Tuesday, February 21, 2017

అవ్యవస్థీకృత అందం



కాలుతున్న కోరికల
విరజిమ్మిన పొగల ఆవిరులు
కామమోహపుటాలోచనలు
మంటలు రాజుకుని కాల్చేయబడిన
ప్రియ అవశేషాల
బూడిద రాసులు అవి

ఏ పగిలిన గుండెల విరిగిన ఎముకల
కలిసిన అనుబంధాల
చిరిగిన అనురాగాల
సామాజిక వ్యక్తావ్యక్త అగ్రాహ్య,
అబోధ్య ప్రేమ పరిమళాలో అవి


సూర్య కిరణ ప్రచండ వేడిమి కి
మాడిన దూళి సెగలు
ఫెళఫెళమను ఉఱుముల
విలయ ఘర్జనల విన్యాసాలు అవి
దూరంగా ఎక్కడినుంచో
వినీవినబడకుండా వినిపిస్తున్న
పల్లె జానపదాలను స్తబ్దం చేస్తూ

ఆ ఘటన సంఘటనల
అవగాహనారాహిత్య పరిస్థితుల
సుడిలో కొట్టుకుంటున్న సగటు మానవుడి
ప్రతిబింబాన్ని చూస్తున్నా
నేను చూస్తుంది నన్నే అయినా
నన్ను కాదేమో అనిపిస్తుంది ఎందుకో

నేను, నా అస్తిత్వం మారినట్లే
ప్రపంచమూ మారి
అసంపూర్ణత్వం అవ్యవస్థీకృతమైన ....
పరిణామక్రమం లా
ఆ క్రమంలోనూ ఏదో అందం ....
ఆకర్షణ మిళితమై ఉన్నట్లు ఆకర్షిస్తూ

No comments:

Post a Comment