సాయంత్రం కదిలి
చాప కింద నీరులా
చీకట్లు ముసురుతూ
చిత్రమైన భావనల
సామ్రాజ్యం ఆరంభమౌతుంది!
అక్కడ ...
మూసే నా కనురెప్పల
తలపుల వార్డ్ రోబ్ లో
హాంగర్స్ కు వేలాడుతూ
పక్కపక్కనే మనిద్దరం
అక్కడ ...
తెలిసీ తెలియని తనంలో
తప్పటడుగులు వేస్తే
అమాయకంగా మోసపోతే
సరిదిద్దడానికి
ధైర్యం ఆసరా గా నీవుంటావు.
అక్కడ ...
జీవితం అనుభవాలు
భరించలేని బాధలై
పుండై సలుపుతుంటే
శరీరం స్థిమిత పడలేకపోతున్నప్పుడు
ఓదార్పుగా నీవుంటావు.
అక్కడ ...
ప్రకృతి అందాన్ని,
ఎగిరే పక్షుల్నీ చూసి
నేను పరవశిస్తున్నప్పుడు
నా ఆనందం పంచుకోవడానికి
నా ప్రతి చిలిపిచేష్టల్ని
స్వాగతిస్తానికి నీవుంటావు.
అక్కడ ...
నా కలల
ఆదిమధ్యం వరకూ
ఉల్లాసంగా నాతో
ఆడుతూ పాడుతూ ... నీవుంటావు
అమూల్యమైన మధుర గడియల్ని పేరుస్తూ,
అప్పుడు ...
తూరుపు కొండల్లో
చైతన్యం అరుణరాగమై
ప్రపంచం నిద్దుర లేస్తుంది ...
మరోరోజు మరో ఆకలి పోరాటం
మనుగడ కోసం ఆరంభం అవుతుంది
అప్పుడు ...
నా తలపుల తలుపులు మూసుకుపోతాయి
నా కళ్ళల్లో వెలుగు విచ్చుకుంటుంది
నీవు నన్నొదిలి వెళ్ళిపోతావు
నిద్దురను నిన్నూ కోల్పోయి లేస్తాను
నా బాహువుల్లో నీవుండవు!
మరోసారి
మరో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కావాలి ...
నిన్ను చూడ్డానికి
నా ఊహల రాణి ... నీతో
నా ఆనందం ఆరంభం కావడానికి
No comments:
Post a Comment