Thursday, November 7, 2013

నీవో ప్రేమలేఖ రాస్తే ....

నీ పద మనోభావనలను
చదువుతూనే
నా ఊపిరి ఆగిపోయేలా
ఒక లేఖను
నీ అంత అందంగా
అక్షరాలు అద్ది
నీవో ప్రేమలేఖ రాస్తే ....

అది చదివినప్పుడు
ఆ అక్షరాల కత్తులు
నన్ను నిలువునా చీల్చేసి
నాలోని,
నా ప్రపంచపు రహశ్యాలన్నీ
వాటంటవే తుళ్ళిపడి
...............
ప్రకృతి సర్వం
నన్నే అసూయగా చూస్తే ....

ఔనూ!
అలాంటి లేఖను
నాకే అని అనుకోగలనా ....
ఎంత నీవు ఎంత ప్రేమగా రాసినా?

Wednesday, November 6, 2013

నా ప్రతి కదలిక కారణం నీవు

నా కళ్ళలోకి చూడు.
నా భావన,
నా ఉద్దేశ్యం లో ....
నీ స్థానం ఏమిటో
నీకు అర్ధం అవుతుంది.
పిదప
నీ గుండెలో,
నీ ఆత్మలో వెదికి చూడు
అక్కడ నేనున్నానేమో అని,
దొంగను నేను
అక్కడ దొరికిపోతాను.

నాతో చెప్పాలని
నన్ను మార్చాలని చూడకు.
ప్రయోజనము ఉండదు.
ఏ ప్రయోజనమూ ఉండదని
నీవు చెప్పలేవు.
నాకు ఏది ప్రాణాధికమో?
నీకు తెలుసు!
నా నడవడి ....
నా ప్రతి అడుగులోనూ
ఆ చైతన్యం
ఆ కదలిక నీవే అని.

నీ గుండెలోకి చూసుకో
నీవూ గమనిస్తావు.
అక్కడ,
ఎలాంటి రహశ్యం లేదు.
ప్రశాంతంగా ఉన్నాను.
నన్ను నన్ను గా
ఉన్నట్లే చూడు!
నన్ను గుర్తించు!
నాదీ అనే ప్రతిదీ ఇచ్చేస్తా అని
ఒట్టేసి చెబుతున్నా!
నన్ను నేను సమర్పించుకుంటాను.

నీ ప్రేమ ను మించిన
ప్రేమను నేనెరుగను.
ఉందని అనుకోను.
ఔనూ!
మరింతగా,
నీ ప్రేమను పొందగలనా అని
శోధించాలి అనుకుంటున్నాను.
అన్ని వేళల్లోనూ,
అన్ని పద్ధతుల్లోనూ,
ప్రేమించాలనుకుంటున్నాను.
నీతో ఉండాలనుకుంటున్నాను.

నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలని చూడకు.
ప్రయోజనం ఉండదని,
నిర్ణయించేసుకున్నాను.
నిన్ను మించి నాకింకేమీ అక్కర్లేదు.
నీ కోసం పోరాడతాను.
నీ కోసం అబద్దాలాడతాను.
నీ కోసం సర్కస్ లు చేస్తాను.
నీ కోసం మరణిస్తాను.
నిజం చెబుతున్నాను .... పిల్లా!
నా ప్రతి అడుగులో
ప్రతి కదలిక, నీ అబిమతం
నీవు భాగం కావడం నా ఇష్టం!


Tuesday, November 5, 2013

పరుగుపందెం


పడిపోతానేమో అని
భయపడకు.
తొలి అడుగుల పసివయసు లో,
సాహసము,
ప్రయత్నమే ఊపిరి.
జీవితం పరుగు పందెం లో,

Monday, November 4, 2013

ఉబలాటం

కొన్ని జీవితాలు ....

సొగసుగా, 
నాణ్యంగా, 
విలక్షణంగా కత్తిరించిబడి 

మరి కొన్ని మాత్రం  

యెండి, 
వట్టిపోయి, 
శుష్కించి పోయి ....

ఒకే ప్రపంచం లో భిన్న జీవ సరళులు.

నీ ప్రపంచం లో నీవు, 
నా ప్రపంచంలో నేను. 

