Monday, November 26, 2012

మనసు పరితాపం!

మనసు పరితాపం!

నీదృష్టిలో పడాలని నీవు నన్ను గమనించి,
గుర్తించాలని నా మనసు ఆశ
నీ ఆనందం చూడడం కోసం
నీవు ఇష్టపడటం కోసం ... ఏదో చెయ్యాలని
జుట్టు స్టైల్ మార్చుకోవాలని?
విచిత్రధారణ చెయ్యాలని?
నడక లో వడిని నాణ్యతను పెంచాలని?
మాట్లాడేప్పుడు పదాల స్పష్టతను మృధుత్వాన్ని పెంచాలని

ఎన్ని నాళ్ళ నుంచో ...
ఎన్ని జన్మలబంధమో నీదీ నాదీ అన్నట్లు,
నా మనసు భావన ...
నా ప్రేరణా శక్తివి నీవని అనుకుంటుంటాను.
నీవు మాత్రం నన్ను సహచరుడిగానే చూస్తున్నావు.
నా భావనల నిజ అస్తిత్వం కానీ, నేను కానీ ... నీకు తెలియదు.
సముద్రమంత లోతు ప్రేమ నీవంటే నాకు అని కానీ,
నా మనసెప్పుడూ ... మనోభావనలు
నీకు మాత్రమే తెలియాలని అనుకుంటుంది అని కానీ,
నువ్వేదో వస్తువైనట్లు నిన్ను సొంతం చేసుకోవాలని ...
నా మనో వాంచ అని కానీ ... నీకు తెలియదు.

కళ్ళు మూసుకున్న ప్రతిసారీ
నీ చిరునవ్వు నిర్మలత్వం ... నీ ముఖమే కనిపిస్తుంది.
అందాల బరిణల్ని, వయసు చమక్కుల్ని,
అతివలెందర్నో చూసా ... కానీ
నీలో ... నీ నడవడికలో ఏదో ...
నాకు మాత్రమే చెందిన ఐశ్వర్యం ఉన్నట్లు
ప్రత్యేకతల్లా ... మనసు ఊరటల్లా నీ సహజీవిలా,
కలిసి పనిచేస్తున్న నీ కొలీగ్ గా నీ సాన్నిహిత్యం.
నామ మాత్రపు స్నేహితుడిగా మాత్రమే తెలుసు నీకు నేను
కానీ, నేను నీవు వదులుకోలేని స్నేహాన్ని
అంతకు మించి ఏమీ కాని మనోభావాన్ని కూడా ...

మరీ ముందుకు కదలలేను ...
భయం ...
పరితాపం చెందాల్సొస్తుందేమో అని,
అందుకే
ప్రస్తుతానికి నీ స్నేహం చాలనుకుంటున్నా!
అతిగా ఆశించి ...
నిన్నూ,
నీ నా బంధాన్ని ప్రశ్నార్ధకం చెయ్యాలని లేదు.
నా ప్రేమను నాలోనే దాచుకుంటా!
గాంభీర్యం ముసుగులో నన్ను నేను దాచుకుంటా!

ఓ రోజొస్తుందని నమ్మకం ...
మనసు బృందావనంలో
చెట్టాపట్టలేసుకుని నీవూ నేనూ కలిసి తిరిగే రోజు
నేను నీకోసం నీవు నా కోసమే అని నీవూ అనుకునే రోజు
అప్పటివరకూ
ఎదురుచూపుల తపస్సు ఇలాగే చేస్తుంటాను.
ఒంటికాలు మీదే అయినా ...
కనులు కాయలు కాసినా ... చూస్తూనే ఉంటాను
ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతానేమో అని
వెళ్ళేలోపు నా మనసు పరితాపం నువ్వు గుర్తించాలని ...

No comments:

Post a Comment