Friday, December 11, 2015

నువ్వుంటే చాలు .... తోడు



ఒంటరితనం ఎప్పుడూ నా నేస్తమే అయినా 
ఈ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాను 
ఎందరో అన్నారు. ఇంకా అనుకుంటున్నారు. 
పిచ్చోడు అని 
అంధుఁడు అని 
నీ చూపు కోసం అన్నీ ఒదులుకున్నాను అని 
నేనెలా అంధుఁడినో అనేదో తర్కనీయాంశం

ఒక్కటి మాత్రం నిజం 
నిజంగా నేను తప్పు చేస్తున్నాననుకుని 
ప్రయత్నించినా 
నా మదిలోంచి నిన్ను తీసెయ్యలేను. 
ఒక్క నీ తోడు చాలు 
సభ్య సమాజాన్నీ సర్వాన్నీ 
అలక్ష్యం చెయ్యగలనేమో కానీ నిన్ను కాదు

నీవు ఎవరివో నీ చరిత్ర ఏమిటో 
ఎక్కడినుంచి వచ్చావో 
ఏమి చేస్తుంటావో 
తెలుసుకోవాలనే కోరిక 
పట్టింపు లేదు 
కేవలం నన్ను నన్నుగా నీవు ప్రేమించితే చాలు 

నీ ప్రతి మాటలో నీ ప్రతి ఆచరణలోని 
ప్రతి చిన్న విషయమూ 
నా అంతరంగం లో నా ఆలోచనలానే అనిపిస్తూ
మనం ఒకరొకరి కోసమే పుట్టామనే నా మనోభావన
ఇన్నాళ్ళూ దాచాను కానీ .... ఇప్పుడు 
నా కళ్ళలోకి నీవు సూటిగా చూసినప్పుడు. 
నా ప్రవర్తనలో బయటపడటం నాకే తెలిసిపోతుంది. 

No comments:

Post a Comment