Friday, April 1, 2016

అతివాదినైన కొన్ని క్షణాలు




కోల్పోయాను నన్ను 
అభిమంత్రితమైన ఆ అడవిలో 
చుట్టూ చెట్లూ పుట్టలు 
పొద్దు కనపడనంత దట్టంగా 
తిరిగి వెళ్ళేందుకు దారుల్లేక 
అయిష్టంగానే ....
అంతా అంధకారితము
నన్నూ, చివరికి నమ్మకాన్నీ 
మార్చుకోలేని అస్థిరత  
అనిర్వచనీయ భయం ఏదో 
పర్యాప్తము 
అది ఒక నిషిద్ధారణ్యం 
ఊడలు బలంగా పాతుకున్న చెట్లు 
చిరిగిన దుస్తులు 
మధ్యలో అగమ్యుడ్నై 
రక్కుకుపోయిన శరీరం 
గాయాల పుండుపై 
భయాన్ని ఊదుతూ అతివాదం 
నిశ్శబ్దం ఏడుపులు 
దయ్యాలు ద్వేషంతో 
నన్ను పేరుపెట్టి మరీ పిలుస్తున్నట్లు 


బాధ నిరాశ నిస్పృహల 
మబ్బులు ఆవహించి 
కుంభవృష్టి 
కాలువలు వాగులై వరదలై 
మురుగు నీరు 
ఆ నీటిపై తేలుతూ నేను  
అంతా చీకటిమయం, 
ఆవేశం మానవత్వాన్ని దబాయిస్తూ 
అక్కడ ప్రేమ లేదు. 
వెలుగు లేదు. క్రమబద్దత లేదు. 
ఉన్నదంతా కారు చీకటి 
కారు మానసికత 
క్షతి, నరకమయ జీవనమూ 

No comments:

Post a Comment