అయోమయం, అస్పష్టతల నిశ్శబ్దం
నన్ను చుట్టేసినప్పుడు ....
చిత్రంగా
అది నా చెలి ఆత్మేమో అనే అనుభూతే
కలుగుతూ ఉంటుంది మదిలో.
పొగబారిన
మనో అనుభూతుల కోరికల
తడి మాటలు అవగతం కాక
బహుశ అవి .... చెలి గుసగుసలే అని
సరిపెట్టుకుంటుంది హృదయం
శరీరాన్ని అంటిపెట్టుకునున్న వస్త్రం లా ....
తియ్యని తమకమేదో
బద్దకం ముసుగేసుకుని
హృదయాంతరాలాలలో
సున్నిత లక్షణమై ....
ప్రేమగా రూపాంతరం చెంది, అంతలోనే
తెలియని కారణం గా మారి
హృదయం వొణికి .... ఆ కన్నీరు
ఒలికిన కావ్య అణువులు .... ఈ అక్షరాలు.
ఒక అపస్మారకం నుంచి స్మారకం లోకి
చిక్కని నిద్రలోంచి మేలుకువ లోకి
ప్రతి రోజూ ప్రాతఃసంధ్య వేళ
మసకేసిపోయిన
అనుభూతుల ఊహల లోకి
జారి, లోతుల్ని తొంగి చూసుకుని,
మది అద్దం పై పేరుకుపోయిన
ఆ అస్పష్టత మంచును తుడుచుకుని
ఎప్పుడో నాలో పూచిన .... చెలి నవ్వు
జ్ఞాపకం ను వెదుక్కుంటూ,
అది ఒక మోసపూరిత నవ్వు అని
ఏనాడూ అనుకోలేను.
భావోద్వేగాలతో నేను మోసపోయి
అనియంతృడ్నై, ఒత్తిడికి లోనై
ఆ హృదయ స్పందన కన్నీరు
ముఖం పై ఉప్పు చారికై
తలతిప్పుకుని సరిదిద్దుకునే సమయం ....
ప్రయత్నం చేసే లోపు ....
చెలిని కోల్పోయిన వాస్తవం బాధ .... నీడై వెంటాడి
ప్రేమిస్తున్నాయేమో అనిపిస్తుంది.
ఆడుకోవాలని ఆరాటపడి,
వర్షపునీటి బొట్లు కొన్ని ....
నీ ముఖంపై నర్తిస్తూ
ప్రేమోద్వేగ సమయాల్లో
నా వేళ్ళ కదలికల లా
చినుకు, చినుకూ పెరిగి
ఒక్కో చినుకై రాలి
కొంటెగా
బుగ్గపై సొట్టలను చేరి ....
తియ్యని పెదవుల సరిహద్దుల్లో
ఆనందం అమృతమేదో కురిసినట్లు
నీతో మాటలాడాలని
భాషలేని
మధుర భావనలను .... మనసుతో
ఎవ్వరూ అర్ధం చేసుకోలేని
విషయాలను
ఎన్నింటినో
గుసగుసలాడాలని .... చెవిలో
ఊహలు అల్లుకుపోయిన అక్షరాలు,
పదాలు, వాఖ్యాలై
వయ్యారంగా
ర్యాంప్ పై .... పైకీ క్రిందకూ కదులుతూ
నడుస్తూ ఉన్న సిరా
పాళీ నోటి మూలల్లోంచి
మనో భావనై రూపు దిద్దుకుని ....
చిత్రం!
నేను పొందిన
ఆ ఆనందం, ఆ అనుభవం
నాలోనికే యింకుతూ
ఎన్నాళ్ళనుంచి తింటూ ఉన్నానో
నేను
ఈ జీవితాల కధను, కవిత్వాన్ని
ఆనందం మధుకము,
ఎంత తియ్యని రుచి
ఆకాశం నుంచి
రతీ మన్మధులు వెదజల్లిన
పుష్ప పవిత్ర రసం
అమృతం
ఒక సన్నని, సున్నిత బంధమై
మనసుల్ని, చూపుల్నీ ....
