Wednesday, May 15, 2013

నీతో లేను నేను


దూరం పెరుగుతుంది ఒడ్డుకు
నీకు
దూరంగా నెట్టేస్తుంది కాలం!
ఆకాశాన్నందుకోవాలనుకునే ఆశల అలలు ....
కడలి లో కూలి,
ఎన్ని విరిగిన కలల ఆశల అలలో ....
అవి మన నిస్పృహ ల వృధా ప్రయత్నాలు!

విచిత్రమైన సంకేతాలు
ప్రమాద సూచికల్లా ....
నిర్లిప్తత, సంశయం .... కనురెప్పల మాటున మెరుస్తూ,
ఎరుపు తెలుపు రంగులు .... ఇంద్రధనస్సులు కావవి ....
కరంట్ షాక్ కొట్టినట్లు,
ఒకరినొకరం పరిశీలనగా ....
చూడడం మొదలెట్టిన క్షణాలవి!

నా కనిపించింది.
ఈ సంసారసాగరాన్ని సులభంగానే ఈదగలమని,
ఇద్దరం ఒక్కరుగా కలిసుంటే ....
ఎవరి సలహా సంప్రదింపులు అక్కరలేదని,
కానీ, ఏదో జరిగింది!
మన ప్రమేయం లేకుండానే .... ఎక్కడో,
మనం బ్యాలెన్స్ కోల్పోయాము.

నాకు నీవు
నీకు నేను దూరం అవ్వసాగాము.
ఒకరినొకరం కోల్పోసాగాము.
పెరుగుతున్న ఆ దూరాన్ని గమనించనట్లు,
నీ ప్రేమ స్వచ్చమని నేను,
నా ప్రేమ స్వచ్చమని నీవూ ....
పిచ్చి ఆలోచనలు చేస్తూ వచ్చాము!

నాటి
మన ఏకాంతాలు, జ్ఞాపకాలు ....
ఒకరికై ఒకరు పడిగాపులు కాయటాలు
పువ్వులు, పచ్చదనాలు
కోకిల గానాల్ని ప్రేమించడాలు
ముద్దులు ముచ్చట్లు అరుదవుతూ,
నెమ్మదిగా నెమ్మదిగా దూరం పెరిగింది.

కాలనీలో
మనం ప్రతి నోటా నానిన ఒకనాటి జంట!
చిలకా గోరింకా
ప్రేమ కథ ముగింపు ....
సుఖాంతం కాదని విన్నాము!
ఎడబాటు, ధ్వంసం అవుతుందని తెలిసీ,
నిర్లక్ష్యం చేసాము .... వినోదం గా మిగిలాము.
అందరూ ఆడుకునే ఆట కావొద్దనుకుంటూనే,

ఇప్పుడు
నీ మదిలో నేను లేనని తెలుసు.
నీవూ గ్రహించే ఉంటావు.
ఒకనాటి నా ఎద పులకరింపు వు
నా ఆలోచనల గమ్యం .... నీవు.
నేడు జీవితం ఆశల పోరాటంలో
అలల్లా ఎవరికి ఎవరూ ఏమీ కానట్లు విరిగిపోతున్నాము.

2 comments:

  1. ధన్యాభివాదాలు పద్మ అర్పిత!

    ReplyDelete