెబుతున్నాను
నీవే నా జీవన బృందావనం రాధికవు హృదయ రాగానివి అని
No comments:
Post a Comment