Saturday, March 30, 2013

పదాలు కత్తులు



చవక ఉక్కు,
పదును కత్తులు ....
పదాలు.
కలం కక్కుతూ అక్షరాలు
మైక్ లో త్రుళ్ళిన ఉపన్యాసాలు
లోతు గాయం చేస్తూ
నిజాలు
ఎప్పటికైనా వెలికి వొస్తాయి.
అసహ్యకర
అవినీతి చర్యలు
నిజాయితీ కళ్ళు కప్పలేవు

కసి, కోపం


ఊహించనిది వినాల్సొస్తుందని
అంతరంగం అలజడి
స్థిరబుద్ధిలేని స్థితి
భయం మరో రూపం .... కోపం, కసి
అప్పుడే .... చిరాకు, అసహనం, కసి,  కోపం
నా శత్రువు లా
నా స్నేహితుడు లా
నన్ను చంపేస్తూ
నన్ను రక్షిస్తూ
అదే సహాయకారి ఔతూ
నా ఇష్తం నా ప్రేమ నీడలై
కోపం, కసి నా వడివడి అడుగుల కసరత్తు

Thursday, March 28, 2013

పోగొట్టుకొన్నా!



పోగొట్టుకొన్నా
జీవనానందం మార్గం
పశ్చాత్తాపం,
గతం వెతలు.
భయం నీడలు,
వెలుగును చూసి ఎన్నాళ్ళయ్యిందో ....
చీకటి నన్నొదలడం లేదు.
అన్నీ కోల్పోయాను.
ఆనందం, అవకాశం .... ఆరోహణ.
పడిపోతున్న భావనలే అన్నీ.
ఆత్మ న్యూనతాభావం నిలువెల్లా నాలో లో లో
చనిపొమ్మంటూ,
మరొక కొత్త ప్రారంభానికి అని ....

Wednesday, March 27, 2013

నిన్నిష్టపడ్డాను .... కానీ



నిన్ను ప్రేమించాను .... నిజం
కానీ,
నేను నేరస్తుండ్ని .... ఎన్నో నేరాలు చేసాను.
ప్రేమలో మాత్రమే నిజాయితీగా ఉన్నా
ఎవరో ఉన్మాది చేతిలో కీలుబొమ్మ .... నా గతం

విధ్వంసం మరిచిపోవాలనుంది.

నా మనస్సాక్షి ముందు నేను,
నా నేరాన్ని అంగీకరిస్తున్నాను.
నా ప్రేమ ఎండు చెరుకు
మండే గుణం,
నా ప్రేమ నివురు కప్పిన నిప్పు 
నీ జీవితం కాలొద్దని ....
నీ భవిష్యత్తు బాధామయం
శాపగ్రస్థ సంసారం .... కారాదని,
న్యాయస్థానానికి
నన్ను అప్పగించుకుంటున్నాను.

ఏదో అసూయ ప్రేమ దృష్టిలో ....
నాలో దుర్బలత లా
ఇంత నాజూగ్గా నిజాయితీగా ప్రేమిస్తూ
నిన్నొదులుకోవడం
నేరాన్నొప్పుకుని జైలు శిక్ష కోరుకోవడం
తియ్యని బాధ నా నరాల్ని పిండేస్తూ,

అయినా తప్పదు!
నేరానికి ప్రతిక్రియ శిక్ష .... సామాజిక న్యాయం.
అందుకే,
వినమ్రంగా నా మనోభావాల్ని చెబుతున్నా!
ఓ నా పసితనపు ప్రాణమా!
నీ కోసం నేను ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.
నాకంటే యోగ్యుడ్ని నిన్ను ప్రేమించేలా వరమివ్వూ అని,

Tuesday, March 26, 2013

సమాంతర భావాలు


వినిపిస్తూ ఉన్నాయి ఇంకా నా చెవిలో
నీవు అన్న మాటలు
నా గుండెలో లోతుగా దిగి
దిగుడుబావిలో ఆశగా చూస్తున్న నాపై రాళ్ళ వర్షంలా

నేను నిన్ను ప్రేమించాను.
నీవూ నన్ను ప్రేమించావనుకున్నాను.
అవగాహన లొపం రావొచ్చనే
ఎప్పుడూ నీ పక్కనే ఉంటున్నాను.

నాకు విషాద భరిత గీతాలు ఇష్టం
నీ నృత్యం లో లయలా అవే వింటూ ఉండేవాడ్ని మళ్ళీ మళ్ళీ
ఎప్పుడూ ఆ విచారం పాటలేనా అనేదానివి
అందులో ఆర్ధ్రత, క్రమబద్దత నాకు ఎంతో ఇష్టం అనేవాడ్ని

ఇప్పుడు నా సమయం వచ్చింది
నా ఇష్టం నాకు అనుభవం కాబోతుంది
చాలా సేపు మౌనంగా కుర్చున్నాక
నీవు మాట్లాడావు మన సమయం వచ్చింది అని

ఇప్పుడు మనం విడిపోక తప్పదు అన్నావు.
విడిపోవడం
నాకు నీమీద ప్రేమ లేక కాదు
నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అన్నావు.

నా దృష్టిలో ప్రేమ ఒక్కటే జీవితం కాదు
నా జీవిత గమ్యం పేరు, ప్రశంస .... ప్రతిష్టలు
దేశ దేశాల్నుంచి ఆహ్వానాలు వొచ్చాయి
స్పాన్సర్స్ ఉన్నారు. నాకు బ్రేక్ దొరికింది .... అన్నావు

నా ప్రేమ, నా లక్ష్యం నీవే అనాలనుకున్నా
ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది.
నటరాణిలా నిన్ను పూజిస్తా అనలేని మౌనం గరళమయ్యింది.
ఇకపై, నాకెంతో ప్రీతిపాత్రమైన పాత విషాధగీతాలే .... నా ప్రియ నేస్తాలు.