ఒక్క రోజైనా,  

ప్రత్యేక ప్రపంచాలు లేని 
పేనిన దారాలం .... మనమై  
ఏక దృష్టితో .... 
రెండు గళాల ఏకరాగాలమై,  
జీవన గాంధర్వం ఆలపించి .... 
ఆనందించాలని .... ఉబలాటం.

ఆ రోజు వస్తుందా అనే. 

మనం!

నేను, నీవు ....
కవితల్లో కూడా 
వేరు వేరు పదాలం అయి 
వ్యవధి, ఖాళీ .... ఆ పదాల మధ్య 
.... అవసరమా!

నీవు

జీవితం ఒక పాట అయితే,
నా పాటకు పల్లవి వి
లేదా 
కనీసం 
ఎదురొచ్చే చిరునవ్వు వి .... నీవు.

తోడు


దయచేసి నన్ను గమనించు.
తెలియని దూరాలు నడిచి వెళుతున్నప్పుడు, 
నన్ను నేను కోల్పోయే ప్రమాదం ఉంది.
తిరిగొచ్చే మార్గం మరిచిపోయి ....
అందుకే, 
నీడవై నా తోడు రా!  
నన్ను తిరిగి నా గూటికి చేర్చేందుకు. 

ఓ సహచరీ!

ఓ సహచరీ, 
ఓ ప్రియా!
నా కోరిక 
నిన్ను 
నా భాగస్వామిని గా  
చేసుకోవాలని.

ఆ కొండ శిఖరాల 
అంచుల మీద నిలబడి ....
"ఓ చెలీ, నిన్నే ప్రేమిస్తున్నా!" అని, 
నా హృదయపు లోతుల్లోంచి,
గొంతెత్తి అరవాలని ....
ఆశ పడుతున్నాను. 

నా మనసు పడే ఈ ఆరాటం, 
ఈ పోరాటం, 
ఈ సమశ్యలన్నింటినీ 
దాటి, జీవన సాగరాన్ని 
ఈదేందుకు నీ సాహచర్యం 
తోడును అభిలషిస్తున్నాను.  

నీకు నిజంగా,
నా వ్యక్తిత్వం, నా సాహచర్యం పై 
నమ్మకమే ఉంటే ....
నా నువ్వని 
నిన్ను నీవు అనుకుంటే, 
నా చెయ్యందుకునేందుకు ముందుకు రా!
  
నా ఒక్కడి ఆశ, ఆలోచన 
ఉద్దేశ్యం మాత్రమే సరిపోదు.
ఈ సమాజం, నన్నూ నిన్నూ లను 
ఒక్కటి చెయ్యలేదు.
అది ఒక్క నీకూ, నాకే సాధ్యం  
నీవూ, నేనూ నిర్ణయించుకునే భవితవ్యం కనుక. 

ఓ మహిళా నీకు జోహార్లు!


పరిమాణం లో గుప్పెడంతే 
నీ గుండె ....
కానీ, 
అల్లకల్లోల సమయాల్లో, 
అస్తవ్యస్తం కాని 
ధైర్యం మనోబలం 
నీ కళ్ళలో చూస్తున్నాను.

ఏదీ సవ్యంగా జరగక, 
ఒడిదుడుకుల మయ జీవితం లో
ప్రతిదీ ప్రతికూలం అయి,
నీదీ అనుకున్న అన్నింటినీ
కాలం నీనుంచి లాక్కుని 
త్యజించాల్సొచ్చి
తలొంచుకోవాల్సొచ్చిన క్షణాల్లో 
నీలో ....
సానుకూలతను చూస్తున్నాను.

నీ భావనల్లో ఎనలేని 
ఆ నమ్మకం
నిన్ను నీవు కోల్పోతావేమో 
అనిపించిన సమయాల్లో,  
నీ పాత్ర పోషణలొ 
చూపించే ఉదాత్తతను, 
నీ వ్యక్తిత్వాన్నీ .... 
ఎంతో సరళంగా పోషిస్తుండటాన్ని ....
చూస్తూ ఉన్నాను.

ఎప్పుడూ చెదరని 
ఆ చిరునవ్వు 
రవ్వంతైనా సడలని 
ఆ ఆత్మస్తైర్యం, 
ఓ మహిళా! 
నీ గుండె ధైర్యానికి జోహార్లు!