Sunday, March 24, 2013

నాకు నచ్చిన బహుమానం .... ఆమె



ఆమె ఆమెలానే ఎప్పుడూ ఒక్కలాగానే .... గుండెతో చూస్తే మాత్రం
ఆ దివినుంచి దిగి వచ్చిన కాలాతీత సౌందర్యం ఆమె!
ఆమె నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి నేను పొందింది
ఒక భాగస్వామి ని మాత్రమే కాదు నేనో విశ్వవిజేతననే భావనను.

మా సాహచర్యంలో ఆమె త్యాగమూర్తి. ఆమెను ఆమె సమర్పించుకుంది.
అందమైన ఇద్దరు ఆడకూతుళ్ళను .... గొప్ప అభిమానాన్ని ఇచ్చింది.
కోపంతో నేనెప్పుడైనా గుడ్డివాడినైనప్పుడు .... సహనంతో ఆమె నా కళ్ళు తెరిచేది.
జీవన ప్రాముఖ్యతల్ని సామాజిక పరిమితుల్నీ నాతో కలిసి సమాలోచన చేసేది.

ఆమె తోడులో పొందిన ఎన్నో అమూల్యానుభవాలు నాతోనే ఉన్నాయి
ఎల్లప్పుడూ ఏ సమశ్యనైనా ఎదుర్కునె సంసిద్ధతే సాక్ష్యం గా 
బంగారం వజ్ర వైడూర్యాల్ని మించిన అవగాహన సాహచర్యం మాది
ఆమె పంచి ఇచ్చిన అనుభూతులు ఎప్పుడూ నా గుండెను స్పర్శిస్తూనే ఉంటాయి.

ఆమె లేని నేను .... ఇప్పుడు ఎలా ఉండేవాడినో ఊహించాలని లేదు.
ఎక్కడ ఏమై పోయేవాడినో ఆలోచించనూలేను. కానీ,
నిస్సందేహంగా ఆమె నాకు నేను ఆశించని ఎన్నో ఇచ్చిందని చెప్పగలను.
అమూల్యమైన ఆమె ప్రేమ .... ఆమె సమర్పణాభావమే నేను, నా జీవితం!

భూమ్మీద పుట్టిన ప్రతి జీవికీ తెలిసిన నిజం ఒకటుంది.
ప్రకృతిలో పరిసరాల్లో పంచభూతాల్లో ప్రతి చోటా కనపడే వాస్తవం .... ప్రేమ
మనం, మన అస్తిత్వం .... ప్రేమ! .... ప్రేమే మనం మనమే ప్రేమ అని అర్ధం
అదే ఆ అమరత్వం .... ఆ లక్షణమే .... నా భాగస్వామి నాకు ఇచ్చిన బహుమానం.

2013, మార్చ్ 24, ఆదివారం సాయంత్రం 8.00 గంటలు

No comments:

Post a Comment