Monday, March 25, 2013

ఐ సి యు లో నేను


హరిచ్చంద్రుడే ఆదర్శం అనేంతవాడ్ని కాను.
సందర్భోచితంగా మాట్లాడలేను.
అబద్దాలు ఆడటం చేతకాదు.
నా నడవడిక నాలో మార్పు
నేననే మార్కు ఏర్పర్చుకునే ప్రయత్నం లొ
ఎవరినో అనుసరించిన నా బ్రతుకు
అబద్దాల మయం అని తెలిసి
నాలో ఏదో వ్యాకులత ఏదో ఉద్వేగం
లోలోపల నేను చచ్చిపోయాను.
నన్ను నేను గాయపర్చుకున్నాను.
వ్యాకులత, కపటత్వం నీడకూడా పడొద్దనుకునే
నాకు కనిపించిన ఏకైక మార్గం మరణం!
నేను గాయపడి రక్తంలో ఫ్లోర్ మీద పడున్నాను.
నా కన్నతల్లి దీనంగా
కనిపించిన దేవుళ్ళందర్నీ మొక్కుకుంటుంది.
నా బిడ్డ బదులు .... నాకు మరణం రావాలని,
ఆసుపత్రి ఐ సి యు మంచం మీద
మరణిస్తూ నేను
ఐ సి యు గది ఆవల
నా బందువులు నా రక్త సంబంధీకులు
ఏడుపులు .... లీలగా వినిపిస్తున్నాయి.
అక్కడే నేనికలేననే ఎడబాటు బాధను
బలవంతంగా అదిమేసుకుంటూ కొందరు.
వెర్రిదానిలా బీప్ బీప్ అంటూ అరుస్తూ
నా మంచం పక్కన మెషిన్ ....
అది చెప్పాలనుకుంటున్న నిజం
నేను మరణించాను అని,
జీవించడం చేతకాని అల్పుని కోసం
బాధను దిగమింగుకోవడాలూ
ఇన్ని ఏడుపులూ అవసరమా!
అబద్దాలాడి బ్రతగ్గలిగి
మంచి పేరును తమదైన మార్క్ ను
ప్రతిష్టాపించగల జీవులందరూ
సంతోషం ఆనందంగా ఉండాలని నా చివరి కోరిక!

మార్పు



కాలం అలానే సాగుతూనే ఉన్నా .... ప్రతిదీ మారిపోతూనే ఉంది.
పసితనానికి దూరంగా జరుగుతూ .... పోరాడుతూ 
ఎక్కువ భాగం అబద్దాలు
భవిష్యత్తును చంపుకుంటున్నాము
గతాన్ని మర్చిపోయే ప్రయత్నాలు 
గుర్తురాని మధురస్మృతుల్ని గుర్తుతెచ్చుకోవాలని వెదుకులాటలు
మదిని అలర్ట్ లా ఎప్పుడూ తట్టుతూ భయపెట్టే
చెడు జ్ఞాపకాలు మరిచిపోవాలని విఫల ప్రయత్నాలు
మనిషి చర్మం పై రేజర్ బ్లేడ్ పెట్టి కోసి కారం పెట్టినట్లు
అతి పెద్ద పాపం నీడలా అతన్ని వెంటాడుతున్నట్లు
ఎన్ని మతాలు ఎన్నెన్ని నమ్మకాలో
ఎన్ని మార్గాలూ ఎన్ని జీవన విధానాలో
సహనం సహజీవనం సాగిస్తున్న మనుగడలో
రాబోతుందనుకునే మార్పు .... ఓ అందమైన రేపు

అరగౌనులో వేశ్య



తిని విసిరేసిన విస్తరాకు
చిరిగిపోయిన బట్టలు ఆచ్చాదనం
ఆకలి రూపం అరలాగు అరగౌను
ఆబ ....
అసహ్యంగా చూసి తల పక్కకు తిప్పుకోవడం

మున్సిపాలిటీ చెత్త కంపు కొడుతుందని
చీదరించుకుని దూరంగా జరగే ప్రయత్నం ....
కేవలం దూరంగా .... జరగడం కోసం
రెండు రూపాయల దానం
చిరిగిన అరగౌనులో వేశ్యను మాత్రమే చూసే కళ్ళు

షుగరు బీపీ మాత్రల ఉపాహారం
పెన్షన్ డబ్బుల్తో శ్వాస ....
సహచరిని కోల్పోయి, పిల్లలు వొదిలేసిన
ముసలితనం .... చెల్లాచెదురైన ఒంటరితనం
సమాజం కోసం మాత్రమే పలుకరించే రక్తబంధాలు

బ్రతికి చేసేదేముంది అని .... ముసలి జంటను అనారోగ్యం
పన్నుల బారం .... పసితనం ముసలితనమయ్యే ప్రజాస్వామ్యం 
ప్రయాణంలోనూ భద్రతలేని మహిళలు
నిందలతో ఆరంభం ఉదయం
పిల్లల్లేని తండ్రి పిల్లలకోసం ఆస్తులు .... అవినీతి అక్రమాలు 

ఇంతకూ
మంచితనం
సౌహార్దం, సహృద్బావం
దయ, ప్రేమ, సహనం .... అర్ధం తెలుసుకుని
ఏం చేద్దామని

2013, జనవరి 25, ఉదయం 6.00 గంటలు

మచ్చలు



నా చేతి మీద మచ్చలు
చూస్తున్నావు
నా గుండె లో మచ్చలు
పోల్చి చూడు
నీవే అంటావు
ఈ చేతి మచ్చలు సామాన్యమని

