Monday, October 22, 2012

శరీరం ఆత్మ


ఎందుకో తెలియదు ... ప్రేమ ఎక్కువయ్యో ఏమో
పొంగి పొర్లుతుంటుంది అప్పుడప్పుడూ
ఎదురెదురుగా నిలబడి మధ్యమధ్యలో టాంక్ బండ్ లోకి చూస్తూ
దెప్పుడు బాష ... వాదులాటలు
నేను స్త్రీ జాతిపై, తను పురుష జాతిపై విసురుకుంటాము విసుర్లు
కాసింత మౌన విరామం తరువాత కూర్చుండిపోతాము పక్కపక్కనే
అవునూ ... ఈ కసి, ద్వేషం ఆవిర్లెందుకు నన్ను దహిస్తున్నాయీ అని

నా కసి ఆవేదనంతా ... నేను ఆమెను అతిగా ప్రేమిస్తున్నానని
అతిగా అవసరాన్ని మించి ... ఆమె గురించి ఆలోచిస్తున్నానని
ఎంతో అపురూపమైన అనుబంధం ... మాదని
ఆమె అర్ధం చేసుకోవడం లేదని ... కోపం
అప్పుడప్పుడూ ఆమె ప్రతిస్పందన తెలిసీ ... ఆమె వైపు చూస్తాను
ముఖ భావాలను చూడాలని ... నొచ్చుకుంటుంటే నా విసుర్లు
సూటిగా తగిలాయని తెలుసుకునేందుకు ... కానీ ఆమె ఉండదు

నాకే కాదు ఆమెకూ తెలుసు ... ఒక్క క్షణం కూడా
ప్రేమతోనే పోట్లాడుతూనో మాటలు ఆడకుండా ఉండలేను అని
ప్రతి రోజూ మెలుకువలో ఉన్నా ... ఆమె మందలింపు
గోరు వెచ్చని తేనీటి కోసం ... ఎదురుచూస్తుంటాను అని
ఆమె దెప్పుతున్నప్పుడు, రోషంతో పోట్లాడుతున్నప్పుడు
అష్టవంకర్లు తిరిగే ఆమె ముఖం ... నాకెంతో ఇష్టం అని
ఆమెతో ఆటో తగవో ... మాటలు లేకుండా నేనుండలేను అని

అనుమానం వస్తుంటుంది అప్పుడప్పుడూ ఆమె కూడా
నాలాగా నన్ను ప్రేమిస్తుందా అని ... ఆ కళ్ళలోకి చూస్తాను ...
నాకంటే స్వచ్చమైన ప్రేమ నాపై ఆమెకున్నట్లు ఆ కళ్ళలో కనిపిస్తుంది
ఎప్పుడైనా అతిగా హద్దులు దాటి మాట్లాడినప్పుడు
అవసరాన్ని మించి చొరవ తీసుకుని పేట్రేగి పోయినప్పుడు
ఆ కళ్ళలొ కోపం బదులు జాలినే చూసా ... మన్నించు అని ...
మరెప్పుడూ అలా ప్రవర్తించను అని ...
పోట్లాటలొద్దు ఇక మనకు అని ... అనాలనిపిస్తుంది

ఎందరో సాహచరిని బానిసలా చూసే ప్రబుద్దుల్ని చూసా ఈ సమాజంలో
బాధే ఐనా వాస్తవం ... ఆ లక్షణాలు నాలో కలిగే అవకాశం లేకపోయినా
ఆలోచించను కాడా లేను ... నా ప్రేమకు నా సహచరికి ... ఆ అవస్థను
నా సంబంధం నా స్త్రీతో ... అర్ధ శరీరం, గుండెలో స్థానం ... అనుకోను
నేనే ఆమె అనుకుంటాను ... నేనూ నా అంతరాత్మ అనుకుంటాను
పరిపూర్ణత్వం ... ప్రాణమున్నంతవరకూ విడదీయలేని
శరీరం ఆత్మ సంబంధం ... మా అనుబంధం అనుకుంటాను!

No comments:

Post a Comment