కలిపి ఒకచోట
ఖండించి వేరు చేసి ఒకచోట
ద్వేషం గుండెలు చీల్చి,
అహం
కుత్తుకను తెంపి,
ఎదలో మది ఒత్తిడి ప్రతిధ్వనై
ఎదల విశ్వసనీయత ఆధారంగా
మరణ పంజరం
కలలా, గమ్యంలా
బంగరు ధనస్సు ముక్కలై
పొందిన విజయోత్సాహం, బహుమానం .... ప్రేమ
ఆ పరామర్శ .... ఒక మౌని పలుకరింపు
ఆ నవ్వు .... గద్గదికంగా గుండెతో నవ్వినట్లు
అతి సున్నితమైన ఆలోచనలు అవి
ఎంతో నిర్మలము
స్వచ్చము, దివ్యమైన ముఖం ....
ఒక చిత్రమైన అనుభవం అతను.
ఏ పని కైనా ఉపక్రమించినప్పుడు,
అవసరం ఏర్పడి, అడగాలనిపించినప్పుడు
అంతగా బ్రతిమాలాడాలా అని .... సిగ్గుపడుతూ అతను
చెయ్యందించి, సహకరించుతూ
ఆ అవసరం ప్రాముఖ్యతను తగ్గిస్తున్నప్పుడు
హిమాలయం అంత ఎత్తు ఆదర్శం అతను.
ఒక్కోసారి
నామమాత్రపు అవసరమే అయినా
నేనున్నాను అంటూ నిలబడి
సామాన్యుడిలా, ఎంతో సామాన్యంగా
సమశ్య తనదే అన్నట్లు పోరాడుతున్నప్పుడు
ఒక నమ్మకమైన ఆత్మ బంధువు అతను
నిజం! నిజంగా ....
ఎంత గర్వం అనిపిస్తుందో
అతని లాంటి నిగర్వి ని తెలిసిఉండటము
నా హృదయం అద్దంలోకి చూస్తూ
విశ్లేషించుకుంటున్నాను.
విజనప్రదేశములో వెదజల్లిన అందం
స్వచ్ఛంద ఖైదీ ని .... నేను,
స్వర్గ భోగాలకై శ్రమిస్తున్నాను అని
దూరంగా పొగమంచులా ముసురుకునున్న
విపరీత లక్షణాలు .... నా ఊహలు, కోరికలు అని
దేవత ఎవరో
ఎత్తుమించి క్రిందకు నేలమీదకు దిగుతూ
నా వైపే నవ్వుకుంటూ వస్తూ .... నన్నుద్దరిస్తుందని
ఒకవేళ నేను, ఆశ ఉండి .... అనుభవేచ్చలేని
మానసిక స్థితి నుండి బయటపడగలిగితే .... నిజంగా,
నా స్వీయ సృష్టి త్రిశంకు భావనల
తపోధనం .,... మరుపురాని
ఆ అద్భుత పరిమళాల్ని కాపాడుకోగలిగితే
నరకమూ, పాతాళమూ
మనకు సంబంధించినవి కావు, లేవనుకునే
చిత్తశుద్ధి ఉంటే ....
నిజంగానే ఒప్పుకుంటాను.
మనం జీవించేదీ, మనం ఉన్నదే .... స్వర్గం అని
అతనిది
మంచి మనస్తత్వం
లేదా
చెడు మనస్తత్వం
తేడా ఏమిటి?
అతనే లేకపోతే
అతను
బలహీనుడు
లేదా
ఎంతో సమర్ధుడు
తేడాఉందా?
అతనే మరణిస్తే
కాలయాపన తగునా
ఆలోచనలతో
పోయేవరకూ
ప్రేమించేందుకు.
కొరుక్కుతినాలనిపించి
స్వయంగా దాచేసుకోవాలనిపించే అందాన్ని కావాలని
తినదగిన పదార్ధం రుచిని కావాలని ....
నేను
ఆకలి తీర్చగలిగిన .... ఏ రకంగా, ఎవరికైనా ఉపయోగపడగలిగిన
వేడి గా, రుచిగా సుచిగా ఉండి
ఆర్చుకుని, ఊరించేంత ఆరోగ్యకరమైన ఆశను కావాలని ....
నేను
అందుబాటులో ఉండి, ఎవరూ గమనించరాదని
సామాన్యుడు .... తన పిడికిట్లో దాచుకోవాలనిపించే
స్వార్ధానికి అంకురాన్ని కావాలని ....
నేను
గాయపడి నలిపేయబడి డస్ట్ బిన్ లోకి విసిరేయబడి
ఒక వృధా పదార్ధాన్ని కారాదని
అలసిన జీవితం లో .... అందమైన అనుభూతిని అయినా చాలని .....
నేను