పడిపోతున్నా



నేను నీ ముఖం చూసాను
సూర్యోదయ సమయం వెచ్చని ఉషా కిరణాలు
నా శరీరమంతా వెండిలా ప్రకాశవంతమైన భావన
ఉల్లాసం ఉత్సాహం ఉరకలేస్తూ .... చైతన్యం నాలో
కానీ
"బై" అని చెబుతూ
నీవు వెళ్ళిపోయిన క్షణం మాత్రం
సూర్యాస్తమం లా
చీకటి మబ్బులు కమ్ముకుని .... వేదన నా చుట్టూ
నీవు లేకుండానే .... ఆ నీడల్లో కి జారిపోతూ ఉన్నా నేను

Sunday, March 24, 2013

నాకు నచ్చిన బహుమానం .... ఆమె



ఆమె ఆమెలానే ఎప్పుడూ ఒక్కలాగానే .... గుండెతో చూస్తే మాత్రం
ఆ దివినుంచి దిగి వచ్చిన కాలాతీత సౌందర్యం ఆమె!
ఆమె నా జీవితంలోకి వచ్చిన క్షణం నుంచి నేను పొందింది
ఒక భాగస్వామి ని మాత్రమే కాదు నేనో విశ్వవిజేతననే భావనను.

మా సాహచర్యంలో ఆమె త్యాగమూర్తి. ఆమెను ఆమె సమర్పించుకుంది.
అందమైన ఇద్దరు ఆడకూతుళ్ళను .... గొప్ప అభిమానాన్ని ఇచ్చింది.
కోపంతో నేనెప్పుడైనా గుడ్డివాడినైనప్పుడు .... సహనంతో ఆమె నా కళ్ళు తెరిచేది.
జీవన ప్రాముఖ్యతల్ని సామాజిక పరిమితుల్నీ నాతో కలిసి సమాలోచన చేసేది.

ఆమె తోడులో పొందిన ఎన్నో అమూల్యానుభవాలు నాతోనే ఉన్నాయి
ఎల్లప్పుడూ ఏ సమశ్యనైనా ఎదుర్కునె సంసిద్ధతే సాక్ష్యం గా 
బంగారం వజ్ర వైడూర్యాల్ని మించిన అవగాహన సాహచర్యం మాది
ఆమె పంచి ఇచ్చిన అనుభూతులు ఎప్పుడూ నా గుండెను స్పర్శిస్తూనే ఉంటాయి.

ఆమె లేని నేను .... ఇప్పుడు ఎలా ఉండేవాడినో ఊహించాలని లేదు.
ఎక్కడ ఏమై పోయేవాడినో ఆలోచించనూలేను. కానీ,
నిస్సందేహంగా ఆమె నాకు నేను ఆశించని ఎన్నో ఇచ్చిందని చెప్పగలను.
అమూల్యమైన ఆమె ప్రేమ .... ఆమె సమర్పణాభావమే నేను, నా జీవితం!

భూమ్మీద పుట్టిన ప్రతి జీవికీ తెలిసిన నిజం ఒకటుంది.
ప్రకృతిలో పరిసరాల్లో పంచభూతాల్లో ప్రతి చోటా కనపడే వాస్తవం .... ప్రేమ
మనం, మన అస్తిత్వం .... ప్రేమ! .... ప్రేమే మనం మనమే ప్రేమ అని అర్ధం
అదే ఆ అమరత్వం .... ఆ లక్షణమే .... నా భాగస్వామి నాకు ఇచ్చిన బహుమానం.

2013, మార్చ్ 24, ఆదివారం సాయంత్రం 8.00 గంటలు

Saturday, March 23, 2013

అంతర్మదనం


పెద్దోడా కూలికొస్తావా! కూలితో పాటు బిర్యానీ పెట్టిస్తాను.
పిలుపు ఇంకా నా చెవుల్లో ప్రతిద్వనిస్తూనే ఉంది.
కళ్ళముందు మాత్రం .... కూలిపోతున్న భవన రాజం
రద్దీ ప్రాంతం .... ట్రాఫిక్ ను దారి మళ్ళించారు.
బలంగా ఉన్న యువకుల బృందం
సుత్తులు. బౌల్డర్స్, డ్రిల్ మిషిన్స్ తో
బలాన్ని ప్రయోగిస్తూ .... మధ్యమధ్యలో పెద్దగా అరుస్తూ
ఒకర్నొకరు ఉత్తేజ పర్చుకుంటున్నారు.
రోడ్ వైడెనింగ్ ప్రోగ్రాం లో భాగంగా ప్రభుత్వ ఆదేశం అది.
వారందరి బల ప్రదర్శన తో ఒక వైపు గోడ పడిపోయింది.

మామా .... దీన్ని కూల్చేసేందుకేగా రమ్మన్నావు.
నేను సిద్ద హస్తుడ్ని .... నిపుణుడ్ని కాను.
ఎలాంటి మెళుకువలూ తెలియవు.
కట్టడాలు కట్టేప్పుడు కూడా మేస్త్రీ చెప్పినట్లు పనిచేసేవాడ్ని!
మిగిలిన వాళ్ళందరికీ అనుభవం ఉన్నట్లుంది .... అన్నాను.
ఓ నవ్వు నవ్వాడు. సూపర్ వైజర్ మామ, పిచ్చోడా అన్నట్లు
పెద్దోడా! సామాన్యమైన ఎవరైనా .... పర్లేదు.
ఎలాంటి నిపుణత అక్కర్లేదు .... చెప్పినట్లు విని, పనిచేస్తే చాలు.
ఎంత పెద్ద బిల్డింగైనా, ఎంత బలమైన కట్టడాన్నైనా
కట్టేవాడికి ఏళ్ళు పట్టుండొచ్చు ....  నాకు మాత్రం
యంత్రంలా పనిచేసే వాళ్ళుంటే చాలు .... రెండు రోజుల్లో కూల్చేస్తా!

