Friday, November 27, 2015

గుర్తున్నానా మానసీ



నీతో కలిసున్నప్పట్నుంచి చూస్తే 
ఎన్ని యేళ్ళు గడిచాయో నేటికి 
ఎప్పుడూ 
నా హృది లో 
నా ఆలొచనల్లోనే ఉండే నిన్ను 

ఆలోచిస్తుంటే అనిపిస్తుంది. 
ఆశ్చర్యంవేస్తుంది. 
అప్పుడప్పుడూ 
నాలానే నీవూనా అని 
నన్ను గురించే ఆలోచిస్తుంటావా అని 

నిజం మానసీ ఎంత ఆశ్చర్యమో 
ఎంత వింత సందేహమో 
నిజంగా నీవు
నన్ను తలచుకుంటుంటావా అని 
లేక నీ ఆలోచనల్లో 
నేనో మరిచిపోయిన చరిత్రనా అని 

ప్రతిరాత్రీ నిదురించుతూ నిన్నే 
కంటూ ఉంటాను .... కలలో 
ఒకప్పటి మసకేసిపోయిన 
అలికేసినట్లున్న
మన మధురజ్ఞాపకాలను స్పర్శిస్తూ.


నిద్దుర లేచి పక్కన నువ్వులేవే అని 
దిగాలుపడుతూ ఉంటాను. ఆశ్చర్యపడుతూ ఉంటాను. 
మానసి ....నువ్వెప్పుడైనా కల కంటుంటావా నన్నని
నీ కలల నెలరేడునా .... లేక 
ఏ చెరిపేసుకున్న జ్ఞాపకాన్నా అని 

గడియలు, రోజులు .... వత్సరాలెన్ని గడిచినా
నీ, నా జ్ఞాపకాలు మాత్రం 
అలానే నాతోనే పల్లవిస్తూ 
పరిమళిస్తూ కొన్ని మసకేసిపోతూ 
కాలం చెరపలేని మార్చలేని అనుభూతులౌతూ 

అప్పుడప్పుడూ నిన్ను గురించే ఆనుకుంటాను. 
ఎన్నిసార్లో అలా .... మానసీ 
ఆశ్చర్యపోతూ ఉండటం .
నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను .... నీవూనా అని 
ఎప్పుడైనా ఆలోచిస్తావా నన్నను ఆకాంక్షతో

No comments:

Post a Comment