Monday, May 6, 2013

వినిపిస్తూనే ఉన్నాయి నీ రోధనలు .... ఓ ప్రియతమా!


వరద కన్నీరు
ఉబుకుతుంది ఉప్పెనలా నీ కళ్ళలోంచి
చేదుకుందామని అండనై 
చెయ్యందించాలని తపన నాలో
నీవు దూరంగా వెళ్ళిన క్షణం నుంచి
వినిపిస్తూనే ఉన్నాయి నీ రోధనలు
ఆ కన్నీరు రాలుతున్న శబ్దాలు

ఒంటరిగా
చీకటి నిశ్శబ్ద కుహరంలో
ఎవరి చేతో బంధించబడ్డట్లు
నా నుంచి నీవు నీనుంచి నేనూ
ఒకరికొకరం దూరమైన క్షణం నుంచి
ఆ ఏడుపులు నాకు వినిపిస్తూనే ఉన్నాయి
ఆ నిర్వేదం మోడ్రన్ ఆర్ట్ లా కనిపిస్తూనే ఉంది

ఎన్ని లక్షల ముత్యాలో ఆ కన్నీళ్ళు
రాలి చెల్లచెదురౌతూ విసిరేసినట్లు
ఓ ప్రియా నిరాశ చెందకు!
పట్టించుకోకు సమాజాన్ని .... పుకార్లని
నీ గుండె స్రవిస్తుందని తెలుసు
రంగు మారిన నీ కన్నీరు ....
ఆ రక్తపు బొట్లను గమనిస్తూనే ఉన్నాను.

ఒంటరి ఏకాంతంలో మౌనానివి
ఓ నేస్తమా!
బాధల మడుగు ఊబిలో
ఎవరూ లేనట్లు కూరుకుపోతూ
ఆశగా శున్యంలోకి చూస్తున్నావు?
నిజం! మనం ఒకరికొకరం దూరమైన క్షణం నుంచి
వినిపిస్తూనే ఉన్నాయి నీ రోధనలు ....?

2013, మే 06, సోమవారం రాత్రి 9.30 గంటలు.

No comments:

Post a Comment