మామా! ఒంట్లో బాలేదు ఏమనుకోకే అన్నాను.
చిత్రం! డబ్బులొస్తాయనితెలిసీ .... ఎందుకీ పిచ్చి ఆలోచనలు.
ఇంతకూ నేను ఏం చెయ్యాలని ఒచ్చాను. ఎందుకు తిరిగెళ్ళిపోతున్నాను?
రమ్మంటే రావు అవకాశాఅని తెలుసు .... మరి దూరంగా ఎందుకు పారిపోతున్నాను?
ఎంతో సున్నితంగా జాగ్రత్తగా ప్రతి అంగుళమూ తమ ఇష్టానుసారంగా
నిర్మించే జీవనానుకూల నిర్మాణంలో భాగంగానే ఉండాలనా?
పెరిగిపోతున్న భూభారం మనిషి మూవ్మెంట్స్ కు సానుకూలంగా
రోడ్ వైడెనింగ్ చర్యల్లో శ్రమించడం అయిష్టం వల్లా? 
నిజంగా నాలో అంతర్మదనమా .... ఇన్ని విధాలుగా ఆలోచిస్తున్నానా?
మరి, ఈ రెండు పనులూ సామాజిక అవసరాలే అయితే,
నాలో ఎందుకు సంశయం .... నిర్మాణాత్మకంగానే జీవించమనే ఆదేశం.

ప్రియ రాక్షసి



ప్రేమనే కత్తి నా గొంతు మీద పెట్టావు
అంగీకరించడం సాధ్యం కాని నిజంలా
ఎప్పటికీ ఆ కత్తి అలానే ఉంటుందా అనుకుంటున్నంతలో
కత్తి బ్లేడ్ నొక్కడం మొదలెట్టావు
అంతా రక్తం
గుండెకు చిల్లు పడింది
కాలువై స్నానాల గది వరకూ
గచ్చుమీద
రక్తం పారబోసిన ఎర్ర రంగు మోడ్రన్ ఆర్ట్ లా
ప్రేమ, కత్తి మొన పదునుగా ఉంది ప్రియా!
నమ్మలేకపోతున్నాను.
నీవు హంతకివా .... అని,
కాదు కాదు .... నా ప్రియ రాక్షసివి.

ఒక చిరునవ్వు .... పిలుపు!



అద్భుతం! నొప్పి వెళ్లిపోయింది
గాయం మాయమైనట్లు
అరుదైన అనుభవం .... విశ్వసించలేని వాస్తవం
కలా నిజమా అని

నిజంగానే ఒక అప్సరస
ఒక దేవత
నన్నే పిలుస్తుంది
నేను దూరంగా జారిపోతున్నట్లు
మలుపు తిరిగి చూడలేక పోతున్నట్లు

ఇప్పుడు నాలో శూన్యత అనుభూతి
ఎవరో నన్ను చూసి నవ్వుతున్నట్లు
నా పేరే పిలుస్తున్నట్లు
నిశ్శబ్దానికి తెలుసు నా పేరన్నట్లు

Friday, March 22, 2013

జీవన న్యాయం!


నా హృదయ
స్పందనల లయ తెలుసు
కలల్లో విహరిస్తుంటానని తెలుసు .... నీకు.
ఎంత తిరిగినా
ఎంత శోధించినా
సప్త సముద్రాలు దాటి
ఖండాంతరన్నీ తిరగేసి చూసినా
మనసుకు స్థిమితం లేదు
నా కోరిక తీరడం లేదు
ఎందుకో
ఈ రాత్రి ఈ నగరం
అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది.
నా మనొభావాల్ని
నిజాల్ని వాస్తవాల్నే చెప్పాలనిపిస్తుంది. 
లేచి రా నగర వాసీ
కాసింత ప్రేమను పంచు!
నా పక్కన ఉన్నానని విశ్వాసం కలిగించు!
ప్రేమను ప్రేమించు
ప్రేమ కోసమే జీవిస్తున్న నన్ను ప్రేమించు!
నిష్కళంక ప్రేమ కోసం
తిరుగుతూ ఉన్నాను.
స్వార్దం ఉగ్రవాదం విషం చూస్తున్నాను.
సహనం, దయ, ప్రేమ
సాన్నిహిత్యం కోసం శోధిస్తూ ఉన్నాను.
నాలో
ఏనాడో కోల్పోయిన
నీ సోదరుడ్ని చూడు .... ఓ చిన్ని సోదరీ!
ఒంటరితనాన్ననుభవిస్తున్నాను.
ఓ నిండు మనిషినుంచి
సహజీవినుంచి
సహన మూర్తి ఎవరినుంచైనా
ప్రేమను పొందాలనుకుంటున్నాను.
లేచి రా తమ్ముడూ!
లేచి రా చెల్లెమ్మా!
లేచి రా నేస్తమా!
ప్రేమను ప్రేమించేందుకు
ప్రేమను బలపర్చేందుకు
ఒక మంచి కారణం చెప్పు?
కులం అవసరమా!
మత విభజన జీవితమా!
అగ్నితో ఎందుకు చెలగాటం?
పుట్టినప్పుడు లేని తోకల కోసం
పోరాటాలెందుకు?
నేను అబద్దం ఆడటం లేదు.
ఈ రాత్రి
ఈ నగరం ఎందుకో ప్రశాంతంగా ఉంది.
ఆహ్లాదంగా ఉంది.
ఈ ప్రశాంతతను ఇలాగే కొనసాగనిద్దామా!
మరో శుభ ఉదయం కోసం
మనవంతు కృషి మనం చేద్దామా!?
లేచిరా నేస్తమా!
ప్రేమను ప్రేమించేందుకు
సహ జీవనాన్ని పునరుద్దించేందుకు
నేనున్నానని పక్కన నిలబడేందుకు
జీవన న్యాయం వర్ధిల్లేందుకు ....
ప్రేమకై శాంతి కై నిలబడదామా నేస్తమా!

