ఇప్పుడే తెలిసింది,
ఈ భూగొళం
గుండ్రంగానే ఉందని ....
వెలుగు, నీడ
ఆనందం, బాధ
ఆశ, ఆకాంక్ష ల
చుట్టూ పరిబ్రమిస్తూ ....
ఉన్నచోటే నేను ఉన్నానని,
ఇప్పుడే తెలిసింది.
ప్రతి రోజూ మబ్బులు
ఎక్కడో వర్షిస్తూనే ఉంటాయని,
రేపటి లో
జీవిస్తున్న నేడు లా ....
నేడు, ఈ దేశంలో
రేపు, ఏ దేశంలోనో
ఎన్ని సముద్రాలు దాటి,
ఎంత ఎగిరినా ఎంత చూసినా
ఈ భూమికి, సమాజానికి
ఎంత ఉపయోగం .... నేను అని ప్రశ్నలు
ఎన్ని తపనలు, ఎంత తిరిగినా
తిరిగి, తిరిగి
బయలుదేరిన చోటుకే
వస్తూ ఉన్నా!
కొలవలేని కాలం దారం
పట్టుకు వ్రేలాడుతూనే ఉన్నా!
అమ్మ ఒడిలో
ఆడి పెరిగిన పసితనం
బ్రతకడం కోసం
మానవారణ్యంలో
పరుగులు తీస్తూ .... నేను
వేసిన అడుగులు కొన్నే గుర్తున్నాయి.
పొరపాట్లు చేసి దిద్దుకున్న క్షణాలు అవి.
ఇప్పుడు జీవితం అంచుకు చేరాక
వాడి రాలే వయసు లో
ఈ ముసలి ప్రాణం కల మాత్రం
కూతురుకు కొడుకుగా
పుట్టేందుకు సిద్దమై ఎదురుచూస్తూ ....
ఈ భూమిని గుండ్రంగానే చూస్తున్నా!
No comments:
Post a Comment