2013, మార్చ్ 23, శనివారం ఉదయం 8.30 గంటలు.

అగ్ని అని ఆగకు .... పద ముందుకు


మండే ఎండలో,
వేడి బొగ్గుపై క్షణం క్షణం,
పెదాలు పిడచకట్టుకుపోతే ఏం 
నీటి కోసం నడువు.
కొట్టాలనిపించిన క్షణం
ఏనుగు కుంభస్తలాన్నే కొట్టు!
నిప్పులమయం జీవితం .... ఎక్కడా ఆగకు!
అతిగా ఆలోచించకు!
విపత్తు అంచున విపత్తు చుట్టూ,
నెక్లెస్ రహదారినొకటి నిర్మించు!
మంటల్లో నర్తించు .... అగ్నిని ఆశ్వాదించు!
కాలం కలిసిరాదెప్పుడూ ....
కష్టకాలం శ్రమజీవనం తప్పదు.
చెమటతో తడిసి
ధ్యేయం, లక్ష్యం అనే సన్నని తీగపై గాల్లో నడువు!
నల్లచిలువ చావు చెడు వార్తలు .... నీ గతం
నీపై ఆరోపించబడిన
నేరారోపణల బోనులో నిలబడ్డావు.
అగ్ని పూలు మీద గుమ్మరించుకుంటున్నావు.
మంటల్లో నర్తిస్తున్నావు.
పట్టు మాత్రం విదల్చకు
గట్టిగా నీ అస్తిత్వంపై నీవై నిలబడు!
రాత్రికి రాత్రి స్వర్గం
దొరకలేదెవరికీ అని మరువకు!
కష్టించాలి .... హృదయంతో జీవించాలి.
నిన్ను నీవు విశ్వసించాలి.
ఎంతో దూరం లేదు స్వర్గం!
అలా అని .... సముద్ర తుఫానులు ఆగి
ప్రశాంతత ఏర్పడేవరకూ
శిలలా చూస్తూ కూర్చోకు!
బడబాగ్నితో పోరాడుతూనే ఉండు
పులితోక పట్టుకుని స్వారీ చేస్తూనే ఉండు
అగ్నిని ఆశ్వాదిస్తూ ఆ అగ్నిలో నర్తిస్తూనే ఉండు!

Tuesday, March 19, 2013

కోతి చేష్టలు



మెడవరకూ కూరుకుపోయాను
అబద్దం వితండవాదం నా నైజం
సాహిత్యకారుడ్ననే అహంకారం
తోకలేని కోతిని మనిషిని నేను
నీకు గానీ నాతో పనుంటే
దయచేసి వెనుకాడొద్దు
ఎవర్నో అడిగే బదులు నన్నే అడుగు
నేను బిజీగా లేను
ఉన్నట్లు నటిస్తున్నాను .... అంతే!
భూమి కి దూరంగా త్రిశంఖు స్వర్గంలో కి
అటునుంచి ఆకాశంలోకి
ఆకాశం నుండి సముద్రంలోకి
సముద్రం నుండి పాతాళంలోకి
కుప్పి గంతులేస్తూ తోకలేని కోతిని మనిషిని నేను

నొప్పులు .... లో లో నాలో


ఇబ్బంది పెట్టను
ఎలాంటి వాగ్దానమూ చెయ్యను
అడుగులో అడుగేసి అనుసరించను
నిన్ను ఎప్పుడూ సందిగ్దం లో పెట్టను
పెదవి విప్పను
మాటల పదాలు తూలను
నీకు కాస్త దూరంగా జరుగుతాను అంతే!
అదీ నీకు సౌలభ్యంగా ఉంటుందని .... మంచి కోసమే

నేను నీనుంచి దూరంగా వెళ్ళిపోవాలి
అలా జరిగితే .... ఇకపై తల బారం ఉండదు
భయపడనక్కర లేదు
అతిగా ఆలోచించక్కర లేదు
ఏనాటినుంచో అసంపూర్ణంగా అనిపిస్తూ ఉన్న భావన ఇది 
ఇలాంటి రోజొకటొస్తుందని ఇలాగే జరుగుతుందని
కలతల కెరటాల ఉదృతి తుఫానుగా మారకముందే
నిర్ణయం తీసుకోక తప్పదని
తీసుకుంటే తప్ప మనసు బారం తగ్గదని

నొప్పులు .....
కనపడని గాయాల చిటపటల .... సెగలు
ఔను నిజమే!
నీవు ఊహిస్తుంది నీ అనుమానమూ నిజమే.

లోలో నేను .... నాలో వెచ్చదనం
నిశ్శబ్దం బద్దలు కాబోతున్నట్లు నాలో ప్రశాంతత
దాచుకునేందుకు నా వద్ద ఇప్పుడు ఏమీ లేవు
నిన్ను చూస్తే నీవు ఏ సమశ్యలనూ పట్టించుకున్నట్లు ఉండవు.
ఎప్పుడూ నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్లే అనిపిస్తావు 
ఎందుకో ప్రేమ విలువ ప్రేమంటే నీకు తెలియదు అనిపిస్తుంది.
వేడి వేడి సూప్ కక్కే ఆవిర్ల నీ మాటలు కరుస్తుంటే 
అందుకే  మరి దేని గురించైనా మాట్లాడాలనిపిస్తుమి నీతో ఉన్నప్పుడు

నొప్పులు
ఒళ్ళంతా కనుపించని
గాయాల .... వేడి వేడి సెగలు ...
ఔను నిజమే నీవు ఊహిస్తుంది నిజమే ....
నీ తోడు లేని జీవితాన్ని ఎరుగను నిన్ను ఒదిలి నేనుండలేను
నాకు నేనే బారం అయిపోతానేమో అని
అలా అని దూరంగా పారిపోయి నీ జ్ఞాపకాల్లో జీవించలేను
నిజం సహచరి మనోహరీ .... నొప్పులు .... లో లో నాలో అంతటా

Monday, March 18, 2013

ప్రియ భాగస్వామ్యమా!


అనగనగా ఒక నేను
ఒకనాడు ఊహలు ఆశలు నమ్మొద్దు అనుకునే వాడ్ని
మొన్న మొన్నటి వరకూ కష్టాన్ని మాత్రమే నమ్మేవాడ్ని
నన్ను నేను పట్టించుకునేవాడ్ని కాదు సరైన దుస్తులు ధరించేవాడ్ని కాదు
బ్రతకడం బాధ్యత అన్నట్లుండేవాడ్ని .... మాసిపోయి ఉండేవాడ్ని
నాకు నేను .... నేను కాని ఇంకో వ్యక్తిని లా
అకారణంగా నన్ను నేను విసుక్కునేవాడ్ని .... నిశ్శబ్దాన్ని ప్రేమించేవాడ్ని
ఎవరైన పలుకరింపుగా నవ్వితే అనాశక్తిగానే నవ్వేవాడ్ని
ఆనందం కనిపించని సంకేతం గా మాత్రమే
అప్పుడు, అప్పుడే ఆకస్మాత్తుగా నువ్వు ఆ దేవుడు విసిరేసినట్లు
వచ్చి చేరావు నా జీవితంలో ప్రవేసించావు ప్రియ నేస్తానివై .... స్నేహభావానివై

నన్ను గురించి
నాకన్న ఎక్కువగా పట్టించుకునే
ఎవరో పక్కనున్నట్లు ఏదో తన్మయత్వం నీవు పక్కనున్నప్పుడు
అనుకోకుండానే అన్నీ నీకు చెప్పేసుకుంటుండే వాణ్ణి
నీతో ఉన్నప్పుడు ఉల్లాసం గా గాల్లో మనసు తేలిపోతున్న భావన
మౌనంగా ఆ క్షణాలు అలాగే ఉండిపోవాలనిపించేలా అనిపిస్తుండేది.
నాకు తెలుసు నీకూ తెలుసని
ఆ భావనలు ఆ బంధం పర్యవసానం స్నేహంగా మిగిలుండదని
నాకు నీ సాన్నిహిత్యం అవసరం అనుకున్నప్పుడు
ముందుగానే ఎవరో చెప్పినట్లు పిలువకుండానే నా పక్కనే ఉండేదానివి
మన ఇద్దరి కలయిక కలిసి కదిలిన క్షణాలు
ఎన్నో నవ్వులు ఆనందాలు బాధలు నిట్టూర్పుల భాగస్వామ్యాలు

నీవూ నేనూ కలిసి వేసిన ప్రతి అడుగు
కలిసి పంచుకున్న ప్రతి ఆనందం .... ప్రేమ బంధం
సంసారం సాహచర్య అనుబంధం బలోపేతం అవుతున్న భావన
నీ కళ్ళలో చూసా .... నీ కళ్ళు వర్షించకుండా
అడ్డుకుని ఊరటగా నిలుస్తూ నేనుంటాననే .... నమ్మకం
నీ తల భారం అనిపించినప్పుడు వాల్చేందుకు నా భుజం ఉందనే .... ధైర్యం
నిజం! .... నీకు మరో విషయం చెప్పుకోవాలి ముఖ్యం గా నీకు తెలియాలి
నీ సాన్నిహిత్యం స్నేహం ఎంతో ముఖ్యం అమూల్యం నాకు.
నా ఆశ నా ఆకాంక్ష నీవూ నేనూ తేనెటీగల్లా ఎప్పటికీ కలిసుండాలని
జీవన పోరాటం లో ఎదురుపడే అన్ని సుఖదుఃఖాలను .... కలిసి పంచుకోవాలని

Thursday, March 14, 2013

సమాజానికి ప్రేమ అవసరం


ఎంత మనోహరం
ఎంత అద్భుతం ఈ లోకం
ఎటు చూసినా ఆత్మీయ భావాలే
స్నేహ అనురాగ చాలనాలే
రోజు వారీ చింతలు కష్టాలు కనిపించనప్పుడు
ప్రేమ భావన మనసులో మొలిచినప్పుడు 
ఎవరూ స్వార్ధులు కారు ....
వికసించిన పూల పరిమళాలను
ఒంటికద్దుకుని యదేచ్చగా తిరుగు సందడులే.
మనిషి ప్రేమలో పడ్డం
ప్రేమించడం .... వయసు తగ్గినట్లనిపించడం.
యౌవ్వన రాగాలే అన్నీ వారిలో .... లోలో

ప్రాణం
జీవితం ఎంత అమూల్యమైనదో
ప్రేమిస్తుంటేనే తెలుస్తుంది
అంతా ప్రకృతి మహిమ
మసికొట్టుకుపోవాలని వెలిసిపోవాలని అనిపించదు.
ప్రకాశవంతం యౌవ్వనపు చైతన్యం ఉత్సాహం
నడవర్చుకోవాలని మనసు ఉవ్వీళ్ళూరుతుంది.
ప్రేమలో పడాలనిపిస్తుంది.
నిన్నటి విషాధచ్చాయలు సమశ్యల తీగలు
ఇప్పుడు ఏమీ చెయ్యలేవు.
అన్నింటినీ తెంచుకుని పురోగమించే శక్తి
ప్రేమను మించిన ఏ కాంక్ష .... ప్రలోభ పెట్టలేవు.

గతం
తొందరపాటు నిర్ణయం
బోర్లాపడిన చిహ్నం గాయం
పోగొట్టుకున్న అవకాశం
సమాధానం మనిషి వద్దే ఉంటుంది ఆ క్షణం లో
చాలా ఆలశ్యం చేసాను అనిపిస్తుంది.
అప్పుడు ప్రేమ మనిషిని పిలుస్తుంది. ప్రేమిస్తుంది.
ప్రేమలో మునిగి ఉన్న భావనలు అంతటా.
సాహచర్యం గమ్యం ఉన్నప్పుడు
యౌవ్వనం తిరిగొస్తుంది.
ప్రతిదీ వేగంగా జరగాలనే ఆశ అతని నిన్నటి నేరం

అన్నీ ఆలశ్యంగానే జరగాలని లేదు
పరిస్థితి అవకాశాలే నిర్ణయిస్తాయి
కాలానికి తెలుసు గమ్యం చేరాల్సిన సమయం
మనిషి ప్రేమలో నిలువెల్లా తడిసినప్పుడు
ఆలశ్యం చేయరాదు. అలా అని తొందర పడరాదు.
మధ్యేమార్గాన్ని చూడాలి. ఆలోచించాలి.
గుండెకు తెలుసు నరనరాల ద్వారా అణువణువునూ
ఎలా చేరాలో .... రక్తం ఎలా ప్రవహించాలో
ఆలోచనల ఆక్సీజన్ తో ప్రేమ రక్తం
ఎలా పరిశుభ్రం చెయ్యాలో 
సమాజాన్ని ప్రేమమయం శాంతి మయం చేసేందుకు
అందుకే గుండెకు తోడు మనసూ ఉండాలి.

Wednesday, March 13, 2013

పారిజాతం పరిమళం


నిశ్శబ్దం రాజ్యంలో ఓ గుసగుస
ఉదయపు సూర్యోదయపు
తొలి దృశ్యం
ఆనందంగా జీవించాలనే
ఆలోచనకు ఆరంభం
నా నుంచి నేను దూరం
జరగాలని
చెల్లచెదురౌతున్న శ్వాస .... నీవు.
నా అడుగుల నడకల
క్రింద శబ్దంగా వినిపిస్తూ
ఎండిన ఆకు .... మన ప్రేమ.
బలవంతంగా చీల్చుకొస్తున్న
నీ నవ్వు
నా జీవనం
బృందావనంలో విరిసిన పారిజాతం.

2013, మార్చ్ 13, బుదవారం రాత్రి 9.50 గంటలు

చరిత్ర పురుషులు


వీరు ....
నమ్మిన సిద్దాంతమే చెబుతారు.
చెప్పిందే చేస్తారు.
తమ చర్య కు తామే బాధ్యులౌతారు.
విశ్వసనీయత నమ్మకం వీరి చిరునామా!
ఎంత వెదికినా దొరకని
ఓ కొత్త రకం జాతి మనుషులు వీరు.
ఏదో సాధించామని విర్రవీగని,
కులకని,
ఉన్నది చెప్పేస్తూ ....
తమను తాము సమర్పించుకుని,
చెడుకు సమాధానం చిరునవ్వే అన్నట్లు
తమ విజయాలు
గొప్పలు, అద్భుతాలుగా ఊదరగొట్టని,
ఓ కార్యకర్త ....
వాస్తవం ఎలాంటిదైనా
ఆనందంగా అందుకునేందుకు
అనుభవించేందుకు సిద్ధం అంటూ
ప్రతి కార్యంలోనూ
ఓ ప్రయోజనాన్ని చూపిస్తూ
సాధించిన తాజా విజయాలు
సమాజానివే అన్నట్లు
సాగే నిండు చైతన్యం
పురోగమనం
ఇక్కడ మన మధ్య .... మనిషై
నాతోనూ నీతోనూ చర్చించని
దుమ్ముకొట్టుకుపోతున్న చరిత్ర పుటల్లో
నిండు అక్షరాల్లా
నూతనోత్సాహం కొత్తవెలుగులై
సమాజం పూసిన పరిమళాలు వీరు.

Tuesday, March 12, 2013

కట్టడి అవసరం



అందంగా ఉంది.
నచ్చింది.
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా
ప్రేమిస్తున్నానేమో .... అనిపించింది.
పలుకరింపుగా నవ్వాను.
ఆమె నవ్వింది .... ఆ నవ్వులో అర్ధం కాని అపహశ్యం
నా ఆశ నిరాశయ్యింది.
ఆమెనూ, ఆమె ఆలోచనల్ని ఒంటరిగా ఒదిలేసాను.
నా మనో వాంచకు వాత వేసుకున్నాను.
ఇప్పుడు,
నా ఆలోచనల్ని నేను కట్టడి చేసుకుంటున్నాను.

Sunday, March 10, 2013

పెంచేసుకుందాం రా .... ప్రేమను


కలిసి ..... చద్దన్నం తిందాం. 
గంజి తాగుదాం.
చెట్టు గూడు నీడలో గూడుందాం. 
శ్రమ జీవనాన్ని అలవర్చుకుదాం.
రా! మడిసీ .... 
కాసింత దూరంలో ఊరుంది.
ఊరు నిండా మరలే
కొందరే మడుసులు.
సాటి మడుసుల్తో మన బంధం
ఖరీదు పెంచేసుకుందాం.
మన మాట
మన విధానాలమీదే మనం నిలబడదాం!
అప్పుడు, స్వర్గం శాంతి మన సావాసం చేస్తుంది.

Saturday, March 9, 2013

మనం


ఉదాహరణ అయి ముందుండి దారి చూపాలి.
గుండెతో ప్రేమించాలి.
ఆత్మ తో వ్రాయాలి.
ప్రతిస్పందనలు వింటూ
ప్రతిసోధిస్తూ పురోగమించాలి
మనం కవులం కళాకారులం!

Monday, March 4, 2013

నేను



శ్వాసించాలి.
రక్తం చిందించాలి.
చరిత్ర తిరగ వ్రాయాలి.
రెప్పలు ఆర్పకూడదు.
ఖాళీగా ఉండటం .... మహా పాపం!
చనిపోవడాన్ని మించిన .... మహా దారుణం.
నిజం నేస్తం .... నన్ను నమ్ము!
ఈ స్థితులన్నింటినీ అనుభవించాను .... నేను.

Sunday, March 3, 2013

తెలియపర్చాలని



ఇది నా ప్రేయసికి, పొగరు దుస్తుల పొరుగమ్మాయికి
నేను ఆరాధించే బాల్యపు నేస్తానికి
నా జీవితమూ .... గమ్యం తనేనని తెలియపర్చే ప్రయత్నం

ఇసుకలో కట్టి కూల్చుకున్న పిచ్చుక గూళ్ళు
అర లాగులో నేను, పొట్టి గౌనులో ఆమె
కొట్టుకుని పోట్లాడుకుంటూ గడిపేసిన క్షణాలు

చిన్ననాటి మా చిరు సంతృప్తుల అనుబంధం
ఆమెను, ఆమెచుట్టూ ఉన్న పరిసరాల్ని,
ప్రేమ వెన్నెల పరిచి వెలుగుమయం చెయ్యాలనే .... నా భావనల్ని

నా మదిలో ఆమె స్థానం ఇదీ అని చెప్పని నా అబిమానం
నా ఉనికిని మించి .... నా కలల అస్తిత్వం ఆమె అని
నా కన్నా ఆమెకే ప్రాముఖ్యం నాలో .... అణువణువులో అని

నా జీవం లో జాగృతమైన ఇంద్రియాలన్నింటికీ తెలుసు
నా ప్రాణం నా శ్వాస నా కలల ఆరాధ్యం ఆమే అని
ఆమె నన్ను ప్రేమిస్తున్న నిజమూ నేను గమనించాననే నిజాన్ని

అందుకే .... ఆమె నన్ను కోరుకుంటుందని తెలిసాకే
ఆమెతో పసితనం అల్లరి భాగస్వామ్యం జ్ఞాపకాల నిధిని
ఆమె ముందుంచుతున్నాను ..... నా మనసంతా ఆమేననే నిజాన్ని

ఒడిదుడుకుల జీవనం లో ఏ సమశ్యల శరమైనా
నన్ను తాకాకే ఆమెను చేరేలా ఆమె ముందు నేనుంటానని,
ఆమెనే పిచ్చిగా  ప్రేమిస్తూ, మనసారా ఆరాధిస్తున్నానని

ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతి రోజూ ....
ఆమెకోసం నా ప్రేమ ఇంతింతై, మరింతై ఎదగాలనే
నా ఆకాంక్ష .... నా ప్రియ భావన ఆమెకు అక్షర నైవేద్యం

Saturday, March 2, 2013

రేపో మాపో మరణిస్తాననే



నిన్ననే
నేను నీనుంచి ....
కావాలనే దూరంగా జరిగాను.
విడిపోవాలనుకుంటున్నాను.
నీ గుండెను రెండుగా పగులగొట్టి .... మరీ,

నిజంగా
అనుకోలేదు.
నేను నిన్నింతగా గాయపరుస్తానని
నువ్వింతగా రోధించాల్సొస్తుందని
నన్ను దోషిని చేసి నీవలా జాలిగా చూస్తావని

నీవింక
ఎప్పటికీ
పరిపూర్ణురాలివి కాలేవు.
నీలో .... నీ హృదయంలో
ఒక భాగం ఇప్పుడు నీతో లేదు.

నీ భావనల్తో
నేను ఆడుకున్నంత స్వేచ్చగా,
మన మధ్య
గాలి చేరలేనంతగా ....
నన్ను నీవు ప్రేమిస్తున్నావని తెలుసు.

నీ కలల
గమ్యాన్ని నేనని,
మనం కలిసి
జీవితాల్ని, సంసారాన్ని .... ఈదాలని,
నీ కోరిక అని .... నాకూ .... లోకానికీ తెలుసు!

ఏ కారణం వల్లో
నేను దూరంగా వెళ్ళిపోతున్నానని .... తెలుసుకున్నావు. అయినా,
నీ భావనల్ని .... నేను తెలుసుకోవాలని,
నీ ప్రేమ నాదే అని .... నాతో చెప్పాలనే నీ ఆతృతను .... కోరికను,
అలక్ష్యం చేస్తున్నాను .... కావాలనే .... నీకు దూరంగా జరుగుతున్నాను.